News


కంపెనీలకు నిరసనల సెగ..

Tuesday 14th January 2020
news_main1578973177.png-30903

  • సీఏఏ, ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదంలో టెక్‌ సంస్థలు
  • బ్రాండ్‌ అంబాసిడర్లు, చీఫ్‌ల వైఖరులతో సమస్యలు
  • చిక్కుల్లో పాలసీబజార్, జోహో, యాక్సెంచర్‌ తదితర సంస్థలు

న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్‌ఆర్‌సీ అంశం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్‌ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్‌ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్‌ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి. 

దీపికా పదుకొణె బ్రాండ్‌పై జేఎన్‌యూ ప్రభావం...
వివాదాస్పద అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు దీపిక కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్‌.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్‌ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌కు ఆమె సుమారు రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 

పాలసీబజార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కష్టం..
ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్‌లైన్‌లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్‌ కుమార్, మొహమ్మద్‌ జీషన్‌ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్‌ బాగ్‌ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్‌ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్‌ వైఖరిని పాలసీబజార్‌ సమర్ధిస్తోందా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంతో ఒక దశలో బాయ్‌కాట్‌పాలసీబజార్‌ హ్యాష్‌టాగ్‌ బాగా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు.

ఆరెస్సెస్‌ వివాదంలో జోహో, యాక్సెంచర్‌ ..
ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్‌ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గోనుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గోనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్‌ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్‌ పహ్వా, ఎ లదఖ్, సచిన్‌ టాండన్‌ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. "మిగతా వారంతా బాయ్‌కాట్‌ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను" అంటూ టాండన్‌ .. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు, యాక్సెంచర్‌ ఇండియా సీఈవో రామ ఎస్‌ రామచంద్రన్‌ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  యాక్సెంచర్‌ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్‌ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్‌ ఎంతవరకూ సమర్ధిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విటర్‌ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్‌ గ్లోబల్‌ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు. 

వ్యతిరేకులకు ఘాటైన సమాధానాలు... 
ట్విటర్‌ యూజర్ల దాడుల భయంతో తన అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని వెంబు వ్యాఖ్యానించారు. తనను వ్యతిరేకిస్తున్నవారికి  ట్విటర్‌ వేదికగా ఆయన ఘాటుగానే సమాధానం చెప్పారు. "నేను హాజరయ్యే కార్యక్రమాలు మీకెవరికైనా నచ్చకపోతే.. మీ అంతరాత్మ చెబుతున్నట్లుగానే నడుచుకోండి. నేను కూడా నా అంతరాత్మ ప్రకారమే నడుచుకుంటాను. మనం చేసే పనే మనకు తిండి పెడుతుంది. నేను ఎప్పట్లాగే మెరుగ్గానే పనిచేయడం కొనసాగిస్తాను. నా మీద దాడులపై స్పందించబోను" అని స్పష్టం చేశారు. మరోవైపు.. వెంబు, రామచంద్రన్‌లకు వివిధ వర్గాల నుంచి బాగానే మద్దతు లభిస్తోంది. వ్యక్తిగతంగా ఎలా ఉండాలన్నది నిర్ణయించుకునేందుకు వారికి పూర్తి హక్కులు ఉంటాయని ట్విటర్‌ యూజర్లు వ్యాఖ్యానించారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్న్‌ రతన్‌ టాటా వంటి దిగ్గజాలు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకూ హాజరైన సంగతి వారు గుర్తు చేస్తున్నారు. 

అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్‌ ఉదంతం ..
కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్‌.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురి చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్‌ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీసుల యాప్‌ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్‌ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ .. తమ డెలివరీ బాయ్‌కు మద్దతుగా నిల్చారు. కంపెనీ నిర్దేశించుకున్న నైతిక విలువలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 

కొన్ని వివాదాలు...
నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్‌ నటుడు, స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమిర్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్‌ తెగదెంపులు చేసుకోక తప్పలేదు.

ఏప్రిల్, 2018: కథువా రేప్‌ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్‌ వివాదాస్పద ట్వీట్స్‌ చేశారు. దీంతో ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌.. ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పించింది.

ఏప్రిల్, 2018: డ్రైవర్‌ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది.

జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్‌ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్‌ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ .. డెలివరీ బాయ్‌ పక్షాన నిల్చారు. 



You may be interested

బంగారంపై బాదుడు తగ్గేనా..?

Tuesday 14th January 2020

దిగుమతి సుంకాలు తగ్గించాలని విన్నపాలు ప్రస్తుతం ఈ రేటు 12.5 శాతం భారీ వడ్డనతో కుదేలైన పరిశ్రమ న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ

సీఎండీ పోస్టు విభజన...మరో రెండేళ్లు పొడిగింపు

Tuesday 14th January 2020

సెబీ తాజా నిర్ణయం  న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్‌డీ (చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌) పదవి విభజన గడువును మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్‌ కంపెనీలు సీఎమ్‌డీ పదవిని చైర్మన్‌గా, ఎమ్‌డీగా రెండుగా  విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్‌

Most from this category