News


ఏటీఎఫ్‌, వంట గ్యాస్‌ ధరలకు రెక్కలు

Thursday 2nd January 2020
news_main1577935675.png-30601

(అప్‌డేటెడ్‌...)

ఏటీఎఫ్‌ ధరలు 2.6 శాతం పెంపు
సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 పెంపు

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్‌ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్‌ ధరలు 2019 జూన్‌ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్‌ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవిచూస్తున్న ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల ప్రతికూలం కానుంది.
రూ.714కు ఎల్‌పీజీ సిలిండర్‌... 
సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.695 నుంచి రూ.714కు ఆయిల్‌ సంస్థలు పెంచేశాయి. గత సెప్టెంబర్‌ నుంచి వరుసగా నాన్‌ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెరుగుతూనే ఉండడం గమనార్హం. గడిచిన ఐదు నెలల్లో సబ్సిడీ లేని ఒక్కో సిలిండర్‌ ధర నికరంగా రూ.139.50 పెరిగింది. ఒక ఏడాదిలో ఒక వినియోగదారుడు 12 సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు మార్కెట్‌ ధరను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నెలలో అంతర్జాతీయ రేట్ల సగటు ఆధారంగా మరుసటి నెల మొదటి తారీఖున ఏటీఎఫ్‌, ఎల్‌పీజీ ధరలను పెంచడం జరుగుతోంది. ఇక ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే లీటర్‌ కిరోసిన్‌ ధర 26 పైసలు పెరిగి ముంబైలో రూ.35.58కు చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు ప్రతీ నెలా 26 పైసల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం గమనార్హం. 



You may be interested

డిసెంబర్‌ వాహన విక్రయాలు: మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి

Thursday 2nd January 2020

మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి హ్యుందాయ్‌, టయోటా విక్రయాల్లో క్షీణత న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్‌లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు.. పండుగల సీజన్‌ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధి రేటును నమోదుచేయడమే

నిఫ్టీ మద్దతు 12,158, నిరోధం 12,214

Thursday 2nd January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు మైనస్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,241 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,243 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం(1న) తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ మార్కెట్లు తదుపరి కొంతమేర మందగించాయి.

Most from this category