News


ఈ ఏడాదీ ఐపీఓల జోరు !

Saturday 22nd February 2020
Markets_main1582340858.png-31992

  • 2020లో ఐపీఓల జోష్‌
  • ఐపీఓ బాటలో కనీసం 30 కంపెనీలు 
  • రూ.50,000 కోట్లకు పైగా నిధుల సమీకరణ
  • గత ఏడాదితో పోల్చితే నాలుగు రెట్లు 
  • ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే ఉంటే 1.50 లక్షల కోట్లకు ఐపీఓ నిధులు 


ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్‌ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే వచ్చే అవకాశాలుంటే ఇది 1.5 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఎల్‌ఐసీతో పాటు ఎస్‌బీఐ కార్డ్స్‌, యూటీఐ ఏఎమ్‌సీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని, గత ఏడాది కంటే ఈ ఏడాదే ఐపీఓల జోరు బాగా ఉండగలదని నిపుణులంటున్నారు. 2019లో 16 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.12,300 కోట్ల మేర సమీకరించాయి.. ఇక ఈ ఏడాది కనీసం 20-30 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, నిధుల సమీకరణ నాలుగు రెట్లకు పెరగవచ్చని విశ్లేషకులంటున్నారు. మరిన్ని వివరాలు..

ఐపీఓ జోరు కొనసాగుతుందా ?
గత ఏడాది స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టించింది. ఐపీఓకు వచ్చిన కంపెనీలు అదరగొట్టే లాభాలనివ్వడం, ప్రతి ఐపీఓ కూడా అనేక రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడంతో ఈ ఏడాది కూడా ఐపీఓ జోరు కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఈ ఏడాది కనీసం 40 కంపెనీల ఐపీఓలు మార్కెట్‌ను ముంచెత్తుతాయని అంచనా. అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఉదార ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలుండటంతో గ్లోబల్‌ లిక్విడిటీ మన మార్కెట్‌ను ముంచెత్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఐఆర్‌సీటీసీ, సీఎస్‌బీ బ్యాంక్‌ వంటి ఐపీఓలు గత ఏడాది ఊహించనంతగా విజయం కావడంతో కార్పొరేట్లలో విశ్వాసం పెరిగింది. ఇక గత ఏడాది ఐపీఓకు వచ్చిన షేర్లు ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌లో  మంచి లాభాలనే ఇచ్చాయి. సగటున ఐపీఓ షేర్ల రాబడి 40 శాతానికి పైగానే ఉండటం విశేషం. ఐఆర్‌సీటీసీ, ఆఫిల్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్లు ఇష్యూ ధర కంటే రెట్టింపునకు పైగా పెరిగాయి. 

ఎల్‌ఐసీ ఐపీఓ
ఎవ్వరూ ఊహించని విధంగా ఎల్‌ఐసీని స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్‌ తర్వాత ఐపీఓకు వస్తామని ఎల్‌ఐసీ వర్గాలు వెల్లడించాయి.  ఎంత శాతం వాటా విక్రయిస్తారు ? ఇష్యూ సైజు ఎంత ఉంటుందనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ఎల్‌ఐసీలో కనీసం పది శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మొత్తం మీద భారత్‌లో ఇప్పటివరకూ అతి పెద్ద ఐపీఓ(రూ.15,000 కోట్లు)గా కోల్‌ ఇండియా రికార్డ్‌ను ఎల్‌ఐసీ బ్రేక్‌ చేయనున్నది. 


30కి పైగా కంపెనీలు
 ఈ ఏడాది ఇప్పటివరకూ 10 కంపెనీలకు పైగా  ఐపీఓలకు సెబీ అనుమతిచ్చింది. వీటి విలువ రూ.16,000 కోట్ల మేర ఉంది. సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య గత ఏడాది 28 ఉండగా, 2018లో 72, 2,017లో 46గా ఉన్నాయి. ఇక సెబీ ఆమోదం కోసం మరో 11 కంపెనీల ఐపీఓలు  ఎదురు చూస్తున్నాయి. వీటి విలువ రూ.21,200 కోట్లమేర ఉంటుంది. సెబీ ఆమోదం పొందిన ఐపీఓల జాబితాలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (రూ.9,000 కోట్లు) మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌, రూట్‌ మొబైల్‌(ఇష్యూ సైజు-రూ.600 కోట్లు), సంహి హోటల్స్‌ (రూ.2,000 కోట్లు), ఐఆర్‌ఈడీఏ(రూ.750 కోట్లు), శ్యామ్‌ స్టీల్, బజాజ్‌ ఎనర్జీ(రూ.5,450 కోట్లు), సత్యశ్రీ ప్రెజర్‌, అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, బర్గర్‌ కింగ్‌ ఇండియా(రూ.1,000 కోట్లు), పురానిక్‌ బిల్డర్స్‌(రూ.1,000 కోట్లు), ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌(రూ.510 కోట్లు), మోంటొకార్లో ఉన్నాయి. ఇక ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించిన కంపెనీల్లో  హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌(రూ.1,500 కోట్లు),  ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(రూ.1,000 కోట్లు), యూటీఐ ఏఎమ్‌సీ(రూ.4,000 కోట్లు), ఇండియన్‌ రైల్వేస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(రూ.1,000 కోట్లు),  ఎన్‌సీడీఈఎక్స్‌ (రూ.500 కోట్లు), స్టోవ్‌ క్రాఫ్ట్‌, కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌,  వంటి కంపెనీలు ఉన్నాయి. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌, రైల్‌టెల్‌,  తదితర కంపెనీలు త్వరలోనే ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పిస్తాయని సమచారం.  ఈ కంపెనీలన్నీ కలిసి కనీసం రూ.40,000-50,000 కోట్ల రేంజ్‌లో నిధులు సమీకరించనున్నాయి. 

నిధులు సమీకరణ...ఐపీఓనే మేలు మార్గం
గత ఐదేళ్లలో  రానన్ని కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ ఉమేశ్‌ మెహతా అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ విషయంలో కూడా ఈ ఏడాది అదరగొడుతుందని పేర్కొన్నారు. భారత్‌లో మూలధనానికి కొరత తీవ్రంగా ఉందని, దీర్ఘకాలిక మూలధన నిధుల సమీకరణకు ఐపీఓ మంచి మార్గమని వివరించారు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, బర్గర్‌ కింగ్‌ తదితర ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  కాగా ఇన్వెస్టర్లకు ప్రీమియమ్‌ షేర్లు సమంజసమైన ధరలకే లభించే ఏకైక మార్గం ఐపీఓనే కావడం కంపెనీలకు కలసివచ్చే అంశం. 

ఇష్యూ ధర కీలకం
మార్కెట్‌ బలహీనంగా ఉంటే, ఐపీఓల జోరు తగ్గుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ పతన బాటలో ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని, దీంతో కంపెనీలు ఐపీఓలు వాయిదా వేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఐపీఓ సక్సెస్‌ కావడానికి ఇష్యూ ధర కీలకమని షేర్‌ఖాన్‌  ఎనలిస్ట్‌ హేమంగ్‌ జని వ్యాఖ్యానించారు. మార్కెట్‌ స్థితిగతులు కూడా కీలకమేనని, ఈ రెండూ బావుంటే గత ఏడాది కంటే అధికంగానే ఈ ఏడాది ఐపీఓలు వస్తాయని వివరించారు.  

 


 



You may be interested

అమెరికా టాప్‌ 20లో టీసీఎస్‌..

Saturday 22nd February 2020

న్యూయార్క్‌: అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమమైన టాప్ 20 సంస్థల జాబితాలో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ చోటు దక్కించుకుంది. పలు అమెరికన్ మెగా కంపెనీల సరసన నిల్చిన భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం. 2020 ఏడాదికి గాను ఫార్చూన్‌ రూపొందించిన బెస్ట్ బిగ్ కంపెనీస్ టు వర్క్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్చున్ జాబితాలో చోటు దక్కించుకోవడంపై టీసీఎస్ ప్రెసిడెంట్ (ఉత్తర అమెరికా, యూకే, యూరప్‌)

వచ్చేనెల్లో వరుసగా వారంరోజులు బ్యాంకుల బంద్‌

Friday 21st February 2020

ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈరోజు( శుక్రవారం) మహాశివరాత్రి కావడంతో పబ్లిక్‌ హాలిడే, రేపు  నాల్గో  శనివారం కావడంతో రేపు సెలవు, ఆ తరువాత ఆదివారం ఎలాగు బ్యాంకులు పనిచేయవు కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీనివల్ల  చెక్‌ క్లియరెన్స్‌ వంటి ముఖ్యమైన కార్యాకలాపాలు, లావాదేవీలకు ఆటంకం ఏర్పడడంతో ఖాతాదారులు ఇబ్బందులు గురవుతున్నారు. వచ్చే నెల(మార్చి)లో కూడా బ్యాంకు కస్టమర్లకు మరిన్ని

Most from this category