News


ఎఫ్‌పీఐల డార్లింగ్స్‌... బీమా కంపెనీలే!

Friday 22nd November 2019
Markets_main1574392130.png-29768

  • ఈ రంగంలోని కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులు
  • 2019-20 తొలి ఆరు నెలల్లో రూ.17,000 కోట్లు
  • ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించినది ఎస్‌బీఐ లైఫ్‌
  • గడిచిన ఏడాది కాలంలో షేర్లు సైతం భారీ ర్యాలీ

న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్‌- ఆగస్ట్‌ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్‌ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ లిస్ట్‌ అయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్‌ మాత్రం ప్రభుత్వరంగ సంస్థ.
సెబీ నిబంధనలు అనుకూలం... 
‘‘గత 4-6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇనిస్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ పరిశోధన విభాగం అధిపతి దీపక్‌ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్‌ చేశారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్‌ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. 

దీర్ఘకాలంలో భారీ అవకాశాలు...
‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్‌బీఐ లైఫ్‌ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్‌ - సెప్టెంబర్‌ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. You may be interested

బీపీసీఎల్‌ రేసులో ఇతర పీఎస్‌యూలకు ఛాన్స్‌ లేదు

Friday 22nd November 2019

స్పష్టం చేసిన చమురు మంత్రి  పోటీ పెరిగితే చౌకగా సేవలు  న్యూఢిల్లీ:- భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వానికి

పెట్టుబడి ఎక్కడ.. లార్జ్‌క్యాప్‌ లేదా మిడ్‌, స్మాల్‌క్యాప్‌..?

Friday 22nd November 2019

నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన రికార్డులకు చేరువలో ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరువలో ఉంది. కాకపోతే ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యలతో వృద్ధి తిరిగి పునరుద్ధరణ బాటలో పడుతుందన్న నమ్మకం స్టాక్‌ మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోని స్టాక్స్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా, చౌకగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఇంకా ఆర్థిక వృద్ధి కుదుటపడని, గరిష్ట స్థాయిల్లో ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు

Most from this category