News


పెట్టుబడి ఎక్కడ.. లార్జ్‌క్యాప్‌ లేదా మిడ్‌, స్మాల్‌క్యాప్‌..?

Friday 22nd November 2019
Markets_main1574362480.png-29767

నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన రికార్డులకు చేరువలో ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరువలో ఉంది. కాకపోతే ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యలతో వృద్ధి తిరిగి పునరుద్ధరణ బాటలో పడుతుందన్న నమ్మకం స్టాక్‌ మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోని స్టాక్స్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా, చౌకగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఇంకా ఆర్థిక వృద్ధి కుదుటపడని, గరిష్ట స్థాయిల్లో ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలనే సంశయాన్ని ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్నారు. 

 

రిస్క్‌ తీసుకునే సామర్థ్యమే మీ పెట్టుబడులకు ఏ విభాగం అనువైనదన్నది తెలియజేస్తుంది. లార్జ్‌క్యాప్‌ విభాగంలో విలువలు బాగా అధిక స్థాయిల్లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఎంతో మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘భారత ఈక్విటీల వ్యాల్యూషన్లు వాటి దీర్ఘకాల సగటుకు సమీపంలో ఉన్నాయి. నిఫ్టీ 12 నెలల ఫార్వార్డ్‌ పీఈ 18.8 వద్ద ట్రేడవుతోంది. దీర్ఘకాల సగటు 18 రెట్ల కంటే 4 శాతం అధికం. నిఫ్టీ ధరను పుస్తక విలువతో చూసినా కానీ చారిత్రకంగా సగటుకు సమీపంలోనే 2.7 రెట్ల వద్ద ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన నివేదికలో తెలిపింది. మార్కెట్‌ ర్యాలీ అంతా ఆశల ఆధారితంగానే జరుగుతోందని, క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

‘‘లార్జ్‌క్యాప్‌, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ మధ్య అంతరం ఎందుకంటే చాలా లార్జ్‌క్యాప్‌ కంపెనీలు అంచనాలకు అనుగుణంగా లేదా మెరుగైన ఫలితాలను ప్రకటించడం వల్లే. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఫలితాలపై సానుకూల ప్రభావం చూపింది. అదే సమయంలో కంపెనీల అమ్మకాలు, ఎబిట్డా కూడా నిరాశపరచలేదు. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను గమనిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో పెద్దగా రికవరీ లేదు. కనుక లార్జ్‌క్యాప్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే విలువ ఆధారిత కొనుగోళ్లు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో చూడొచ్చు’’ అని ట్రేడ్‌బుల్స్‌ సీఎండీ దినేష్‌ టక్కర్‌ పేర్కొన్నారు. మిడ్‌, స్మాల్‌క్యాప్‌, విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెంచుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నట్టు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.

 

ట్రేడింగ్‌ బుల్స్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌ సంస్థలు సానుకూలంగా ఉన్న స్టాక్స్‌: బీపీసీఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంకు, డాబర్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఫెడరల్‌బ్యాంకు, అపెక్స్‌ ఫ్రోజన్‌ ఫుడ్స్‌, మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌, మారికో, సుబ్రోస్‌, వోల్టాస్‌, హావెల్స్‌, ఎంఅండ్‌ఎం. 



You may be interested

ఎఫ్‌పీఐల డార్లింగ్స్‌... బీమా కంపెనీలే!

Friday 22nd November 2019

ఈ రంగంలోని కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులు 2019-20 తొలి ఆరు నెలల్లో రూ.17,000 కోట్లు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించినది ఎస్‌బీఐ లైఫ్‌ గడిచిన ఏడాది కాలంలో షేర్లు సైతం భారీ ర్యాలీ న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే

ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.150 వస్తేనే..: సీవోఏఐ

Friday 22nd November 2019

టెలికం కస్టమర్లు తిరిగి పూర్వపు ధరలు చెల్లించే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి ప్రస్తుతం వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.124గా ఉంది. ఇది కనీసం రూ.150కు చేరాల్సిన అవసరం ఉందని, అప్పుడే కంపెనీలు మనుగడ సాగించగలవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.    సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ

Most from this category