News


2025 నాటికి సెన్సెక్స్‌... 1,00,000: కార్వీ

Wednesday 5th June 2019
Markets_main1559756897.png-26119

ఎన్నికల ఘట్టం ముగిసిపోయింది. మోదీ సర్కారుకే దేశ ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఇప్పటి వరకు నిధులతో వేచి చూసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు పెట్టుబడి అవకాశాల అన్వేషణలో పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల అండతో దేశీయ సూచీలు నూతన రికార్డు స్థాయిలకు దూసుకుపోవడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే, తమ పోర్ట్‌ఫోలియోలో వేటిని చేర్చుకోవాలన్న మీమాంసతో ఉన్న ఇన్వెస్టర్లు ఎందరో ఉన్నారు. ఇక ముందు మార్కెట్లలో రాబడులు అన్నవి కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఆర్థిక రంగం పనితీరుపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఆర్థిక రంగం, కంపెనీల ఎర్నింగ్స్‌ మరింత మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. విధానాల స్థిరత్వం, వాటి కొనసాగింపు అన్నది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతాయని, దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల రాక పెరుగుతుందని కార్వీ ప్రైవేటు వెల్త్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ హెడ్‌ శంతను అవస్థి పేర్కొన్నారు. కార్వీ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌ సెన్సెక్స్‌ 2025 నాటికి లక్ష మార్కును చేరుతుందని అంచనా కట్టింది. 

 

చారిత్రకంగా ఎన్నికలు జరిగిన ప్రతీ సంవత్సరంలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మెరుగైన పనితీరు చూపించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, గత పనితీరు భవిష్యత్తుకు సూచికగా భావించరాదు. 2014 సంవత్సరంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 55 శాతం ర్యాలీ చేయగా, లార్జ్‌క్యాప్‌ ర్యాలీ 30 శాతంగానే ఉంది. 2009లో మిడ్‌క్యాప్‌ 108 శాతం పెరిగితే, లార్జ్‌క్యాప్‌ పెరుగుదల 81 శాతంగా ఉంది. 2004లో మిడ్‌క్యాప్‌ 26 శాతం పెరగ్గా, లార్జ్‌క్యాప్‌ 13 శాతమే పెరిగింది. జీఎస్టీ కారణంగా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి వ్యాపారం మళ్లడం వల్ల కూడా మిడ్‌క్యాప్‌ కంపెనీలు ప్రయోజనం పొందుతాయన్నది కార్వీ అంచనా. తమ మోడల్‌ మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియోకు కేటాయింపులను 20 శాతం నుంచి 25 శాతానికి పెంచినట్టు పేర్కొంది. సాధారణ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో ప్రధాన భాగాన్ని, లార్జ్‌క్యాప్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌తో కొనసాగించాలన్న సూచన ఇస్తున్నట్టు తెలిపింది. 25 శాతం కేటాయింపులను మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌నకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ద్వారా కేటాయింపులు చేసుకోవాలన్న సూచన ఇచ్చింది. 

 

పాలక పార్టీ దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతిష్టాత్మక లక్ష్యాలతో ఉన్నందున (ముఖ్యంగా రోడ్లు, రైల్వే, మెట్రో, ఎయిర్‌పోర్ట్‌లు) వచ్చే ఐదేళ్ల కాలంలో 100 ట్రిలియన్లు ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు అవకాశం ఉన్నట్టు కార్వీ పేర్కొంది. అలాగే, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ అన్నది ఇన్వెస్టర్లు దృష్టి సారించాల్సిన మరో విభాగం. ఫైనాన్షియల్‌ సేవల్లో ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు మంచి యాజమాన్యం చేతుల్లో ఉన్న వాటిపై దృష్టి సారించొచ్చని సూచించింది. ముఖ్యంగా మైక్రోఫైనాన్స్‌ రంగంపైనా దృష్టి సారించొచ్చని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు వ్యతిరేక దిశగా, దీర్ఘకాలానికి నిధులు తీసుకుని, ఇవి స్వల్పకాలానికి రుణాలు ఇస్తుంటాయని తెలిపింది. కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌, యూటీఐ ఈక్విటీ ఫండ్‌, మిరే  ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌/ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్స్‌ను ఐదేళ్ల కాలానికి కార్వీ సూచించింది. 



You may be interested

చౌకగా మూడు బ్లూచిప్‌లు...!

Wednesday 5th June 2019

ఎటువంటి పరిస్థితుల్లో అయినా బ్లూచిప్‌ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆయా కంపెనీల బ్రాండ్‌ విలువ, వాటి సామర్థ్యాలే వీటికి కారణం. ఎంతటి దిగ్గజ కంపెనీలు అయినా మార్కెట్‌ ప్రతికూలతల సమయాల్లో అమ్మకాల కారణంగా ధరల పరంగా దిద్దుబాటుకు లోనవుతుంటాయి. నిజానికి సాధారణ ఇన్వెస్టర్లకు అటువంటి సమయాలే పెట్టుబడులకు అనుకూలమని వారెన్‌ బఫెట్‌ వంటి నిపుణులు చెబుతుంటారు. కొన్ని అంశాల ఆధారంగా బ్లూచిప్‌ కంపెనీల్లో చౌకగా ట్రేడ్‌ అవుతున్న, ఆకర్షణీయంగా

ఇండియా వృద్ధిరేటు అంచనాలు యథాతధం!

Wednesday 5th June 2019

7.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ‍ప్రకటించిన ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీ వృద్ధిరేటు వచ్చే మూడేళ్ల పాటు 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేట్‌ వినిమయంలో జోరు కారణంగా ఎకానమీలో వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.2 శాతం ఉంటుందని అంచనా వేశామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కానీ భారత జీడీపీ గత సంవత్సరం 6.8 శాతం వృద్ధినే నమోదు చేసింది.

Most from this category