News


5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయ్!!

Saturday 29th June 2019
news_main1561780095.png-26670

  • 2020లో వెల్లువలా కొత్త టెక్నాలజీ ఫోన్లు
  • సిద్ధం చేసుకుంటున్న తయారీ కంపెనీలు
  • రూ.15,000-20,000 శ్రేణిలోనూ లభించే చాన్స్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు భారత మొబైల్‌ మార్కెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్లనే చూశాం. వచ్చే ఏడాది నుంచి తదుపరి తరం 5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం 2020లో జరిగే అవకాశం ఉంది. స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే కొత్త టెక్నాలజీతో మోడళ్లను ప్రవేశపెట్టేందుకు తయారీ కంపెనీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆవిష్కరించబోయే మోడళ్లను ప్రకటించాయి కూడా. ధరల అంశం భారత మార్కెట్లో కీలకం కావడంతో మోడళ్ల ప్రైస్‌ రూ.15,000- 20,000 శ్రేణిలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టెలికం, రుణ సంస్థలతో కంపెనీలతో చర్చిస్తున్నాయి. బండిల్‌ ఆఫర్లు, రుణ సదుపాయం ద్వారా విక్రయాలను పెంచుకోవాలన్నది కంపెనీల ఆలోచన.
రెడీ అవుతున్న కంపెనీలు...
ఎల్‌జీ, సామ్‌సంగ్, హువావే, షావొమీ, లెనోవో, మోటో, ఓపో, వివో, వన్‌ ప్లస్‌ ఇప్పటికే 5జీ మోడళ్లను రూపొందించాయి. వీటితోపాటు నోకియా, నుబియా, రియల్‌మీ, జడ్‌టీఈ, ఏసూస్‌–జెన్‌ఫోన్, హానర్‌ తదితర బ్రాండ్లు వరుసలో ఉన్నాయి. స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి రాగానే ఈ కంపెనీలు భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌ చేసేందుకు రెడీ అయ్యాయి. రూ.20,000 లోపు ధరలో కూడా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు తయారీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. అయితే విడిభాగాల ధరలు దిగివస్తాయి కాబట్టి భవిష్యత్తులో 5జీ మోడళ్ల ధర మరింత తగ్గుతుందని ఎల్‌జీ చెబుతోంది.
ముగ్గురు కలిస్తేనే...
మొబైల్స్‌ తయారీ సంస్థలు, టెలికం కంపెనీలు, రుణ సంస్థలు కలిస్తేనే దేశంలో 5జీ విస్తరణ వేగంగా జరుగుతుందని ఎల్‌జీ మొబైల్స్‌ బిజినెస్‌ హెడ్‌ అద్వైత్‌ వైద్య ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. ‘రూ.15,000–20,000 ధరలో సైతం 5జీ ఫోన్లు మార్కెట్‌లోకి వస్తాయి. తొలుత టాప్‌–5 నగరాలకే 5జీ సేవలు పరిమితం కావొచ్చు. తర్వాత దశలవారీగా టాప్‌–20లోకి అడుగుపెడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో 5జీ ఫోన్ల అమ్మకాలు అధికమవ్వాలంటే పైన చెప్పినట్టుగా మూడు విభాగాలు ఏకమవ్వాల్సిందే. రుణ సంస్థలు ఈఎంఐలను ప్రోత్సహించాలి. టెలికం కంపెనీలు బండిల్‌ ఆఫర్లను అందివ్వాలి. అప్పుడే రూరల్‌లోనూ 5జీ ప్రాచుర్యంలోకి వస్తుంది’ అని వివరించారు.
ఇదీ భారత మొబైల్స్‌ విపణి...
దేశవ్యాప్తంగా ఈ ఏడాది 30 కోట్ల మొబైల్‌ ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో స్మార్ట్‌ఫోన్ల వాటా 15–16 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఏటా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 12–15 శాతం పెరుగుతున్నాయి. రూ.8,000–15,000 శ్రేణి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో మోడళ్ల వాటా అత్యధికంగా 45–50 శాతముంది. కొత్తగా స్మార్ట్‌ఫోన్లు కొంటున్న వారిలో గ్రామీణుల వాటా 40 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,000–12,000 శ్రేణి పాపులర్‌ అయింది. ఈ సెగ్మెంట్లో 60 శాతం అమ్మకాలు రూరల్‌ మార్కెట్‌లో జరుగుతున్నాయి. మిగిలిన 40 శాతం టాప్‌ 50 నగరాలు, పట్టణాలు కైవసం చేసుకున్నాయి. 
ప్రీమియం వైపు మార్కెట్‌...
స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఖరీదైన మోడళ్ల వైపు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. ఈ ఏడాది అమ్ముడయ్యే 15–16 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో అప్‌గ్రేడ్‌ అయ్యేవారి సంఖ్య 25 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. మూడేళ్లలో సగటు విక్రయ ధర 15 శాతం పెరిగిందంటే కస్టమర్లు చేస్తున్న వ్యయం అర్థం చేసుకోవచ్చు. ఇక రూ.8,000–20,000 ధరల శ్రేణి ఏటా 30 శాతం అధికమవుతోంది. దీనికి ప్రధాన కారణం 4జీ సేవలు రావడమే. అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు పెద్ద ఎత్తున ఈఎంఐలను ప్రోత్సహించడం కూడా కలిసి వచ్చింది. You may be interested

ఐపీఓకు గో ఎయిర్‌!

Saturday 29th June 2019

 ఇష్యూ సైజు రూ.1,700- 2,000 కోట్లు  డిసెంబర్ లేదా జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ, గో ఎయిర్‌ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. గతంలో ఐపీఓ ప్రణాళికను అటకెక్కించిన ఈ కంపెనీ నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు సిద్ధమవుతోందని తెలిసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, బోంబే డైయింగ్‌వంటి కంపెనీలను నిర్వహిస్తున్న వాడియా గ్రూప్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ, తన ఐపీఓ కోసం సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ

చౌకగా ఉన్నాయని వలలో పడొద్దు!

Friday 28th June 2019

బీఎస్‌ఈలో ప్రతీ ఆరు చురుగ్గా ట్రేడయ్యే స్టాక్స్‌లో ఒకటి 2019లో కొత్త కనిష్ట స్థాయికి పడిపోయినదే. ఇదే కాలంలో ప్రధాన సూచీలు రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇలా పతమైన వాటిల్లో 70 శాతం కంపెనీలకు ఈ తరహా అనుభవాలు గతంలో ఎదురు కాలేదు. ఇవి ఇన్వెస్టర్ల సంపదను వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి చూస్తే 50-95 శాతం మధ్య తుడిచిపెట్టేశాయి. క్యాఫ్‌ ఫ్లో, అధిక రుణ భారం, ప్రమోటర్ల

Most from this category