News


అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌ ప్లాన్‌ రద్దు యోచనలో సెబీ?!

Wednesday 12th February 2020
Markets_main1581484842.png-31717

బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో ఇంట్రాడే లావాదేవీల వాటా 50 శాతం 
రోజువారీ లేదా డెరివేటివ్‌ విభాగంలో లావాదేవీల నిర్వహణకు ట్రేడర్లు చెల్లించవలసిన అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌(ముందస్తు చెల్లింపు) ప్రణాళిక రద్దయ్యే అవకాశమున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీ కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోసాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ అంశాన్ని సానుకూల థృక్పథంతో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో 50-70 శాతం వరకూ ఇంట్రాడే లావాదేవీల నుంచే నమోదవుతూ ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా..  పూర్తిస్థాయిలో అప్‌ఫ్రంట్‌ మార్జిన్ల చెల్లింపుల కారణంగా ఇటీవల బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌ మందగిస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో మార్జిన్ల రద్దు అంశాన్ని బ్రోకింగ్‌ వర్గాలు సెబీ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించాయి. ఇందుకు సెబీ అనుమతిస్తే స్టాక్‌ బ్రోకర్లు క్లయింట్ల లావాదేవీలకు వీలుగా తొలుత చెల్లించవలసిన మార్జిన్లలో కొంతమేర సమకూర్చేందుకు(పార్ట్‌ ఫైనాన్స్‌) వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మొదట్లో ఇంట్రాడే లావాదేవీలకు క్లయింట్ల నుంచి  పూర్తిస్థాయిలో ముందస్తు మార్జిన్లను వసూలు చేయవలసిందిగా బ్రోకింగ్‌ సంస్థలను ఎక్స్ఛేంజీలు ఆదేశించాయి. అయితే ఇకపై ఇంట్రాడే లావాదేవీలకు నామమాత్ర మార్జిన్లనే చెల్లించేందుకు వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతక్రితం ఒకే రోజులో లావాదేవీని పూర్తిచేసే ట్రేడర్లు సైతం ముందస్తు మార్జిన్లను చెల్లించవలసి వచ్చేదని వివరించారు. 

అప్రమత్తత కోసమే
బ్రోకింగ్‌ వ్యవస్థలో నమోదవుతున్న అధిక లెవరేజ్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చన్న ఆలోచనతోనే సెబీ మార్జిన్ల విధింపును చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రోకింగ్‌ సంస్థలు ఒక క్లయింట్‌కు చెందిన నిధులు లేదా పోర్ట్‌ఫోలియోను మరో క్లయింట్‌కు వినియోగిస్తున్నారా వంటి అంశంపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. అయితే ఈ అంశంపై బ్రోకింగ్‌ వర్గాలు సొంత నిధులనే వెచ్చిస్తున్నట్లు ఇచ్చిన వివరణతో సెబీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్లయింట్ల లావాదేవీకి సంబంధించి బ్రోకర్లు 80 శాతం మార్జిన్‌ మనీని సమకూర్చేందుకు సెబీ అంగీకరించే వీలున్నట్లు సంబంధి వర్గాలు చెబుతున్నాయి. తద్వారా క్లయింట్లు 20 శాతం చెల్లించడం ద్వారా లావాదేవీలు చేపట్టవచ్చని తెలియజేశాయి. క్లయింట్లు ఎంత శాతం చెల్లించాలనేది సెబీ నిర్ణయించనున్నట్లు అభిప్రాయపడ్డాయి. ఉదాహరణకు నిఫ్టీ ఫ్యూచర్స్‌ విలువ రూ. 9.08 లక్షలు అనుకుంటే.. ఎక్స్ఛేంజీల నిబంధనల ప్రకారం ఒక లాట్‌కు క్లయింట్‌ 11 శాతం అంటే రూ. లక్ష చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఇంట్రాడేలో అయితే ముందస్లు మార్జిన్ల విలువలో 20 శాతం అంటే రూ. 20,000 చెల్లిస్తే సరిపోతుందని విశ్లేషకులు వివరించారు. ఇంట్రాడే లావాదేవీలు తక్కువ రిస్కుతో కూడుకున్నవి కావడంతో బ్రోకింగ్‌ వర్గాలు వీటికి ప్రాధాన్యత ఇస్తాయని తెలియజేశారు. అయితే ముందస్తు మార్జిన్లను చెల్లించకుండా పొజిషన్లను తదుపరి రోజుకి కొనసాగిస్తే (క్యారీ ఫార్వార్డ్‌) బ్రోకింగ్‌ సంస్థలు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుందని వివరించాయి.



You may be interested

ఐపీఓకు ఎన్‌సీడీఈఎక్స్‌

Wednesday 12th February 2020

రూ.500 కోట్ల నిధుల సమీకరణ సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ ఇండియాలో అతిపెద్ద అగ్రి డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌  నేషనల్‌ కమోడిటీ డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఐపీఓ మొత్తం రూ.500 కోట్లను సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా ఎగ్జిస్టింగ్‌​ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించడంతో పాటు రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించిన నిధులను

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Wednesday 12th February 2020

మార్కెట్‌ రెండో రోజూ ర్యాలీలో భాగంగా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,554.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో ఇండెక్స్‌ 0.81శాతం లాభపడి 31554.70 వద్ద

Most from this category