News


ఆర్‌కామ్‌ వేలం నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్‌

Monday 18th November 2019
news_main1574050024.png-29662

  • రుణదాతల కమిటీ తీరుపై అభ్యంతరాలు

న్యూఢిల్లీ: దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలు రేసు నుంచి టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తప్పుకుంది. వేలానికి సంబంధించి బిడ్డింగ్‌ గడువు పెంచాలంటూ తాము కోరితే పట్టించుకోని రుణదాతల కమిటీ (సీవోసీ), మరో పోటీ సంస్థ (రిలయన్స్ జియో) అభ్యర్ధిస్తే మాత్రం సానుకూల నిర్ణయం తీసుకుందంటూ ఎయిర్‌టెల్ ఆక్షేపించింది. రుణదాతల కమిటీ తీరు పూర్తిగా అసమంజసమని, పక్షపాతంతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. రిలయన్స్ జియో పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా దివాలా పరిష్కార నిపుణుడు అనీష్ నిరంజన్‌ నానావతికి రాసిన లేఖలో ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ హర్‌జీత్ కోహ్లి ఈ అంశాలు పేర్కొన్నారు. 
    ఆర్‌కామ్‌కు చెందిన వివిధ అసెట్స్ కొనుగోలు కోసం భారతి ఎయిర్‌టెల్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వర్డే పార్ట్‌నర్స్‌ బిడ్‌ చేశాయి. లావాదేవీల్లో సంక్లిష్టత కారణంగా బిడ్డింగ్ గడువును నవంబర్‌ 11 నుంచి డిసెంబర్ 1కి పొడిగించాలంటూ ఎయిర్‌టెల్ అభ్యర్ధించింది. అయితే, దీన్ని సీవోసీ తిరస్కరించింది. కానీ తాజాగా మరో బిడ్డరు (జియో) అభ్యర్ధన మేరకు డెడ్‌లైన్‌ను నవంబర్ 25 దాకా పొడిగించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని, సీవోసీ సందేహాస్పద తీరు నేపథ్యంలో బిడ్డింగ్‌ నుంచి తప్పుకుంటున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఆర్‌కామ్‌ గ్రూప్‌ రుణభారం సుమారు రూ. 49,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. బాకీలు రాబట్టుకునేందుకు రుణదాతల కమిటీ .. ఆర్‌కామ్‌ ఆస్తుల వేలం ప్రకటించింది. 

ఆర్‌కామ్ డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా...
మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రికార్డు నష్టాలు ప్రకటించిన ఆర్‌కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు, సీఎఫ్‌వో కూడా రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలియజేసింది. స్పెక్ట్రం లైసెన్సు ఫీజు బకాయీలకు సంబంధించి భారీగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావడంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్‌కామ్ ఏకంగా రూ. 30,142 కోట్ల మేర నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా అత్యధికంగా నష్టాలు ప్రకటించిన రెండో సంస్థ ఆర్‌కామ్‌ కావడం గమనార్హం. 2005లో రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన కింద అనిల్ అంబానీ చేతికి వచ్చిన ఆర్‌కామ్ ప్రస్తుతం దివాలా పరిస్థితుల్లో ఉంది. కంపెనీ నిర్వహణ బాధ్యతలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) దివాలా పరిష్కార నిపుణుల చేతికి వచ్చింది.  



You may be interested

భారత్‌కు ఆ సత్తా ఉంది..

Monday 18th November 2019

వేగంగా వృద్ధి సాధనపై ఐటీ దిగ్గజం బిల్ గేట్స్‌ వ్యాఖ్యలు ఆధార్‌, యూపీఐ విధానాలపై ప్రశంసలు న్యూఢిల్లీ: రాబోయే దశాబ్ద కాలంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉందని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బైటపడగలరని, విద్య.. వైద్యంపై ప్రభుత్వం మరింత భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. ఆధార్, యూపీఐ చెల్లింపుల

ఈ వారం స్టాక్స్‌​ రికమెండేషన్స్‌

Monday 18th November 2019

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌  కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్‌ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో-వీఎస్‌ఎఫ్‌, సిమెంట్‌, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్‌ఎఫ్‌, సిమెంట్‌ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో

Most from this category