STOCKS

News


కియాకు అన్ని విధాలా సహకారం

Friday 9th August 2019
news_main1565327389.png-27655

  • కియాకు అన్ని విధాలా సహకారం
  • వైజాగ్‌–చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు 
  • ఆర్టీసీలో క్రమంగా అన్నీ విద్యుత్‌ బస్సులు
  • సెల్టోస్‌ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సందేశం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. దివంగత నేత, తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా పంపిన సందేశంలో జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వాస్తవానికి కియా సెల్టోస్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా రావాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో పరిణామాలతో పాటు గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించే పని ఉండటంతో హాజరుకాలేకపోయారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అందువల్ల ఆయన ప్రతినిధిగా ఇక్కడకు హాజరుకావడంతో పాటు ఆయన సందేశాన్ని వినిపిస్తున్నట్టు తెలిపారు.

పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు...
‘‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ ఆకాంక్ష. వాస్తవానికి కియా మోటార్స్‌ ఏర్పాటు అనేది దివంగత నేత, మా నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 2007లో హ్యుందాయ్‌ మోటార్స్‌ సంస్థ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను కియా ఏర్పాటు చేసింది. అందువల్ల వ్యక్తిగతంగా హాజరుకావాలని భావించాను. అయితే, అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీనిస్తున్నాను. కియా ఏర్పాటు వల్ల ఇక్కడ ఆటోమొబైల్‌ రంగంతో పాటు విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు వల్ల పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. 

ఆటోమొబైల్‌కు అనుకూలం...
రాష్ట్రంలో కియా మోటార్స్ ప్లాంటు ఏర్పాటు ఆటోమొబైల్‌ రంగానికి ఊతమివ్వగలదని జగన్‌మోహన్‌ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ‘‘ప్రధానంగా అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆటోమొబైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ఆటోమొబైల్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇక రాష్ట్రంలో ఆర్టీసీలో ప్రస్తుతమున్న బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించారు. కియా పరిశ్రమ ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా 755 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు మరో 143 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు కచ్చితంగా 75 శాతం ఉద్యోగాలివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి అనుగుణంగా కియా మోటార్స్‌ కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె సూచించారు. You may be interested

లాభాల్లో రియల్టీ షేర్లు

Friday 9th August 2019

 ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, దేశియ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.31 సమయానికి 1.16 శాతం లాభపడి 266.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియలెస్టేట్‌ 6.20 శాతం లాభపడగా, ప్రెస్టెజ్‌ ఇండస్ట్రీస్‌ 3.11 శాతం, సన్‌టెక్‌ 2.88 శాతం, మహీంద్రా లైఫ్‌ లిమిటడ్‌ 2.45 శాతం, డీఎల్‌ఎఫ్‌ 1.40 శాతం, ఒబేరాయ్‌ రియల్టీ 0.81

కియా సెల్టో్స్ వచ్చేసింది..

Friday 9th August 2019

అనంతపురం ప్లాంటులో తొలి కారు ఆవిష్కరణ మూడు వారాల్లోనే 23వేల పైచిలుకు ప్రీ–బుకింగ్స్‌ ఆగస్టు 22 నుంచి డెలివరీలు భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అనంతపురం ప్లాంటుపై 1.1 బిలియన్‌ డాలర్లు 11,000 మందికి ఉపాధి అవకాశాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: - దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా భారత్‌లో తమ తొలి కారు 'సెల్టోస్‌'ను ఆవిష్కరించింది. అనంతపురం ప్లాంటులో గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

Most from this category