News


బడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లు చూద్దామా..?

Tuesday 21st January 2020
Markets_main1579628860.png-31080

రాకేశ్‌ జున్‌జున్‌వాలా, డాలీఖన్నా, రాధాకిషన్‌ దమానీ, ఆశిష్‌ కచోలియా, అనిల్‌ కుమార్‌ గోయల్‌ వీరంతా విజయవంతమైన బడా స్టాక్‌ ఇన్వెస్టర్లు. వందలు, వేల కోట్ల రూపాయల సంపదను వీరు స్టాక్‌ మార్కెట్లో సృష్టించుకున్న విజేతలు. వీరు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియో పరంగా మార్పులు, చేర్పులు చేస్తుంటారు. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లు వీరిని గుడ్డిగా అనుసరించడం సరికాదు. అలా అని అస్సలు పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీరంతా తాము ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆయా కంపెనీల ప్రొఫైల్‌ను పరిశీలించే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపార వృద్ధి, ప్రణాళికల పరంగా ఏదైనా సందేహం వస్తే వెంటనే ఎగ్జిట్‌ కూడా అవుతుంటారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీరు చేసిన పెట్టుబడుల వివరాలు చూద్దాం..

 

రాధాకిషన్‌ దమానీ
డీమార్ట్‌ ప్రమోటర్‌గానే కాదు ఆరితేరిన స్టాక్‌ ఇన్వెస్టర్‌గానూ రాధాకిషన్‌ దమానీ ప్రసిద్ధుడు. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇండియా సిమెంట్స్‌లో తన వాటాలను గణనీయంగా పెంచుకున్నారు. సెప్టెంబర్‌ నాటికి 1.3 శాతం వాటా ఉండగా, డిసెంబర్‌లో మరో 3.43 శాతం వాటా అదనంగా కొనుగోలు చేశారు. దీంతో ఇండియా సిమెంట్స్‌లో ఆయనకున్న వాటా 4.73 శాతానికి చేరింది. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో 3.26 శాతం, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాలో 2.28 శాతం వాటాలు కొనుగోలు చేశారు. అలాగే, డెల్టా కార్ప్‌లో వాటాను 1.53 శాతం నుంచి 1.32 శాతానికి తగ్గించుకున్నారు. 

 

రాకేశ్‌ జున్‌జున్‌వాలా
టైటాన్‌ కంపెనీలో సెప్టెంబర్‌ క్వార్టర్లో స్వల్ప వాటాలను జున్‌జున్‌వాలా విక్రయించగా, తన నిర్ణయం పొరపాటు అనుకున్నారేమో కానీ, తిరిగి డిసెంబర్‌ త్రైమాసికంలో 0.18 శాతం వాటాలను టైటాన్‌లో కొనుగోలు చేయడం ద్వారా తన మొత్తం వాటాను 6.69 శాతానికి పెంచుకున్నారు. ర్యాలీస్‌ ఇండియాలో తన వాటాను 9.76 శాతం నుంచి 9.79 శాతానికి పెంచుకున్నారు. ఇక అదే సమయంలో ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌లో వాటాను 8.22 శాతం నుంచి 7.4 శాతానికి, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌లో 3.1 శాతం నుంచి 2.78 శాతానికి, ఫెడరల్‌ బ్యాంకులో 3.11 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గించుకున్నారు. జున్‌జున్‌వాలాతోపాటు, ఆయన భార్య రేఖ జున్‌జున్‌వాలా వాటాలు కూడా ఇందులో కలసి ఉన్నాయి.

 

డాలీఖన్నా
ముత్తూట్‌ క్యాపిటల్‌లో కొత్తగా 1.13 శాతం మేర వాటాలను డాలీఖన్నా పేరిట ఆమె భర్త రాజీవ్‌ఖన్నా కొనుగోలు చేశారు. డాలీఖన్నా పేరుతో పెద్ద పోర్ట్‌ఫోలియోను రాజీవ్‌ఖన్నా నిర్వహిస్తుంటారు. బటర్‌ఫ్లై గాంధిమతి అప్లయన్సెస్‌లోనూ 1.07 శాతం వాటాలు కొన్నారు. నోసిల్‌లో మాత్రం 1.93 శాతం నుంచి 1.83 శాతానికి వాటా తగ్గించుకున్నారు.

 

ఆశిష్‌ కచోలియా
బిర్లాసాఫ్ట్‌ కంపెనీలో 1.99 శాతం వాటాను సమకూర్చుకున్నారు. అపోలో పైప్స్‌లో వాటాను 2.01 శాతం నుంచి 3.52 శాతానికి పెంచుకున్నారు. పౌషక్‌లో 1.19 శాతం వాటా కొన్నారు. వైభవ్‌ గ్లోబల్‌లో 1.48 శాతం వాటాను 1.55 శాతానికి పెంచుకున్నారు. ఇక మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌లో 2.17 శాతం నుంచి 1.46 శాతానికి, సీహెచ్‌డీ డెవలపర్స్‌లో 5.31 శాతం నుంచి 5.07 శాతానికి, హికాల్‌లో 1.34 శాతం నుంచి 1.15 శాతానికి వాటాలు తగ్గించుకున్నారు.

 

అనిల్‌కుమార్‌ గోయల్‌
కేఆర్‌బీఎల్‌లో అనిల్‌ కుమార్‌ గోయల్‌ వాటా 5.54 శాతం నుంచి 5.63 శాతానికి పెరిగింది. అలాగే, త్రివేణి ఇంజనీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లోనూ 2.83 శాతం నుంచి 2.86 శాతానికి వాటా పెంచుకున్నారు. వర్ధమాన్‌ స్పెషల్‌ స్టీల్స్‌లో వాటాను 3.72 శాతం నుంచి 3.29 శాతానికి తగ్గించుకున్నారు. You may be interested

ఎయిర్‌టెల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి

Wednesday 22nd January 2020

న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు టెలికం శాఖ (డాట్) ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.35,586 కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ బాకీలు ప్రభుత్వానికి కట్టాల్సిన గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు 74 శాతం దాకా వాటాలు పొందే ప్రతిపాదనకు ఆర్‌బీఐ

నిలిచిన ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, డిష్‌టీవీ విలీనం!

Tuesday 21st January 2020

డిష్‌టీవీని విలీనం చేసుకోవడం ద్వారా దేశంలో అగ్రగామి డీటూహెచ్‌ కంపెనీగా అవతరించాలన్న ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ ప్రయత్నాలకు తాత్కాలిక విఘాతం ఏర్పడింది. డీల్‌ విషయమై ఈ రెండు సంస్థల మధ్య అంగీకారం కుదరకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్‌ సేవల మార్కెట్లో రిలయన్స్‌ జియో విప్లవం సృష్టించిన విషయం తెలిసిందే. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్లోనూ దూసుకుపోయేందుకు ఈ సంస్థ పెద్ద ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో

Most from this category