STOCKS

News


కృష్ణపట్నం పోర్టులో అదానీకి మెజారిటీ వాటా?

Wednesday 21st August 2019
news_main1566362392.png-27908

ఏపీఎస్‌ఈజడ్‌కు 72 శాతం వాటా!
డీల్‌ విలువ రూ.5,500 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పోర్టుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గౌతమ్‌ అదానీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంటున్నట్టు సమాచారం. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌ అయిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 72 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకు పైగా వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. డీల్‌ ద్వారా వచ్చిన మొత్తంలో అధిక భాగం అప్పులు చెల్లించేందుకు వినియోగించనున్నారు. కన్‌స్ట్రక్షన్‌, పోర్ట్స్‌, పవర్‌, స్టీల్‌, ఐటీ, ఎక్స్‌పోర్ట్స్‌ రంగాల్లో ఉన్న సీవీఆర్‌ గ్రూప్‌నకు (నవయుగ) కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 92 శాతం వాటా ఉంది. 
తప్పుకోనున్న 3ఐ..
లండన్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ 3ఐ గ్రూప్‌ పీఎల్‌సీ తన అనుబంధ కంపెనీ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ద్వారా 2009 ఫిబ్రవరిలో కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. 3ఐ వాటా ప్రస్తుతం 8 శాతానికి వచ్చి చేరింది. అదానీ ఎంట్రీతో 3ఐ తన వాటా విక్రయించి తప్పుకోనుంది. కృష్ణపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నెలకొని ఉంది. 2008లో ఈ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. పోర్టు అభివృద్ధికి సుమారు రూ.8,000 కోట్లు ఖర్చు​చేశారు. నౌకాశ్రయం నుంచి 2018-19లో 5.43 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 
2025 నాటికి 40 కోట్ల టన్నులు..
కృష్ణపట్నం పోర్టు లావాదేవీ పూర్తి అయితే ఏపీఎస్‌ఈజడ్‌కు తూర్పు తీరంలో ఇది మూడవ డీల్‌ అవుతుంది. ఇప్పటికే కంపెనీ 2014లో ధమ్రా, 2016లో కట్టుపల్లి పోర్టులను దక్కించుకుంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ 2025 నాటికి ఏటా 40 కోట్ల టన్నుల సరుకు రవాణా నమోదు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. 2018-19లో 15 శాతం వృద్ధితో 20 కోట్ల టన్నులకుపైగా సరుకు రవాణా చేపట్టింది. పోర్టుల వ్యాపార విస్తరణకు ఏటా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఏపీఎస్‌ఈజడ్‌ సీఈవో కరణ్‌ అదానీ ఆగస్టు 7న ఎర్నింగ్స్‌ కాల్‌ సందర్భంగా వెల్లడించారు. పోర్టు వ్యాపారం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.8,897 కోట్ల టర్నవర్‌పై రూ.4,006 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఏపీఎస్‌ఈజడ్‌ ఏపీలోని విశాఖపట్నంతోసహా 10 పోర్టులను నిర్వహిస్తోంది. You may be interested

ఫిన్‌టెక్‌ కంపెనీల ‘కంటెంట్‌’ మంత్రం

Wednesday 21st August 2019

స్టాక్‌ మార్కెట్లు, ఫండ్స్‌పై విస్తృత సమాచారం చార్ట్‌లు, గ్రాఫ్‌లు, వీడియో, టెక్ట్స్‌ సందేశాలు అస్థిరతల సమయాల్లో నడుచుకోవడంపై అవగాహన పెట్టుబడుల అవకాశాల పట్ల సూచనలు తద్వారా ఇన్వెస్టర్లు దూరం కాకుండా చర్యలు న్యూఢిల్లీ: స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల సేవలు అందిస్తున్న నవతరం ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు.. అల్లకల్లోల సమయాల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు, వారు మార్కెట్లకు దూరంగా వెళ్లకుండా ఉండేందుకు పలు రకాల సేవలతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన కంటెంట్‌ కూడా ఒకటి. స్టాక్‌ మార్కెట్లు

ఆల్‌ టైం గరిష్ఠానికి ఇన్ఫోసిస్‌

Wednesday 21st August 2019

రూపీ బలహీనపడుతుండడంతో బుధవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ షేరు ఆల్‌టైం​గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.02 సమయానికి ఇన్ఫోసిస్‌ 0.98 శాతం లాభపడి రూ. 800.55 వద్ద ట్రేడవుతోంది. గత షేషన్‌లో రూ. 792.75 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 793.00 వద్ద ప్రారంభమైంది. ప్రారభమైన కొద్ది సమయంలోనే రూ. 803.75 వద్ద తన ఆల్‌ టైం గరిష్ఠానికి చేరుకుంది. 

Most from this category