News


ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి

Monday 29th July 2019
Markets_main1564383232.png-27373

- వడ్డీ రేట్ల నిర్ణయంపై మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం
- డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు ఈవారంలోనే..
- మౌలిక సదుపాయాల గణాంకాలు (బుధవారం), మార్కిట్‌ తయారీ పీఎంఐ డేటా (గురువారం) వెల్లడి

ముంబై: గత వారాంతాన ఆగస్టు సిరీస్‌ తొలి రోజు ట్రేడింగ్‌ లాభాలను నమోదుచేసినప్పటికీ.. వారం మొత్తం మీద చూస్తే బేర్స్‌దే హవాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటల్ స్టాక్స్ నష్టాల కారణంగా ప్రధాన సూచీలు 1.2 శాతం నష్టపోయి.. వరుసగా మూడో వారంలోనూ నష్టాలను మిగిల్చాయి. ప్రపంచ టాప్‌-15 మార్కెట్లలో మే నెల నుంచి ఇప్పటివరకు ఇతర దేశాల సూచీలు 18 శాతం వరకు లాభాలను ఇవ్వగా.. కేవలం దేశీయ స్టాక్‌ సూచీలు మాత్రమే 2 శాతం (డాలర్‌ రాబడుల లెక్కన) నష్టాలను మిగిల్చాయి. బడ్జెట్లో సూపర్‌ రిచ్‌పై సర్‌చార్జ్‌ విధించిన నేపథ్యంలో పడిపోతూ వస్తోన్న దేశీ ప్రధాన సూచీలు ఈవారంలోనైనా కోలుకుంటాయా? లేదంటే.. మరింత పతనమవుతాయా? అనే ఆందోళనకర వాతావరణానికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, ఈవారంలో వెలువడే కార్పొరేట్‌ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక అంశాలు దిక్సూచీలుగా మారనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి సంకేతాలు ఏవైనా కనిపిస్తేనే మళ్లీ భాతర మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతుంది. వీరి పెట్టుబడులను ఆకర్షిస్తే మార్కెట్‌ ఒక్కసారిగే పెరిగే అవకాశం ఉంది’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. 

ఫెడ్‌ సమావేశంపై మార్కెట్‌ ఫోకస్‌...
వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ)ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం రాత్రి ప్రకటించనున్నారు. ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా యూఎస్‌ ఎకానమీ క్రమంగా దెబ్బతింటోన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసమైనా ఎఫ్‌ఓఎంసీ ఈసారి 25 శాతం మేర వడ్డీ రేట్లలో కోత విధించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రాయిటర్స్‌ పోల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించగా.. మరి కొందరి అంచనా ప్రకారం 50 బేసిస్‌ పాయింట్ల వరకు కోత ఉంటే మాత్రం ఇది భారత మార్కెట్‌కు కూడా సానుకూల పరిణామంగా మారనుందని జియోజిత్‌ కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ హరీష్‌ తన అంచనాను ప్రకటించారు.

ఈవారంలోనే ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలు..
నిఫ్టీ 50 షేర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, ఐఓసీ, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దాదాపు 400 కంపెనీల క్యూ1 ఫలితాలు ఈవారంలో వెల్లడికానుండగా.. ఈ జాబితాలో అశోక్ లేలాండ్, డీఎల్‌ఎఫ్, బాటా ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, వీఐపీ ఇండస్ట్రీస్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, హడ్కో, డిష్‌ టీవీ, సింఫనీ, అపోలో టైర్స్, ఇండియా మార్ట్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, టాటా గ్లోబల్, టాటా పవర్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారికో, సన్ ఫార్మా అడ్వాన్స్డ్‌ రీసెర్చ్, అలెంబిక్ ఫార్మా, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీనపడినందున మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత బలహీనపడిందని, ఈ సమయంలో కంపెనీల ఫలితాలు నిరాశపరిస్తే మాత్రం పతనం కొనసాగుతుందని కాపిటల్‌ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రోమేష్ తివారీ అన్నారు. హెచ్‌యూఎల్‌ వృద్ధి ఏకంగా ఏడు త్రైమాసికాల కనిష్టస్థాయికి పడిపోయిన అంశం ఆధారంగా చూస్తే.. సెంటిమెంట్‌ మరికొంతకాలం బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..,
జూన్‌ మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు బుధవారం విడుదల కానుండగా.. జూలై మార్కిట్‌ తయారీ పీఎంఐ డేటా గురువారం వెల్లడికానుంది. ఇక అమెరికా-చైనా దేశాల సంధానకర్తల సమావేశం మంగళవారం షాంఘైలో జరగనుంది.

జూలైలో రూ.3,700 కోట్లు ఉపసంహరణ
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జూలై 1-26 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.14,383 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. గడిచిన ఐదు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా కొనసాగుతున్న వీరు.. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్‌ మార్కెట్‌లో రూ.10,624 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ రూ.3,700 కోట్లకు పరిమితమైంది.



You may be interested

సెన్సెక్స్‌ కీలక అవరోధం 38,340

Monday 29th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారంలో జరపనున్న విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ మినహా ఇతర ప్రధాన దేశాల సూచీల్లో జోష్‌ కన్పించడం లేదు. ఫెడ్‌ రేటు తగ్గింపుకంటే ట్రేడ్‌వార్స్‌, వినియోగ డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలతో యూరప్‌, ఆసియా మార్కెట్లు సతమతమవుతుండగా, ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో మన మార్కెట్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా

మీ లక్ష్యాలకు గన్‌షాట్‌

Monday 29th July 2019

మిరే అస్సెట్‌ ఎమర్జింగ్ బ్లూచిప్‌ ఫండ్‌ దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో దూకుడైన రాబడులు రెండూ ఈ పథకంలో భాగం. ఎందుకంటే మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. ఈ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది.  రాబడులు... ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి

Most from this category