News


ఒడిదుడుకుల వారం..!

Monday 22nd July 2019
Markets_main1563778600.png-27219

  • గురువారం జూలై సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు 
  • మారుతి సుజుకి, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈవారంలోనే..
  • నెమ్మదించిన వినియోగం, పేలవమైన ఫలితాలు, పన్ను అంశాలతో దెబ్బతిన్న సెంటిమెంట్‌

ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో గతవారం నష్టాలను నమోదుచేసిన దేశీ స్టాక్‌ సూచీలు.. ఈవారంలో భారీ ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడే ఆస్కారం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన పలు దిగ్గజ కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం, కేంద్ర బడ్జెట్‌లో సంపన్న వర్గాలపై సర్‌చార్జ్‌ పెంపు ప్రతిపాదనలు, వినియోగం నెమ్మదించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో నష్టాల బాట పట్టిన సూచీలు.. ఇక్కడ నుంచి మరింత పతనమై కీలక దీర్ఘకాలిక మద్ధతు స్థాయిలను కోల్పోతాయా? లేదంటే, నిలదొక్కుకుంటాయా అనే అంశానికి ఈవారం ట్రేడింగ్‌ దిశా నిర్దేశం చేయనుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించగా.. వీటి క్యూ1 ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై ఉండనుందని, ప్రధాన సూచీల్లో  భారీ వెయిటేజ్‌ ఉన్న ఈ రెండు దిగ్గజ కంపెనీలు మార్కెట్‌ను ఆదుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈవారంలోని మిగిలిన రోజుల్లో ట్రేడింగ్‌ ఎలా ఉన్నప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించడం, ఆర్‌ఐఎల్‌ ఫలితాలు అంచనాలను మించడం అనేవి సోమవారం సూచీల దిశను నిర్దేశించే ప్రధాన అంశాలుగా ఉన్నాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అజిత్‌ మిశ్రా అన్నారు. ఇక వారం మొత్తం మీద భారీ ఒడిదుడుకులకే ఆస్కారం ఉందని సాహిల్‌ ఎడెల్వీస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అన్నారు. జూలై 25న (గురువారం) జూలై సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉన్నందున ఒడిదుడుకులు అధిక స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందన్న ఆయన.. తన అంచనా ప్రకారం నిఫ్టీ 11,650 పాయింట్లకు చేరనుందని, భారీగా పతనమైన అనేక షేర్లకు కొనుగోలు మద్దతు లభించనుందని విశ్లేషించారు. ఫలితాల సీజన్‌ కొనసాగుతున్నందున ఈవారంలో ఇదే అంశం కీలకంగా మారిందని, ఎంపిక చేసిన షేర్లకు మాత్రమే కొనుగోలు మద్దతు లభించనుందని భావిస్తున్నట్లు ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ అన్నారు. 


ఈవారంలో దిగ్గజ కంపెనీల ఫలితాలు...
నిఫ్టీ 50లోని కంపెనీల జాబితాలో.. హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంత, బజాజ్ ఫిన్‌సర్వ్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. 

బ్యాంకింగ్‌ రంగ ఫలితాల్లో...
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫలితాలను ప్రకటించనున్నాయి.

250 కంపెనీల ఫలితాలు ఈవారంలోనే...
డీహెచ్‌ఎఫ్ఎల్, టీవీఎస్‌ మోటార్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జస్ట్ డయల్, ఎన్‌ఐఐటి టెక్నాలజీస్, యునైటెడ్ స్పిరిట్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, ఒబెరాయ్ రియల్టీ, రిలయన్స్ నిప్పన్ లైఫ్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్, టాటా స్టీల్ బిఎస్ఎల్, అంబుజా సిమెంట్స్, బయోకాన్, టోరెంట్ ఫార్మా, ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పీవీఆర్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, మహీంద్రా లైఫ్‌స్పేస్, హావెల్స్ ఇండియా, ఎస్కార్ట్స్ కంపెనీల ఫలితాలు ఈవారంలో విడుదలకానున్నాయి. మార్కెట్‌ వర్గాలు కంపెనీల ఫలితాలపై భారీ ఆశలనే పెట్టుకోగా.. ఇవి మొత్తంగా నిరాశపరిచే విధంగానే ఉన్నట్లు తాను భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దిద్దుబాటు మరి కొంత కాలం ఉండవచ్చని, వర్షాల ఆధారంగా తరువాతి కదలికలు ఉండవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ విశ్లేషించారు. 

అంతర్జాతీయ అంశాల ప్రభావం...
గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల ప్రకటన ఉండగా.. అమెరికా జీడీపీ అడ్వాన్స్‌ రీడింగ్‌ శుక్రవారం ప్రచురితంకానుంది. 

వెనక్కు తగ్గిన ఎఫ్‌ఐఐలు..,
జూలైలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జూలై 1-19 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.7,712 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. గడిచిన ఐదు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా కొనసాగుతున్న వీరు.. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే, డెట్‌ మార్కెట్‌లో రూ.9,371 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో వీరి నికర పెట్టుబడి రూ.1,659 కోట్లుగా ఉంది.You may be interested

38,730 దిగువన సెన్సెక్స్‌ బలహీనం

Monday 22nd July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెలాఖరులో జరపనున్న విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ మినహా ఇతర ప్రధాన దేశాల సూచీల్లో జోష్‌ కన్పించడం లేదు. ఫెడ్‌ రేటు తగ్గింపుకంటే ట్రేడ్‌వార్స్‌, వినియోగ డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలతో యూరప్‌, ఆసియా మార్కెట్లు సతమతమవుతుండగా, ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో మన మార్కెట్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా

ఈ టైంలో లాంగ్‌పుట్‌ బటర్‌ఫ్లై స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 22nd July 2019

నిపుణుల సలహా నిఫ్టీ కీలక 11460 పాయింట్ల నిరోధాన్ని కోల్పోయింది. దీంతో నిఫ్టీ క్రమంగా 11300 పాయింట్ల వరకు పతనమవుతుందని, ఈ స్థాయిని కాపాడుకోలేకుంటే క్రమంగా 11200 పాయింట్లను కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైకి 11500 పాయింట్లకు వచ్చినప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరగనుంది. తాజా బ్రేక్‌డౌన్‌తో నిఫ్టీపై బుల్స్‌ పట్టు జారినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బేరిష్‌ లాంగ్‌పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహాన్ని అవలంబించడం మంచిదని సూచిస్తున్నారు.  ఇది ఒక రేంజ్‌బౌండ్‌ వ్యూహం.

Most from this category