News


మార్కెట్‌ ఉత్సాహానికి ట్రేడ్‌ వార్‌ అడ్డంకి?

Saturday 24th August 2019
Markets_main1566644951.png-27994

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యల ప్రభావం మార్కెట్‌పై సోమవారం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మార్కెట్‌ ఉత్సాహాన్ని తీవ్రతరమవుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మార్కెట్‌ల బౌన్స్‌బ్యాక్‌కు ఈ ట్రేడ్‌ వార్‌ అడ్డంకి కాగలదని వారు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 550 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అదనంగా 5 శాతం టారీఫ్‌లను విధించనున్నామని శుక్రవారం ప్రకటించడంతో యుఎస్‌-చైనా మధ్య ట్రేడ్‌వార్‌ తీవ్రమయ్యింది. ట్రంప్‌ ప్రకటన తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. దీంతోపాటు జాక్సన్ హోల్‌లో జరిగిన యుఎస్ ఫెడ్ చైర్మన్‌ జెరోమ్ పావెల్ ప్రసంగం రేట్ల కోతపై స్పష్టమైన సూచనలను ఇవ్వకపోవడం కూడా యుఎస్‌ మార్కెట్ల పతనానికి కారణమయ్యింది. గత సెషన్లో యుఎస్‌ నాస్‌డాక్‌ కాంపోజిట్ 3 శాతం, ఎస్ అండ్‌ పీ 500 2.6 శాతం, డోజోన్స్‌ 2.37 శాతం నష్టపోయాయి. అంతేకాకుండా యు.ఎస్. ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తులవైపు మారుతుండడంతో యుఎస్‌ ట్రెజరి ఈల్డ్‌లు కూడా పడిపోయాయి. 

ఉద్దీపన ప్రయోజనాలకు ముందే.. 
ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యల వలన దేశీయ మార్కెట్ ప్రయోజనం పొందకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై తాజా సుంకాలను ప్రకటించి ట్రేడ్‌ వార్‌ను ఉదృతం చేశారు. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలను అక్టోబర్ 1 నుంచి 25 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామని ట్రంప్ అన్నారు. మిగిలిన 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి ఈ సెప్టెంబర్ 1 నుంచి పెంచనున్నామని తెలిపారు. కాగా 300 బిలయన్‌ డాలర్ల దిగుమతులలో సగం ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 వరకు పెరిగిన సుంకాలను అమలు చేయమని అన్నారు. అంతేకాకుండా చైనాలో ఉన్న అమెరికన్‌ కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని ట్రంప్‌ కోరడం గమనార్హం. కాగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 75 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను పెంచాలనే చైనా నిర్ణయానికి ప్రతీకారంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   ‘ఏ దేశం కూడా పూర్తిగా చైనాను భర్తి చేయలేదు’ అని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా అన్నారు. ‘కానీ చైనా నుంచి కొద్ది మొత్తంలోనైనా వ్యాపారాలు ఇండియాకు వస్తే అది ఇండియాకు పెద్ద అవకాశమే’ అని ఆయన వివరించారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం, సోమవారం ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జాక్సన్‌ హోల్‌ ప్రసంగం ప్రతికూలమే..   
జాక్సన్ హోల్‌లో, ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్, రేట్ల కోతపై స్పష్టమైన సూచనలేవి ఇవ్వలేదు. యుఎస్‌ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటామని, అది యుఎస్‌ మానిటరీ పాలసీ ద్వారానే జరగాలని లేదని ఆయన తెలిపారు. కాగా ఫెడ్‌ చైర్మన్‌ ప్రకటన ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసిందని రాయిటర్స్‌ నివేదించింది. ఫెడ్ తన సెప్టెంబర్ సమావేశంలో రేట్లు తగ్గిస్తుందని అంచనావేసిన ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. 
    
దేశీయ అడ్డంకులు..
వీటితో పాటు జూన్ త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ గణాంకాలు వచ్చే వారం వెలువడనున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ మందగమన చిత్రాన్ని తెలియజేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆగస్టు సిరీస్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా ఆర్థిక మంత్రి బూస్టర్‌ ప్యాకేజి ఉత్సాహానికి కొంత అడ్డం కాగలదు. దీని వలన మార్కెట్ లాభాల్లో కొంత పరిమితులుంటాయిని, పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ప్రభావం దేశీయ స్టాక్స్‌పై ప్రభావం చూపుతుందని పరిశీలకులు తెలిపారు. 
  
అడ్డంకులున్నా, నిఫ్టీ 11,200 చేరుకుంటుంది..
వాణిజ్య యుద్ధం ప్రభావం వలన చైనా స్టాక్ మార్కెట్ ఈ నెలలో కేవలం 0.4 శాతం మాత్రమే క్షీణించగా, భారత సూచీలు 3.5 శాతం పడిపోవడం గమనార్హం. ‘మార్కెట్‌కు సోమవారం ట్రేడింగ్‌లో అనేక అడ్డంకులున్నప్పటికి నిఫ్టీ 11,1000-11,200 స్థాయిల వైపు కదలగలదని’ అని సామ్కో సెక్యురిటీస్‌, ఉమేష్‌ మెహతా అన్నారు. యుఎస్-చైనా తీసుకునే చర్యలు అస్థిరంగా ఉంటాయని, వారు ఒక రోజు కొన్ని ప్రకటనలు చేస్తారని, మరుసటిరోజే వాటికి విరుద్దమైన ప్రకటనలు చేస్తారని నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ సునీల్ జైన్ అన్నారు. ‘హెచ్చు తగ్గులు ఉండే రోజులుంటాయి. కానీ ఈ అంతర్జాతీయ పరిణామాలు ఇండియా మార్కెట్లలో అమ్మకాలను తీవ్రంగా ప్రేరేపించినట్టు నాకు అనిపించలేదు’ అని ఆయన వివరించారు. 



You may be interested

అందరివాడు... అరుణ్‌ జైట్లీ

Sunday 25th August 2019

- విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం - ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుకు - తరవాత బీజేపీ... వయా జనసంఘ్‌ - మొదటి నుంచీ మోదీకే మద్దతుదారు - కీలక నిర్ణయాలన్నిట్లోనూ ఆయన వెంటే - న్యాయవాదిగా కాంగ్రెస్‌ వారూ క్లయింట్లే (సాక్షి నాలెడ్జ్‌ విభాగం) రాజకీయాల్లో అందరి మనసుసూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్‌ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ

సోమవారం జలాన్‌ కమిటి నివేదిక సమర్పణ

Saturday 24th August 2019

 జలాన్‌ ప్యానెల్‌ సోమవారం తన నివేదికను ఆర్‌బీకి సమర్పించనుంది. ఆర్‌బీఐ బోర్డు కూడా అదే రోజూ నుంచి పరిగణలోకి తీసుకోంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన (రూ.9 లక్షల కోట్లు) మిగులు నిధులున్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఈ రూ.9లక్షల కోట్ల నిధుల్లో రూ.3లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం పట్టుపట్టింది. అయితే నాటి ఆర్‌బీఐ గవర్నర్‌

Most from this category