News


ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.150 వస్తేనే..: సీవోఏఐ

Friday 22nd November 2019
news_main1574362224.png-29766

టెలికం కస్టమర్లు తిరిగి పూర్వపు ధరలు చెల్లించే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి ప్రస్తుతం వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.124గా ఉంది. ఇది కనీసం రూ.150కు చేరాల్సిన అవసరం ఉందని, అప్పుడే కంపెనీలు మనుగడ సాగించగలవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. 

 

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులపై రెండేళ్ల పాటు మారటోరియం విధిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నందుకు తాము ధన్యవాదాలు తెలియజేయాలన్నారు రాజన్‌. ప్రభుత్వానికి ముందుగా చేసిన విజ్ఞాపనల్లో ఇది కూడా ఉందని, దానిపై ఇప్పుడు నిర్ణయం వెలువడినట్టు వివరించారు. కానీ, టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న అధిక రుణ భారం, ఇతర సమస్యలను ఇది పరిష్కరించలేదన్నారు. మొత్తం ఏజీఆర్‌ అంశంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ‘‘మేం మా ఏఆర్‌పీయూ, టారిఫ్‌లపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారాన్ని అధిగమించేందుకు ఏం చేయవచ్చన్న దాన్ని ఆలోచించాల్సి ఉంది. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’’ అని మాథ్యూస్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను టెలికం కంపెనీలు వేసే అవకాశం ఉందన్నారు. 

 

‘‘చాలా మంది అనలిస్టులు, టెలికం శాఖ కూడా ఏఆర్‌పీయూను 20 శాతం మేర పెంచుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చాయి. విడిగా టారిఫ్‌లపై నేను మాట్లాడడం లేదు. ప్రస్తుతం రూ.124 ఏఆర్‌పీయూగా ఉంది. ఇది కనీసం రూ.150 అంతకంటే ఎక్కువకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే లాభదాయకత సాధ్యం అవుతుంది. మూడు సంవత్సరాల క్రితం మా కస్టమర్లు సగటున ప్రతీ నెలా కాల్స్‌, కొంత డేటా కోసం రూ.180-200 వరకు చెల్లించే వారు. భరించడం అన్నది సమస్య కాదు. ఏఆర్‌పీయూ రూ.20 పెరగడం అంటే, టారిఫ్‌లు రూ.20 పెరుగుతున్నట్టు కాదు’’ అని రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ చెప్పారు. బీ2సీ, బీ2బీ, ఐవోటీ ఇలా పలు విభాగాల సేవలపై ధరలు పెంచడం ద్వారా ఏఆర్‌పీయూ పెంచుకోవచ్చన్న ఆలోచనను పేర్కొన్నారు.
 



You may be interested

పెట్టుబడి ఎక్కడ.. లార్జ్‌క్యాప్‌ లేదా మిడ్‌, స్మాల్‌క్యాప్‌..?

Friday 22nd November 2019

నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన రికార్డులకు చేరువలో ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరువలో ఉంది. కాకపోతే ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యలతో వృద్ధి తిరిగి పునరుద్ధరణ బాటలో పడుతుందన్న నమ్మకం స్టాక్‌ మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోని స్టాక్స్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా, చౌకగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఇంకా ఆర్థిక వృద్ధి కుదుటపడని, గరిష్ట స్థాయిల్లో ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు

తప్పుడు మెసేజ్‌లతో జాగ్రత్త..పేటీఎం చీఫ్‌

Thursday 21st November 2019

కంపెనీ అధికారుల్లాగా మోసగాళ్లు పంపే నకిలీ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ కస్టమర్లకు సూచించారు. పేటీఎం అకౌంట్‌ బ్లాక్‌ చేశామని, కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌)ని చేయమని వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని సోషల్‌ మీడియాలో ఆయన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. అలా వచ్చే ఒక శాంపిల్‌ నకిలీ మెసేజ్‌ను సైతం ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ మీ పేటీఎం అకౌంట్‌ను కొంత

Most from this category