News


మార్కెట్‌లో ఎందుకీ భారీ పతనం

Sunday 2nd February 2020
Markets_main1580617081.png-31421

- మెప్పించని డీడీటీ ప్రతిపాదన
- ఎల్‌టీసీజీ పన్ను తొలగించకపోవడంపై నిరాశ
- ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాల సాధనపై సందేహాలు

జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్‌ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్‌...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్‌ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్‌.
నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్‌ పన్నును తగ్గించిన ఆర్థిక మంత్రి సీతారామన్‌...అదే బహుమతిని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కూడా ఇవ్వడం ఖాయమేనన్న మార్కెట్‌ అంచనాలు పూర్తిగా వాస్తవరూపం దాల్చలేదు. శ్లాబుల్ని విభజించి, రూ. 5 లక్షలకుపైబడి పన్ను ఆదాయం కలిగిన వారికి రేట్లు కొంత తగ్గించినప్పటికీ, మరోవైపు వివిధ సెక్షన్లు కింద లభిస్తున్న మినహాయింపుల్ని ఎత్తివేయడంతో మధ్య ఆదాయ వర్గాలకు ఒరిగేదేమీ లేకపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయా మినహాయింపుల ద్వారా భారీ వ్యాపారాన్ని పొందుతున్న ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు నిలువునా పతనంకావడం, వాటి మాతృసంస్థలైన పెద్ద ఫైనాన్షియల్‌ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇందుకు నిదర్శనం. 
డీడీటీపై డబుల్‌గేమ్‌...
అలాగే మరోవైపు డివిడెండు పంపిణీ పన్ను (డీడీటీ) పూర్తిగా ఎత్తివేస్తారన్న గట్టి అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ పన్నును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవానికి పన్ను చెల్లింపు బాధ్యతను కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి మళ్లించారు. ఇప్పటివరకూ 20 శాతం డీడీటీని కంపెనీలు చెల్లిస్తుండగా, ఇకనుంచి ఇన్వెస్టర్లు వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్ని అనుసరించి, డివిడెండ్లు రూపేణా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. అధిక టాక్స్‌ శ్లాబ్‌ రేట్లలో వుండే సంపన్నులు, ఆయా కంపెనీల ప్రమోటర్లు 43 శాతం పన్నును ఈ డివిడెండు ఆదాయంపై చెల్లించాల్సివుంటుంది. అలాంటప్పుడు ప్రమోటర్లు...ఆయా కంపెనీలు భారీ డివిడెండ్లు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? బైబ్యాకో, మరో పద్దతో అనుసరిస్తారు. ఈ కారణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన డీడీటీ ఎత్తివేత ప్రతిపాదన కూడా మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. 
ఇక లాంగ్‌టెర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ)పై పన్ను ఎత్తివేస్తారంటూ మార్కెట్లో బలంగా వున్న అంచనాల్ని కూడా సీతారామన్‌ తిప్పికొట్టారు. సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు...ఈక్విటీలపై ఎంత సానుకూల ప్రభావం చూపించిందో తెలిసిందే. కార్పొరేట్లకు చేకూర్చిన పెద్ద ప్రయోజనం చూసే...ఎల్‌టీసీజీని తొలగించి, ఇన్వెస్టర్లకు భారీ ప్రోత్సాహాన్ని కల్గిస్తారన్న అంచనాలు తప్పుకాదు. కానీ ఈ అంశంలో ఆర్థిక మంత్రి కల్గించిన నిరుత్సాహం కూడా ఈ రోజు మార్కెట్‌ పతనానికి ముఖ్య కారణం. 

కేటాయింపుల సంగతేంటి?
వ్యవసాయ, మౌలిక రంగాలకు భారీ కేటాయింపులు జరపడం దీర్ఘకాలికంగా మేలు చేకూర్చేదే అయినప్పటికీ, ఈ కేటాయింపులకు, ముఖ్యంగా మౌలిక రంగానికి ప్రతిపాదించిన రూ. లక్ష కోట్ల కేటాయింపులకు సంబంధించి నిర్థిష్టమైన ప్రణాళికలు ఏవీ వెల్లడికాలేదు. అందుకే అతిపెద్ద ఇన్‌ఫ్రా కంపెనీ అయిన లార్సన్‌ అండ్‌ టూబ్రో షేరు కూడా 6 శాతం పతనమయ్యింది. అలాగే ఆయా రంగాలు నిధుల్ని వినియోగించే తీరు, ఆయా ప్రాజెక్టులు అమలయ్యే విధానం వంటి పలు అంశాల ద్వారా  ఆర్థిక వ్యవస్థకు బలోపేతం అవుతూవుంటే, ఆయా కేటాయింపుల ప్రభావం దీర్ఘకాలంలో కన్పించవచ్చేమో. ఇప్పటికైతే ఇన్వెస్టర్లు....వారికి పన్నుల సంబంధిత అంశాల్లో తలెత్తిన తీవ్ర నిరాశను బడ్జెట్‌ కేటాయింపులతో కప్పిపుచ్చుకోలేకపోయారు. అందుకే ఈక్విటీలు కుప్పకూలిపోయాయి. 

ద్రవ్యలోటు ఆందోళనలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సతానికి గత బడ్జెట్లో నిర్దేశించుకున్న 3.3 శాతం ద్రవ్యలోటు మించిపోయిందని, అది 3.8 శాతానికి చేరుతుందని స్వయానా ఆర్థిక మంత్రే తన తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5 శాతం ద్రవ్యలోటును ప్రతిపాదించారు. అదీ రూ. 2 లక్షల కోట్లకుపైగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని సాధించడం, పన్ను వసూళ్లు భారీగా పెరగడం జరిగితేనే సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ. లక్ష కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యసాధనకు మరో రెండు నెలలే గడువు వుండగా, ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ కంపెనీల్ని మంచి ధరలకు ఈ లోపున అమ్మగలిగితేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్న అనుమానం కూడా మార్కెట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు వచ్చే ఏడాదికి ప్రతిపాదించిన రెట్టింపు డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని ప్రస్తుత పీఎస్‌యూ షేర్ల మార్కెట్‌ ధరల ప్రకారం సాధించగలరా? ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో వాటా విక్రయస్తామన్న ప్రకటనతో ..డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోవచ్చనే అశలు మొలకెత్తినప్పటికీ, వివిధ సెక్షన్ల కింద లభ్యమయ్యే ఆదాయపుపన్ను రాయితీల్ని ఎత్తివేయడం ఎల్‌ఐసీ విలువకు కోతవేయడమే. ఈ నేపథ్యంలో రూ. 2 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యసాధన జరిగి,  3.5 శాతానికి ద్రవ్యలోటును పరిమితం చేయగలరా వంటి అనుమానాలెన్నో ఇన్వెస్టర్లను వెన్నాడటంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెతాయి. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు బెంబేలు...
భారీ మొండి  బకాయిలతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత కొద్ది సంవత్సరాలు లక్షల కోట్ల మూలధనాన్ని సమకూరుస్తూ, వాటి మనుగడ చూసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఈ బడ్జెట్లో తాజా మూలధన కల్పన ప్రకటించకపోగా, క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి అవి నిధుల్ని సమీకరించుకోవాలంటూ ఆర్థిక మంత్రి ఘంటాపథంగా చెప్పడం మార్కెట్‌కు మరో పెద్ద షాక్‌. ఎస్‌బీఐ మినహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు వాటి 10–15 ఏళ్ల కనిష్టస్థాయిలు, జీవితకాల కనిష్టస్థాయిల వద్ద కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అవి మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించడం అంత సులభం కాదు. దీంతో ఒక్కసారిగా శనివారం పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు కుప్పకూలిపోయాయి. 

కరోనా కల్లోలమూ కారణమే....
చైనాలో ప్రబలిన కరోనావైరస్‌ ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ కల్లోలం సృష్టిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్‌ ఎమర్జన్సీ ప్రకటించగా, రెండు రోజుల క్రితం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ సమీక్షలో కూడా కరోనా కారణంగా ఆర్థికాభివృద్ధి అనిశ్చితిలో వున్నట్లు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల చైనా జీడీపీ వృద్ధి 0.3 శాతం తగ్గుతుందన్నది ప్రస్తుత అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. శుక్రవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2 శాతం పతనమయ్యాయి. ఇదే క్రమంలో సోమవారం...పదిరోజుల సెలవుల తర్వాత ప్రారంభంకానున్న చైనా స్టాక్‌ మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లన్నీ అట్టుడుకుతాయని ఇన్వెస్టర్లు ఒకవైపు భయపడుతున్నప్పటికీ, మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోత వంటి అద్భుతాన్ని ఈ శనివారం చూపుతారన్న అంచనాల్ని సీతారామన్‌ తల్లకిందులు చేశారు. దీంతో ప్రపంచ కరోనా సంబంధిత ఈక్విటీ తుఫాను కూడా భారత్‌ తీరాన్ని చేరింది. 
 You may be interested

ఇన్వెస్టర్లపై డివిడెండ్‌ ట్యాక్స్‌ భారం

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) భారం తొలగనున్నది. డీడీటీని కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయం కారణంగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా భారత్‌ అవతరిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. కంపెనీలపై డీడీటీని తొలగించడం కారణంగా ఏడాదికి రూ.25,000 కోట్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్లపై

ఒక ప్రధాన పోర్ట్‌నైనా కార్పొరేటీకరిస్తాం

Sunday 2nd February 2020

ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తాం లోథాల్‌లో మారిటైమ్‌ మ్యూజియమ్‌ ఏర్పాటు  బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్‌  న్యూఢిల్లీ: పోర్టుల పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒక ​ప్రధాన పోర్ట్‌ను అయినా కార్పొరేటీకరణ చేయాలని, ఆ తర్వాత దానిని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రతిపాదించారు. యాంత్రీకీకరణ, డిజిటైజేషన్‌, సరళతరమైన విధానాలు అవలంభించడం తదితర

Most from this category