News


క్యాషే .. కింగ్‌..

Friday 8th November 2019
Markets_main1573184591.png-29427

  •  నగదు లావాదేవీలకే పెద్ద పీట
  • మళ్లీ కరెన్సీ నోట్లను భారీగా దాచుకుంటున్న జనం
  • మరోవంక డిజిటల్‌ లావాదేవీల్లోనూ భారీ వృద్ధి
  • ఆర్థిక వ్యవస్థకూ అప్పటి సైడ్‌ ఎఫెక్ట్స్
  • నోట్ల రద్దుకు మూడేళ్లు


పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెం‍డు డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన  ప్రభావమెత? నోట్ల రద్దు సైడ్‌ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? 

2016 నవంబర్‌ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్‌ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్‌. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకులో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు...?!!

మళ్లీ క్యాష్‌ జమానా...!!
నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌ఏఎస్‌)  గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. 
మరోవైపు, చలామణీలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9 –12 శాతంగా ఉండేది. 2017–18లో ఇది 26 శాతానికి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదని భావిస్తున్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్‌ఏఎస్‌ వెల్లడించింది. మరి బ్లాక్‌మనీ సంగతి ఏమైంది?

నలుపు... తెలుపైపోయిందా?
నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్‌ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్‌బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్‌ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్‌ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి.
                            
రద్దు చేసిన నోట్ల విలువ             రూ. 15.41 లక్షల కోట్లు
బ్యాంకుల్లోకి వచ్చిన నోట్లు         రూ. 15.30 లక్షల కోట్లు
వ్యవస్థలోకి తిరిగి రాని నోట్ల విలువ    రూ. 10,720 కోట్లు

డిజిటల్‌ లావాదేవీల వృద్ధి ...
నోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కూడా పేమెంట్స్‌ సేవల్లోకి వస్తోంది. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 20 లక్షల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 48 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో పాయింట్ ఆఫ్ సేల్స్‌ (పీవోఎస్‌) మెషీన్లలో డెబిట్‌ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీలు 80 కోట్ల నుంచి 330 కోట్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 32 కోట్ల నుంచి 340 కోట్లకు పెరిగాయి.
మందగమనానికి బీజం...
ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ .. ప్రస్తుతం దేశీయంగా మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. పెద్ద నోట్లు రద్దుచేసిన మర్నాడు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 6 శాతానికి పైగా పడ్డాయి. తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటూ మందగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్‌బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్‌ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు అంతకన్నా తక్కువగా 5.8 శాతానికే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. ఈ మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. 
- నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఇది ఉద్యోగాల కోతలకు, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది.
- 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్‌లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది.
- నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కుదేలవటం గతేడాది నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్‌ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. 

అప్పట్లోనే హెచ్చరికలు...
నోట్ల రద్దు జరిగిన 2016 నవంబర్లోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చంటూ నిపుణులు హెచ్చరించారు. "కరెన్సీ కొరత తాత్కాలికమైనదేనని, లభ్యత పెరిగాక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడొచ్చని ఆశిస్తున్నారు. అయితే, ఆ తర్వాత నుంచి ప్రజలు నగదును ఖర్చు చేయడం కన్నా దాచిపెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల వ్యవస్థలో నగదు చలామణీ మందగిస్తుంది. ఉత్పత్తిలో (గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం, వాస్తవంగా జరిగే ఉత్పత్తి మధ్య వ్యత్యాసం) వ్యత్యాసం వస్తుంది. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటుంది. ఎకానమీ నుంచి నిధులు తరలిపోకుండా.. వడ్డీ రేట్లను భారీగా తగ్గించడం రిజర్వ్‌ బ్యాంక్‌కు కష్టమవుతుంది" అని అవినాష్‌ త్రిపాఠి అనే రీసెర్చ్‌ స్కాలర్‌ అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం. You may be interested

తగ్గిన  యూకో బ్యాంక్‌ నష్టాలు

Friday 8th November 2019

-గత క్యూ2లో రూ.1,136 కోట్ల నష్టాలు  -ఈ క్యూ2లో నష్టాలు రూ.892 కోట్లు  -ఒకింత తగ్గిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601

భారీగా తగ్గిన బంగారం

Friday 8th November 2019

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 32 డాలర్లు పతనమై 1,460 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే

Most from this category