News


2019 బిజినెస్‌ రివైండ్‌: ఏ నెలలో ఏం జరిగింది

Tuesday 31st December 2019
news_main1577763390.png-30545

జనవరి...

 •  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది.
 • బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌.
 •  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌.
 •  వీడియోకాన్‌ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు. 

ఫిబ్రవరి...

 •  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో, తాత్కాలిక బాధ్యతల్లో మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన పియుష్‌ గోయెల్‌. ఆదాయాలపై రూ. 5 లక్షల వరకూ పన్ను రిబేట్‌ కీలక నిర్ణయం.

మార్చి...

 • ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించకపోతే... జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు హెచ్చరిక. నెల గడువు. ఆదుకున్న అన్నయ్య ముకేశ్‌.  గడువుకు ఒకరోజు మార్చి 18న ముందు మొత్తం డబ్బు చెల్లించిన ఆర్‌ఐఎల్‌.


ఏప్రిల్‌...

 •  ఇండియా బుల్స్‌ చేతికి లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌. షేర్‌ బదలాయింపు ద్వారా ఆర్థిక లావాదేవీ.
 • దాదాపు రూ.8,000 కోట్ల రుణ భారంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ క్రాష్‌ ల్యాండింగ్‌. అయిదేళ్లలో ఇది ఏడో సంస్థ. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా, ఆర్థిక సంక్షోభం, తీవ్ర పోటీ ధాటికి పలు విమానయాన సంస్థలు కుప్పకూలాయి. గడచిన ఐదేళ్లలో ఎయిర్‌ పెగాసన్‌, ఎయిర్‌ కోస్టా, ఎయిర్‌ కార్నివాల్‌, ఎయిర్‌ డెక్కన్‌, ఎయిర్‌ ఒడిశా, జూమ్‌ ఎయిర్‌ మూతబడ్డాయి. 


మే...

 • బలమైన కంపెనీగా ఐటీసీని మలచిన శిల్పి, పద్మ భూషన్‌ అవార్డు గ్రహీత యోగేష్‌ చందన్‌ దేవేశ్వర్‌ (72) కన్నుమూత.
 • కేంద్ర మంత్రిత్వ శాఖల కేటాయింపు. దేశ ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలాసీతారామన్‌. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన మహిళగా సీతారామన్‌.


జూన్‌...

 • మూడేళ్ల పదవీకాలంలో ఆరు నెలల ముందుగానే వ్యక్తిగత అంశాలు కారణంగా చూపుతూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్‌ విరాల్‌ ఆచార్య రాజీనామా. వ్యక్తిగత కారణాలే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్‌ పటేల్‌ తర్వాత, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యాక్తిగా విరాల్‌ ఆచార్య. 


జూలై...

 • బిర్లా మూల పురుషుడు బీకే బిర్లా (98) కన్నుమూత. 
 • 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రూ.27,86,349 కోట్ల పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.
 • బ్యాంకుల జాతీయీకరణకు  50 సంవత్సరాలు పూర్తి
 • గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్లర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్‌ కేసులో సుప్రీం ఆదేశాలు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ కింద ఉన్న సంస్థ రిజిస్రే‍్టషన్‌ రద్దు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యతలను నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక‌్షన్‌ కార్పొరేషన్‌కు అప్పగింత.
 • విప్రో చైర్మన్‌గా ప్రేమ్‌జీ బాధ్యతల విరమణ. కుమారుడు రిషేద్‌కు బాధ్యతలు.
 • తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పోరాడుతూ రెండు రోజుల క్రితం అదృశ్యమైన  కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య. నేత్రావతి నది ఒడ్డున మృతదేహం గుర్తింపు. ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్లు వేధించారంటూ వెలువడిన ఆయన లేఖ సంచలనం. 


ఆగస్టు...

 • కియా ‘మేడిన్‌ ఆంధ్రా’ సెల్టోస్‌ విడుదల. అనంతపురం ప్లాంట్‌లో  తొలి కారు ఆవిష్కరణ. 
 • హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ ప్రారంభం
 • ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్రం ఆమోదం. 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. కెనరాబ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌. ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌... విలీనాలు. 


సెప్టెంబర్‌...

 • దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో జియో హైస్పీడ్‌- ఫైబర్‌ సేవలు ప్రారంభం.
 • ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన అత్యాధునిక ఐఫోన్లు 11,11 ప్రో, 1 ప్రో మ్యాక్స్‌లను యాపిల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియంలో సంస్థ ఆవిష్కరించింది. 
 • ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే క్రమంలో కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన. ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకువచ్చిన ఈ బిల్లుకు పార్లమెంటూ ఆమోదముద్ర వేసింది.  దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ తరువాత ప్రారంభించి 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే కొత్త తయారీ రంగ కంపెనీలకు కనిష్టంగా 15 శాతం రేటును వర్తిస్తుంది. 
 • ప్రముఖ బ్రిటిష్‌ పర్యాటక సంస్థ- 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్‌ కుక్‌ దివాలా తీసింది. దీంతో ఒక్కసారిగా దాదాపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తాయి. 
 • ముంబై కేంద్రంగా, పలు రాష్రా​‍్టల్లో కార్యకలాపాలు నిర్వహించిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌  (పీఎంసీ) బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు. మొండిబకాయిలను తక్కువగా చూపించడంతోపాటు, పలు నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించడం దీనికి నేపథ్యం. 


అక్టోబర్‌...

 • బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపో రేటుకు, ఇతర ఎక్న్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం. ఆర్‌బీఐ, తదితర ఆర్థిక వ్యవస్థ రేట్లను తక్షణం కస్టమర్‌కు బదలాయింపు జరిగేలా చూడ్డమే దీని లక్ష్యం. 

నవంబర్‌...

 • 20. తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)పై ఆర్‌బీఐ కొరడా.   కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మాజీ ఎండీ ఆర్‌ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్‌) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది. దివాలా చర్యలను ఎదుర్కోనున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిలవడం గమనార్హం. 

డిసెంబర్‌ ...

 • ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం  ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. 
 • ఈక్విటీల మాదిరే కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ (భారత్‌ బాండ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ప్రారంభానికి  ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 
 • ఇన్సాల్వెన్సీ, దివాలా  కోడ్‌ పక్రియతో రూ.42,000 కోట్లకు ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రపంచ స్టీల్‌ దిగ్గజం- ఆర్సిలార్‌మిట్టల్‌. 
 • 18.  2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని,  అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చని పేర్కొంది.  ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుందని కూడా  అని జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ‍ద్విసభ్య బెంచ్‌ తుది ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్ అప్పీలు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ తెలిపింది. 

 



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 31st December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) బలహీనంగా కదిలే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాలతో కదులుతోంది. దీనికితోడు సోమవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.65 శాతం స్థాయిలో క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లలో సోమవారం లాభాల స్వీకరణకు తెరలేచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. కాగా.. నేడు విభిన్న వార్తల నేపథ్యంలో కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలుంది.

ప్రారంభంలో సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Tuesday 31st December 2019

క్రితం రోజు ఒడిదుడుకులకు లోనైన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల స్వల్పలాభంతో 41,607 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 12,147 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category