News


అయిదేళ్లు.. 10 లక్షల ఉద్యోగాలు..

Saturday 18th January 2020
news_main1579318934.png-31005

(అప్‌డేటెడ్‌...)

  • ఐటీ, రిటైల్‌, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో కల్పన
  • భారత్‌లో అమెజాన్ భారీ ప్రణాళికలు
  • సంస్థ సీఈవో బెజోస్‌ వెల్లడి

న్యూఢిల్లీ: అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించే యోచనలోనే ఉంది. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చిన సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. గత ఆరేళ్లుగా భారత్‌లో పెట్టుబడులతో కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమని బెజోస్‌ పేర్కొన్నారు.  ఉద్యోగ కల్పన, నైపుణ్యాల్లో శిక్షణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో తమ వంతు తోడ్పాటు అందించాలని భావిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్‌ మొదలు కస్టమర్ సపోర్ట్ దాకా అన్నివిభాగాల్లోకి అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి కొత్త పెట్టుబడులు ఉపయోగపడగలవని వివరించింది. చిన్న, మధ్య తరహా సంస్థలు ఆన్‌లైన్ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ చేసే మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్ ఇప్పటికే ప్రకటించారు.

వ్యాపారులకు వృద్ధి అవకాశాలు ...
2014 నుంచి భారత్‌లో అమెజాన్ తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుకుంది. గతేడాది హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా తర్వాత అమెజాన్‌ క్యాంపస్‌లో ఇదే అత్యంత పెద్ద క్యాంపస్‌. తాజాగా పెట్టబోయే పెట్టుబడులు.. 5.5 లక్షల పైచిలుకు చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు మరిన్ని వృద్ధి అవకాశాలు తెచ్చిపెట్టగలవని అమెజాన్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌లో రాసిన ఒక పోస్ట్‌లో బెజోస్ పేర్కొన్నారు.  "ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ భారత్‌పై నాకున్న ఇష్టం మరింత రెట్టింపవుతూ ఉంటుంది. అపరిమితమైన ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలు, భారతీయుల మొక్కవోని దీక్ష నాకు స్ఫూర్తినిస్తుంటాయి" అని ఆయన రాశారు. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ అమెజాన్‌తో పాటు మరో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటీషన్ కమిషన్ విచారణకు ఆదేశించిన తరుణంలో బెజోస్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

చట్టాలకు లోబడే విదేశీ పెట్టుబడులు ఉండాలి: మంత్రి గోయల్‌
చట్టాలకు అనుగుణంగా ఉండే అన్ని రకాల విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్‌ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. రిటైల్ రంగంలో వచ్చే భారీ పెట్టుబడులు.. లక్షలు, కోట్లు పెట్టగలిగే స్థోమత లేని చిన్న వ్యాపారులను దెబ్బతీసేవిగా ఉండరాదని మంత్రి అభిప్రాయపడ్డారు. 'అహ్మదాబాద్ డిజైన్ వీక్‌' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. "మన దేశంలో ఈ-కామర్స్‌ పరిశ్రమకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా వచ్చే పెట్టుబడులన్నింటినీ స్వాగతిస్తాం. అయితే, వాటి వల్ల దేశీయంగా చిన్న వ్యాపారులు పోటీపడలేని పరిస్థితి ఏర్పడకూడదు. చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు దొరకవు. లక్షలు, కోట్ల పెట్టుబడులు ఉండవు. స్వల్ప మొత్తంతోనే వారు వ్యాపారాలు నడుపుతూ ఉంటారు" అని గోయల్ చెప్పారు. మరోవైపు, భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు అమెజాన్‌ గొప్ప ఉపకారమేమీ చేయడం లేదంటూ తాను గురువారం చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తాను అమెజాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడానంటూ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. నియమ, నిబంధనలకు అనుగుణంగానే పెట్టుబడులు ఉండాలని చెప్పాలన్నది తన ఉద్దేశమని గోయల్ చెప్పారు. You may be interested

సంస్కరణలతోనే భారత్‌ భారీ వృద్ధి

Saturday 18th January 2020

ఐక్యరాజ్యసమితి నివేదిక న్యూఢిల్లీ: భారత్‌ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...   2018లో భారత్‌ వృద్ధి

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లాభం 10 శాతం అప్‌

Saturday 18th January 2020

8 శాతం పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.186 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.204 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,317 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,423 కోట్లకు పెరిగిందని

Most from this category