News


ఆర్‌బీఐ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచీ..!

Monday 2nd December 2019
Markets_main1575256410.png-29986

  • గురువారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
  • అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై మార్కెట్‌ దృష్టి
  • ఈనెల 6న వియన్నాలో ఒపెక్‌ సమావేశం
  • శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం..

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు.. సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్‌పైనే తాజా డేటా ప్రభావం ఉండనుండగా.. మీడియం టెర్మ్‌లో మార్కెట్‌ పథంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసి) సమావేశం 3న (మంగళవారం) ప్రారంభమై, 5న (గురువారం) ముగియనుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటుపై ఎంపీసీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేటు 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గవచ్చని ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విశ్లేషకులు రాహుల్ గుప్తా అంచనావేశారు. వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గిన కారణంగా తయారీ, పారిశ్రామిక రంగాలు మందగమనంలో ఉన్నందున మళ్లీ వృద్ధి రేటును గాడిలో పెట్టడం కోసం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విశ్లేషించారు. ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ అదితి నాయర్,  ప్రభుదాస్ లిల్లాధర్ కూడా పావు శాతం తగ్గింపును అంచనావేస్తున్నట్లు చెప్పారు.

ఆటో సేల్స్‌, ఆర్థికాంశాల ప్రభావం..
ఈ వారంలో ఆటో, టెలికం రంగాల షేర్లు మార్కెట్‌ దృష్టిని ఆకర్షించనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. దేశీ ఆటో రంగ నవంబర్‌ నెల అమ్మకాలు ఆదివారం వెల్లడికాగా.. మారుతీ సుజుకీ విక్రయాలు 1.9 శాతం, టాటా మోటార్స్‌ అమ్మకాలు 25 శాతం క్షీణతకే పరిమితం అయ్యాయి. అంతక్రితం నెలల్లో వరుసగా భారీ తగ్గుదలను నమోదుచేసిన ఆటో రంగ కంపెనీలు.. ఇక నుంచి గాడిన పడవచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మరోవైపు, వరుసగా ట్యారిఫ్‌లను పెంచుతూ టెలికం రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒపెక్‌ సమావేశంపై దృష్టి
చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌).. ఆస్ట్రియాలోని వియన్నాలో డిసెంబర్ 6న (శుక్రవారం) సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి కోతలను పొడిగిస్తారా? లేదా అనే అంశంపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. ప్రస్తుతం కొనసాగిస్తున్న (రోజుకు 1.2 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోత) ప్రణాళికనే వచ్చే ఏడాది జూన్‌ వరకు కొనసాగించే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ అంచనావేసింది. శీతాకాలం అనంతరం మరింత లోతుగా పరిశీలన చేయాలనే యోచనలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తోంది. ఇక అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందం.. ఏ మలుపు తీసుకుంటుందో అనే అంశం కూడా ఈ వారంలో కీలకంగా మారిపోయింది.

కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ...
భారత్‌ కాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా 3వ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నవంబర్‌ నెల్లో రూ. 22,872 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఈక్విటీ మార్కెట్లో రూ. 25,230 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 2,358 కోట్లను వెనక్కు తీసుకున్నారు. దీంతో నికరంగా రూ. 22,872 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఇక అక్టోబర్‌లో రూ. 16,038 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 6,558 కోట్లను వీరు ఇక్కడి మార్కెట్లో నికరంగా పెట్టుబడి పెట్టారు. 

 You may be interested

సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 40,000–40,600

Monday 2nd December 2019

అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్‌ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్‌ చాలావరకూ డిస్కౌంట్‌ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ‘లోకల్‌’ మంత్ర

Monday 2nd December 2019

దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయి (సుమారు రూ.350 లక్షల కోట్లు)కి తీసుకెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇందుకు 2024ను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, తాజాగా జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోగలమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మంత్రాన్ని అచరణలో పెడితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.    ‘‘బొగ్గు

Most from this category