ఐపీఓకు సౌదీ అరామ్కో
By Sakshi

దహ్రన్(సౌదీ అరేబియా):- సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు ఈ నెలలో సాకారమవుతోంది. బుక్ బిల్డింగ్ విధానంలో షేర్లను జారీ చేస్తామని, కంపెనీ చైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్ ఆదివారం వెల్లడించారు. ఆఫర్ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్ బిల్డింగ్ పీరియడ్ చివర్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. సౌదీ వాసులు, సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్ వాసులు కూడా దరఖాస్తు చేయవచ్చని వివరించారు. ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనున్నది. సౌదీ ఆరామ్కో షేర్ల ట్రేడింగ్ సౌదీ అరేబియా స్టాక్ ఎక్స్చేంజ్, తాదావుల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చే నెలలో (బహుశా డిసెంబర్ 11న) మొదలు కావచ్చని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ! 11,110 కోట్ల డాలర్ల నికర లాభం ...
ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద ఐపీఓ బహుశా ఇదే కానున్నది. ఎంత వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదో అనే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. విశ్లేషకులైతే ఈ కంపెనీ విలువను 1.7-1.5 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. 1 శాతం వాటా విక్రయిస్తే, ఐపీఓ సైజు సుమారుగా 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. ఒకవేళ 2 శాతం వాటా విక్రయిస్తే, ఇష్యూ సైజు 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే అవుతుందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ రికార్డ్ ఇప్పటిదాకా అలీబాబా కంపెనీ(2,500 కోట్ల డాలర్లు) పేరిట ఉంది. కాగా రెండు ఎక్స్చేంజ్ల ద్వారా ఐదు శాతం వాటాను విక్రయించాలని సౌదీ ఆరామ్కో కంపెనీ గతంలో నిర్ణయించింది. తాదావుల్ సౌదీ ఎక్స్చేంజ్ ద్వారా 2 శాతం, ఇతర విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మరో 3 శాతం వాటాను విక్రయించాలని అప్పట్లో ఈ కంపెనీ యోచించింది. అయితే ప్రస్తుతానికి విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఆలోచనను ప్రస్తుతం ఈ కంపెనీ పక్కనపెట్టింది. కాగా మన దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఐపీఓ కోల్ ఇండియాదే (రూ.15,100 కోట్లు-సుమారుగా 200 కోట్ల డాలర్లు)
గత ఏడాదిలో సౌదీ ఆరామ్కో కంపెనీకి 11,110 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చింది. ఇది దిగ్గజ కంపెనీలు-యాపిల్, గూగుల్, ఎక్సాన్ మొబిల్ కంపెనీల మొత్తం నికర లాభం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం. ఈ కంపెనీ గత ఏడాది 22,400 కోట్ల స్థూల లాభం ఆర్జించిందని ఫిచ్ వెల్లడించింది. ఇదే ఏడాది యాపిల్ స్థూల లాభం 8,200 కోట్ల డాలర్లు, ఎక్సాన్ మొబిల్ స్థూల లాభం 4,000 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
You may be interested
గృహ రుణంలో మీ ఎంపిక ఏది?
Monday 4th November 2019ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటుకు మారుతున్న బ్యాంకులు- రెపో ఆధారిత రుణాలకు అధిక ప్రాధాన్యం వీటిల్లో పారదర్శకత పాళ్లు కాస్త ఎక్కువే గతంలో ఎంసీఎల్ఆర్, బేసు రేటు ఆధారంగా రుణాలు నూతన విధానంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం అధికం మారే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా దిగొచ్చాయి. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్లతో గృహ రుణ రేట్లను అనుసంధానించాలన్న ఆర్బీఐ ఆదేశాలకు లోబడి బ్యాంకులు రెపో రేటుతో
3,400 ప్రభుత్వరంగ బ్యాంకు శాఖలు మాయం
Monday 4th November 2019న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐకి చేసుకున్న దరఖాస్తు ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75