News


రెండు దశల్లో బీపీసీఎల్‌ వాటాల విక్రయం!

Friday 22nd November 2019
news_main1574406967.png-29784

అమ్మకానికి ముందు జేవీల నుంచి ఎగ్జిట్‌ యోచన
రిటైలింగ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాల డీమెర్జర్‌ ఆలోచన
ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ప్రభుత్వం
బీపీసీఎల్‌ వాటా విక్రయానికి ఎక్కువమంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అవలంబించనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ నుంచి కొన్ని అసెట్స్‌ను వేరు చేయడం(కంపెనీ వ్యాపారాలను డీమెర్జ్‌ చేయడం లేదా జాయింట్‌ వెంచర్ల నుంచి బయటకు రావడం), షేర్ల విక్రయాన్ని దశలవారీగా పూర్తి చేయడమనే వ్యూహాన్ని ప్రభుత్వం పాటించనుందని తెలిసింది. ఇందులో భాగంగా బీపీసీఎల్‌ ఆస్తులను(అసెట్‌ ట్రైఫరికేషన్‌) మూడు భాగాలుగా విడగొట్టడంతో పాటు షేర్ల విక్రయాన్ని  రెండు దశల్లో నిర్వహిస్తారని తెలిసింది. రెండు దశల విక్రయం తొలిదశలో ప్రభుత్వానికున్న 53.29 శాతం వాటాలో 28- 30 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడిదారుకు బదిలీ చేయడం, దీంతో పాటు యాజమాన్య హక్కులను కూడా బదలీ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటాను ఓపెన్‌ మార్కెట్లో విక్రయించవచ్చు. అదేవిధంగా కంపెనీ భాగస్వామిగా ఉన్న జాయింట్‌ వెంచర్ల నుంచి వైదొలగాలని, తద్వారా కొత్త యాజమాన్యానికి ఎలాంటి చికాకులు లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
విడగొట్టు.. ఆకర్షించు...
అసెట్స్‌ విడతీయడంలో భాగంగా ఇప్పటికే కంపెనీ నుమాలిగఢ్‌ రిఫైనరీని విక్రయం నుంచి వేరు చేసేందుకు కేబినెట్‌ అనుమతినిచ్చింది. దీన్ని విడతీయడంతో కంపెనీ వాల్యూషన్‌లో పెద్దగా మార్పు ఉండదు. అదేవిధంగా కంపెనీకి బైనా రిఫైనరీలో ఒమెన్‌ ఆయిల్‌ కంపెనీతో ఉన్న జాయింట్‌ వెంచర్‌ నుంచి కూడా వైదొలగవచ్చని తెలుస్తోంది. ఇందులో వాటాను ఒమెన్‌ ఆయిల్‌కే ఆఫర్‌ చేసే అవకాశం ఉంది. కానీ బైనా రిఫైనరీ లేకుంటే బీపీసీఎల్‌ విలువ కొంత తగ్గే ఛాన్సులున్నాయి. ఇదే విధంగా కంపెనీ రిఫైనింగ్‌, రిటైలింగ్‌ వ్యాపారాలను వేరు చేసే యోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు రిటైలింగ్‌ వ్యాపారం కోసం అంతర్జాతీయ కంపెనీలు ముందుకు రావచ్చని అంచనా. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్‌లో రిటైలింగ్‌ వ్యాపారం దిగ్గజ చమురు కంపెనీలకు లాభసాటి కానుంది. ప్రస్తుతం డీఐపీఏఎం సౌదీ అరామ్‌కో, టోటల్‌ ఎస్‌ఏ, ఎక్సాన్‌ మొబిల్‌, బీపీ లాంటి బడా ఇన్వెస్టర్‌ను అన్వేషించే పనిలో ఉంది. చమురు మార్కెట్‌ అంతర్జాతీయంగా మందగమనం ఎదుర్కొంటున్న సమయంలో ఇంత పెద్ద డీల్‌కు ఇన్వెస్టర్‌ను వెతకడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. ఎలాగూ దేశీయంగా ఏ కంపెనీకూడా బీపీసీఎల్‌ కొనుగోలుకు కావల్సిన నిధులు సమకూర్చుకోలేవు కాబట్టి రష్యా, గల్ఫ్‌ తదితర చమురు ప్రాధాన్య దేశాల ఇన్వెస్టర్లను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుటోంది. ఇందుకోసం ఆయా ప్రభుత్వాలతో నేరుగా మన ప్రభుత్వం చర్చలు జరపాలని భావిస్తోంది. ఇంకో వైపు అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ దొరకకపోతే దేశీయ పీఎస్‌యూలైన ఐఓసీ, ఓఐఎల్‌లాంటి వాటితో బీపీసీఎల్‌ను కొనుగోలు చేయించే స్టాండ్‌బై ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. 


అంచెలు రెండు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1.05 లక్ష కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణల టార్గెట్‌ను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత వాల్యూషన్స్‌ ప్రకారం బీపీసీఎల్‌ విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు కాగా ఇంత మొత్తం ఒకే దఫా వెచ్చించేందుకు ఏ ఇన్వెస్టరు ముందుకు రాకపోవచ్చని, అందువల్ల షేర్ల విక్రయాన్ని రెండు దఫాలుగా చేపట్టాలని ప్రభుత్వ భావన. 53.29 శాతం వాటా విలువ దాదాపు రూ. 60వేల కోట్లు కాగా, టేకోవర్‌ నిబంధనల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ కింద మరో రూ.40వేల కోట్లను పెట్టుబడిదారు వెచ్చించాల్సిఉంటుంది. ఇంత మొత్తం ఒకేసారి ఒకే సంస్థ చెల్లించడం ఇబ్బంది కనుకనే రెండు దశల్లో వాటాను విక్రయిస్తారు. అప్పుడు తొలిదశలో ఇన్వెస్టర్‌ రూ.30వేల కోట్లు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇలా రెండు దశల్లో విక్రయించడంతో ప్రభుత్వానికి మరింత లాభదాయకం అవుతుంది. తొలిదశ విక్రయానంతరం మలిదశ సమయానికి కంపెనీ విలువ మరింత పెరిగితే ప్రభుత్వానికి మరిన్ని నిధులు సమకూరతాయి. గతంలో హిందుస్థాన్‌ జింక్‌, బాల్కో విక్రయ సమయంలో కూడా ప్రభుత్వం ఇదే వ్యూహం పాటించింది. ప్రస్తుతం బీపీసీఎల్‌ నాలుగు రిఫైనరీలు(ముంబై, కొచి, బైనా, నుమాలిగఢ్‌) నిర్వహిస్తోంది. వీటి ఉమ్మడి సామర్ధ్యం 3.83 కోట్ల టన్నులు. దేశంలో కంపెనీకి 15177 పెట్రోల్‌ పంపులు, 6,011 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 



You may be interested

11,900 దిగువకు నిఫ్టీ

Friday 22nd November 2019

స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు... శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా భారీగా నష్టాల్లోకి మళ్లాయి. ఐటీ రంగ షేర్ల పతనంతో పాటు సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. అలాగే ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌(ఓఈసీడీ) సంస్థ ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను 5.8శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ట్రేడింగ్‌

బ్యాంకులకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రైటాఫ్‌ల ముప్పు?

Friday 22nd November 2019

దేశీయ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్..బ్యాంకులు, బాండ్‌హోల్డర్లకు సంబంధించిన రుణాలను చెల్లించడంలో విఫలమైంది. కాగా ఈ కంపెనీ మోసపూరిత చర్యలకు పాల్పడిందనే విషయం రుజువైతే, ఈ సంస్థకు అప్పులిచ్చిన రుణ దాతలు అధికంగా దాదాపు రూ. 36,000 కోట్ల రైట్‌ ఆఫ్‌లను ఎదుర్కోవలసి​ వస్తుంది. ఒక వేళ ఈ కంపెనీకి సంబంధించి ఆడిటింగ్‌ సంస్థ కేపీఎంజీ నివేదిక కంపెనీకి సానుకూలంగా వస్తే అప్పుడు కేవలం రూ. 5,500 కోట్ల ప్రోవిజన్లు అవసరమవుతాయని

Most from this category