News


‘‘అరవింద్‌’’ సమేత..

Saturday 1st February 2020
news_main1580526523.png-31382

(అప్‌డేటెడ్‌...)

  • తెలుగు వ్యక్తికి ఐబీఎం పగ్గాలు
  • సీఈవోగా అరవింద్ కృష్ణ నియామకం
  • బోర్డులోనూ చోటు; ఏప్రిల్‌ 6 నుంచి అమల్లోకి

న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్‌ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారర్లీ 200 బిలియన్‌ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. ఏప్రిల్‌ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్‌ కృష్ణ... 1990లో ఐబీఎంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (క్లౌడ్, కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌) స్థాయికి చేరారు. "సీఈవోగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత సీఈవో వర్జీనియా రొమెటీ, బోర్డ్‌ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఐటీ పరిశ్రమ శరవేగంగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం సిబ్బంది, క్లయింట్లతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. వ్యాపారాలను మరింతగా మెరుగుపర్చుకునేలా క్లయింట్లకు తోడ్పాడటానికి ఇదో అద్భుతమైన అవకాశం" అని కృష్ణ పేర్కొన్నారు. ఆయనతో పాటు రెడ్‌ హ్యాట్‌ సీఈవో, ఐబీఎం సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జేమ్స్‌ వైట్‌హర్స్ట్‌.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
కొత్త శకానికి.. సరైన సారథి...
"ఐబీఎం తదుపరి శకానికి కృష్ణ సరైన సారథి. క్లౌడ్, కాగ్నిటివ్‌ శకంలో కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సరైన వ్యక్తి. ఐబీఎం చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలు అయిన ‘రెడ్ హ్యాట్‌’ డీల్‌కు ఆయనే సూత్రధారి. అరవింద్‌ కృష్ణ అద్భుతమైన æటెక్నాలజిస్టు. ఐబీఎంకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ వంటి కీలక టెక్నాలజీలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడు" అని వర్జీనియా రొమెటీ (62) వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా ఐబీఎంలో వివిధ హోదాల్లో పనిచేసిన రోమెటీ ఇకపై బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది ఆఖర్లో ఆమె రిటైరవుతారు. రొమెటీ స్థానంలో సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు సరైన వ్యక్తి కోసం సాగిన అన్వేషణలో .. అరవింద్‌ కృష్ణ ఎంపికయ్యారని ఐబీఎం లీడ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ఎస్క్యూ పేర్కొన్నారు.
ప్రస్థానమిలా...
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్‌ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిలో పీహెచ్‌డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ-రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్‌ మేనేజర్‌ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్‌వేర్‌, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు. 
సమోసా పార్టీ...
అరవింద్‌ కృష్ణ నియామకంపై దేశీ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ తదితరులను ప్రస్తావిస్తూ భారత సంతతికి చెందిన మేనేజర్ల సామర్థ్యాలకు తాజా నియామకం నిదర్శనమని మహీంద్రా ట్వీట్‌ చేశారు. అదే సమయంలో ఇకపై వైట్‌హౌస్‌ ఎప్పుడైనా టెక్‌ దిగ్గజాల సదస్సుల్లాంటివి ఏర్పాటు చేస్తే.. హాంబర్గర్ల స్థానంలో ఖచ్చితంగా భారతీయులకిష్టమైన సమోసాలుండేలా చూసుకోవాల్సి వస్తుందంటూ సరదాగా పేర్కొన్నారు. సమోసాలతో పాటు సాంబర్‌ వడ, మసాలా చాయ్‌ లాంటివి కూడా పెట్టాలంటూ నెటిజన్లు లిస్టులో మరిన్ని చేర్చారు. 
సిలికాన్‌ వ్యాలీలో భారతీయ జెండా...
అరవింద్‌ కృష్ణ నియామకంతో టెక్నాలజీ రంగంలో భారతీయుల సత్తా మరోసారి చాటినట్టయింది. అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని నాలుగు అతిపెద్ద బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు భారతీయులే సీఈఓలు. ప్రధానంగా గూగుల్‌ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల ప్రపంచ టాప్‌ టెక్నాలజీ కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. ఇతర ఎంఎన్‌సీల విషయానికొస్తే... మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగాతో పాటు పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి కూడా అత్యంత సుపరిచితులే. వారినొకసారి చూస్తే...

1. సుందర్‌ పిచాయ్‌: తమిళనాడుకు చెందిన పిచాయ్‌ 2015లో గూగుల్‌ సీఈఓగా నియమితులయ్యారు. 47 ఏళ్ల పిచాయ్‌కు తాజాగా గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ బాధ్యతలు కూడా అప్పగించి కంపెనీ ప్రమోటర్లు వైదొలగడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

2. సత్య నాదెళ్ల: 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని  ప్రారంభించిన నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం. హైదరాబాద్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. 2014లో స్టీవ్‌బామర్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

3. శంతను నారాయణ్‌:  యాపిల్‌లో కెరీర్‌ను ప్రారంభించిన నారాయణ్‌ 1998లో అడోబ్‌ సిస్టమ్స్‌లో వైస్‌–ప్రెసిడెంట్‌గా జాయిన్‌ అయ్యారు. 2007లో ఏకంగా ఆ కంపెనీ సీఈఓగా నియమితులైయ్యారు.  హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. 

4. జయశ్రీ ఉల్లాల్‌: కంప్యూటర్‌ చిప్‌ కంపెనీ ఏఎండీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన జయశ్రీ... ఆ తర్వాత క్లౌడ్‌ నెట్‌వర్కింగ్‌లో దూసుకెళ్లున్న ఈ అమెరికా కంపెనీకి సీఈఓ అయ్యారు. ప్రపంచ నెట్‌వర్కింగ్‌ ఇండస్ట్రీలో అత్యంత ప్రభావం చూపుతున్న అయిదుగురిలో ఆమె కూడా ఒకరని ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రకటించింది.

5. రాజీవ్‌ సూరి: 1995లో నోకియాలో కెరీర్‌ మొదలుపెట్టి అనేక కీలక స్థానాల్లో తన సత్తా చాటుకున్నారు. 2014లో అదే కంపెనీకి ప్రెసిడెంట్, సీఈఓగా నియమితులయ్యారు. నోకియా మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

6. దినేష్‌ పలివాల్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టిన దినేష్‌... ఏబీబీ గ్రూప్‌లో 22 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌ పరికరాల్లో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటైన హర్మన్‌ ఇంటర్నేషనల్‌కు ప్రెసిడెంట్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

7. నికేశ్‌ అరోరా: గూగుల్, సాఫ్ట్‌బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అరోరా తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారి. సైబర్‌ సెక్యూరిటీలో ప్రపంచ దిగ్గజాల్లో ఒకటైన పాలో అల్టో నెట్‌వర్క్స్‌కు 2018 జూన్‌ నుంచి అరోరా సీఈఓగా పనిచేస్తున్నారు.

8 . అంజలి సూద్‌: యూట్యూబ్‌కు పోటీనిస్తున్న యాడ్‌ఫ్రీ హైడెఫినిషన్‌ ఓపెన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌.. ‘విమియో’కు 2017లో సీఈఓ అయ్యారు. గతంలో ఆమె అమెజాన్, టైమ్‌ వార్నర్‌లలో పనిచేశారు.

9. సంజయ్‌ మెహ్రోత్రా: 2017లో మైక్రాన్‌ టెక్నాలజీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో శాన్‌డిస్క్‌ సీఈఓగా, వెస్టర్న్‌ డిజిటల్‌ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేశారు.

10. జార్జ్‌ కురియన్‌: కేరళలోని కొట్టాయంకు చెందిన కురియన్‌... సిస్కో సిస్టమ్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్టోరేజ్‌ అండ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘నెట్‌యాప్‌’కు 2015లో ప్రెసిడెంట్, సీఈఓగా నియమితులయ్యారు. 



You may be interested

ఎస్‌బీఐ లాభం రూ.6,797 కోట్లు

Saturday 1st February 2020

(అప్‌డేటెడ్‌...) 41 శాతం వృద్ధి  ఆదాయం రూ.95,384 కోట్లకు  ఈ క్యూ3లోనే అత్యధిక స్టాండ్‌అలోన్‌ నికర లాభం  న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ బ్యాంక్‌....స్టేట్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.6,797 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.4,823 కోట్లుతో పోల్చితే 41 శాతం వృద్ధి సాధించింది. కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది.

మార్కెట్లు పడతాయా.. పెరుగుతాయా..?

Friday 31st January 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మార్కెట్‌ను ఉత్సాహపరిచే పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్య స్థాయిని మించినాకానీ, వృద్ధి రేటు పెంపే ప్రధాన కర్తవ్యం కావాలన్న ఆర్థిక సర్వే సూచనల నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్లో కచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలకు చోటిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.   అయితే, బడ్జెట్‌ మార్కెట్‌ను షేక్‌

Most from this category