News


పరిశోధనల పాఠశాల

Saturday 6th July 2019
news_main1562394590.png-26845

  • నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం
  • జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన
  • విద్యా రంగానికి రూ. 94,853.64 కోట్లు కేటాయింపు
  • ప్రపంచస్థాయి విద్యాసంస్థల కోసం రూ. 400 కోట్లు
  • త్వరలో కేంద్ర ఉన్నత విద్యా కమిషన్‌ ముసాయిదా బిల్లు
  • విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’ పథకం
  • గాంధీజీ సిద్ధాంతాలపై యువతలో అవగాహనకు గాంధీపీడియా

న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విధానంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులను ప్రతిపాదించారు. పరిశోధనలు, నవకల్పనలపై మరింత దృష్టిపెడతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించి సమన్వయపరిచేందుకు, వాటికి నిధులు అందించేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశోధనల రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ కృషి చేస్తుంది. వేర్వేరు శాఖల్లో పరిశోధనలకు కేటాయించే నిధులను ఎన్‌ఆర్‌ఎఫ్‌కు మళ్లించడంతోపాటు అదనపు కేటాయింపులు కూడా చేస్తాం’’అని నిర్మలా సీతారామన్‌ శుక్రవారం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో విద్యా రంగానికి తాజా బడ్జెట్‌లో రూ. 94,853.64 కోట్లను కేటాయించారు. 2018-19 సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పొలిస్తే తాజా కేటాయింపులు 13 శాతం మేర పెరిగాయి. గత బడ్జెట్‌లో విద్యా రంగానికి నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ. 85,010 కోట్లు కేటాయించగా ఆ కేటాయింపులను తర్వాత రూ. 83,625.86 కోట్లకు సవరించారు. ఈసారి కేటాయింపులను విభాగాలవారీగా చూస్తే పాఠశాల విద్యకు రూ. 56,536.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 38,317.01 కోట్లు కేటాయించారు. అలాగే యూజీసీకి రూ. 4,600.66 కోట్లు (2018-19 సవరించిన అంచనాల్లో రూ. 4,687.23 కోట్లు), ఐఐటీలకు రూ. 6,409.95 కోట్ల మేర కేటాయింపులు చేశారు. ఇక ఐఐఎంలకు రూ. 445.53 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు రూ. 899.22 కోట్లు కేటాయించారు.
విద్యా రంగానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదించిన ముఖ్యాంశాలు ఇవీ...

- విద్యారంగంలో ప్రపంచ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్లు కేటాయింపు. ఇది గతేడాది చేసిన సవరించిన అంచనాలకు మూడు రెట్లు అదనం.

- దేశ ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థుల చేరికలను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’కు శ్రీకారం. ‘ప్రపంచ విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎంతో సామర్థ్యం ఉంది’అని సీతారామన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

- ఉన్నత విద్యా రంగంలో నియంత్రణ వ్యవస్థను సమగ్రంగా సంస్కరించేలా కేంద్ర ఉన్నత విద్యా కమిషన్‌ (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు. విద్యా నియంత్రణ వ్యవస్థలో మరింత స్వయంప్రతిపత్తి, మెరుగైన ఫలితాల సాధనకు హెచ్‌ఈసీఐ దోహదపడనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఈ ఏడాదిలోనే పార్లమెంటు ముందుకు రానుంది.

- కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థగా జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పాటు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన అన్ని విభాగాల్లో నాణ్యమైన పరిశోధనలకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రోత్సాహం. ప్రాథమికంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో పరిశోధనలకు అవసరమయ్యే సామర్థ్యాల పెంపుతోపాటు నిధులు, ప్రోత్సాహకాలకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా తోడ్పాటు, దిశానిర్దేశం. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, సుశిక్షితులైన సిబ్బంది నియామకం.

- నూతన విద్యా విధానం-2019 ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం ఎన్‌ఆర్‌ఎఫ్‌లో సైన్సెస్‌, టెక్నాలజీ, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌-హ్యుమానిటీస్‌ విభాగాలు ఉండనున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఫిజిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నానో సైన్స్‌, సోషియాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్‌ హిస్టరీ, లిటరేచర్‌ వంటి పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని రకాల పరిశోధనలకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ పూర్తిస్థాయిలో నిధులు అందించనుంది.

- దేశంలో క్రీడా సంస్కృతిని క్షేత్రస్థాయిలో తిరిగి పెంపొందించేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించి అవరసరమైన ఆర్థిక సహకారం అందించడం.

- అన్ని స్థాయిల్లో క్రీడలకు ఆదరణ కల్పించేందుకు, క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా ఖేలో ఇండియా పథకం కింద జాతీయ క్రీడా విద్యా బోర్డు ఏర్పాటు.

- జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలపట్ల యువతకు అవగాహన కల్పించేలా ‘గాంధీ-పీడియా’ను అభివృద్ధి చేయనున్నారు.

- ప్రపంచంలోని 200 అత్యుత్తమ యూనివర్సిటీల్లో భారత్‌ నుంచి మూడు ఉన్నతవిద్యా సంస్థలు (రెండు ఐఐటీలు, ఒక ఐఐఎస్‌సీ-బెంగళూరు) నిలిచాయని సీతారామన్‌ వివరించారు. ఐదేళ్ల కిందటి వరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన ఈ సంస్థలు తమ ప్రమాణాలను మెరుగుపరుచుకొని ఈ ఘనత సాధించాయన్నారు.



You may be interested

హోం శాఖకు 1.19 లక్షల కోట్లు

Saturday 6th July 2019

మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట కేంద్ర సాయుధ బలగాలకు రూ. 71 వేల కోట్లు 2021 జనగణన సన్నాహకాలకు రూ. 621 కోట్లు న్యూఢిల్లీ: హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా

అష్టలక్ష్మి గ్రామోస్తుతే..

Saturday 6th July 2019

కేంద్ర బడ్జెట్‌ ‍ప్రవేశపెట్టిన రెండో మహిళా మంత్రిగా రికార్డుల కెక్కిన నిర్మలా సీతారామన్‌.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి.. దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్‌కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు

Most from this category