News


రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తున్నారా..?

Tuesday 25th February 2020
Markets_main1582569686.png-32051

బాగా పడిపోతున్న స్టాక్స్‌లో ఎంతో విలువ దాగి ఉందని రిటైల్‌ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్టున్నారు. రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌ అయినవి, కార్పొరేట్‌ సమస్యలతో కుదేలయినవి, రుణాల చెల్లింపుల్లో చేతులెత్తేస్తున్నవి, నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవి.. ఇలా ఎన్నో కారణాలతో బాగా పడిపోతున్న స్టాక్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు చాలా గరిష్ట స్థాయికి చేరడం చూస్తుంటే.. అవి మళ్లీ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తాయని రిటైల్‌ ఇన్వెస్టర్లు అంచనా వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. 

 

బీఎస్‌ఈ 500 సూచీలోని రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా అధికంగా కలిగిన ప్రతీ 10 స్టాక్స్‌లో 9 గడిచిన 12 నెలల కాలంలో 95 శాతం వరకు మార్కెట్‌ విలువను గణనీయంగా కోల్పోయినవే. వీటిలో విలువ దాగుందని రిటైల్‌ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సాధారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు తక్కువ ధర ఉన్న స్టాక్స్‌ను ఎక్కువగా లైక్‌ చేస్తుంటారని, అవి ఎప్పుడైనా బాగా పడిపోతే వాటిని యావరేజ్‌ చేస్తుంటారని షేర్‌ఖాన్‌కు చెందిన హేమంగ్‌జాని తెలిపారు. చాలా సైకిల్స్‌లో ఈ ధోరణి కనిపిస్తుందన్నారు. యస్‌ బ్యాంకు షేరు గడిచిన ఏడాది కాలంలో 84 శాతం పతనమైంది. బీఎస్‌ఈ 500 సూచీలో అధిక రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా ఉన్నది యస్‌ బ్యాంకులోనే. రూ.2లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బ్యాంకులో 43.7 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే, కర్ణాటక బ్యాంకు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుల్లోనూ డిసెంబర్‌ త్రైమాసికం చివరికి రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు 42 శాతానికి చేరాయి. గడిచిన 12 నెలల్లో కర్ణాటక బ్యాంకు 33 శాతం, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు 25 శాతం పతనమయ్యాయి.

 

రిలయన్స్‌ క్యాపిటల్‌ గత ఏడాదిలో 95 శాతం క్షీణించింది. ఈ కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 36.5 శాతానికి చేరుకుంది. అలాగే, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, టీవీఎస్‌ శ్రీచక్ర, నోసిల్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, పీసీ జ్యుయలర్‌ షేర్లు కూడా గతేడాది కాలంలో 22-92 శాతం మధ్య పడిపోయాయి. వీటిల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు 31-36 శాతం మధ్యనున్నాయి. ఫండ్‌ మేనేజర్లు స్టాక్స్‌ నుంచి బయటకు వెళ్లిపోతుంటే స్టాక్స్‌ ధరలు పడిపోతాయని, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీతోనే కొనసాగుతుంటారని హేమంగ్‌ జానీ తెలిపారు. ‘‘విచిత్రం ఏమిటంటే చాలా రీసెర్చ్‌ సంస్థలు తొలుత యస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌కు హోల్డ్‌ కాల్‌ ఇచ్చినవే. ఎన్‌పీఎల్‌, ఇతర సమస్యల తీవ్రతను అవి అర్థం చేసుకోలేకపోయాయి’’ అని జాని వివరించారు. అయితే టాటా ఎలెక్సీకి మాత్రం మినహాయింపు ఉంది. ఈ స్టాక్‌లో రిటైలర్ల వాటా 33.5 శాతంగా ఉన్నా కానీ, గత ఏడాది కాలంలో 13 శాతం పెరిగింది. తిరిగి 2021 ఆర్థిక సంవత్సరంలో టాటా ఎలెక్సీ వేగవంతమైన వృద్ధి పథంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నట్టు షేర్‌ఖాన్‌ తెలిపింది.You may be interested

లిస్టింగ్‌తోనే దిగ్గజాలను వెనక్కి నెట్టనున్న ఎస్‌బీఐ కార్డ్స్‌

Tuesday 25th February 2020

ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుండగా, 5న ముగియనుంది. అనంతరం అదే నెల 16న స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్ట్‌ అవనుంది. లిస్టింగ్‌తోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ అప్పటికే నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని 16 కంపెనీలను మార్కెట్‌ విలువ పరంగా (గత శుక్రవారం నాటి గణాంకాల ఆధారంగా) వెనక్కి నెట్టేయనుంది. ఐపీవోలో ధరల శ్రేణి రూ.750-755గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వారం

ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా ఇండియా:ముఖేష్‌ అంబానీ

Monday 24th February 2020

అతి త్వరలో ఇండియా ప్రీమియర్‌ డిజిటిల్‌ సొసైటీగా మారనుందని భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ అన్నారు. సోమవారం ముంబైలో జరుగుతున్ను ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈఓ సదస్సు(ఫిబ్రవరి 24-26)లో పాల్గొన్న  మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ సత్యనాదెళ్లతో ముచ్చటించిన సందర్భంగా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రీమియర్‌ డిజిటల్‌ సోసైటీగా మారడమేగాక, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  ఎదుగుతుందన్నారు. పేరుగాంచిన డిజిటల్‌​ సమాజంగా ఇండియా మారుతుందని, మొబైల్‌

Most from this category