News


రెండేళ్లలో రిలయన్స్‌ షేరు రెట్టింపు?

Monday 12th August 2019
Markets_main1565634059.png-27722

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ప్రకటించిన నిర్ణయాలు కంపెనీ భవిష్యత్తును ఆకర్షణీయంగా మార్చేవిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం స్టాక్‌ ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండేళ్లు ఓపిక పడితే ఈ స్టాక్‌ రెట్టింపు అవుతుందని పేర్కొంటున్నారు. ‘‘ఆర్‌ఐఎల్‌ 65 బిలియన్‌ డాలర్ల రుణంపై క్రెడిట్‌ సూసే ఆందోళన సరైనది కాదు.  రూ.4 లక్షల కోట్ల నికర విలువ కలిగి ఉండడంతోపాటు, రిఫైనరీ, ఆయిల్‌ కెమికల్స్‌, రిటైల్‌, జియో వ్యాపారాలు ఉన్న ఈ సంస్థ చేసిన ప్రకటనలు మార్కెట్‌కు కచ్చితంగా ఉత్సాహన్నిస్తాయి. ఆస్తుల నగదీకరణ ద్వారా కంపెనీ లాభం 2-3 ఏళ్లలో పెరుగుతుంది. సౌదీఆరామ్‌కో ఒప్పందం ఈపీఎస్‌ను పెంచేది’’ అని ఎస్‌పీ తులసియాన్‌ పేర్కొన్నారు. 

 

గత ఏడాది కాలంలో ఆర్‌ఐఎల్‌ దేశంలోనే అతిపెద్ద లాభదాయక కంపెనీగా అవతరించడం గమనార్హం. మూడు రకాల వృద్ధి ఆధారిత వ్యాపారాలు (ఆయిల్‌, కెమికల్స్‌ విభాగం, జియో, రిటైల్‌) కలిగిన డైవర్సిఫైడ్‌ అతిపెద్ద కంపెనీ ఇదే. సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందానికి ముందు ఇంధన రిటైల్‌ అవుట్‌లెట్ల కోసం బ్రిటిష్‌ పెట్రోలియంతో కూడా వాటాల విక్రయం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవి కంపెనీకి గణనీయమైన విజయాలను, విలువను తెచ్చిపెడతాయన్నది విశ్లేషకుల అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సౌదీ ఆరామ్‌కో ఒప్పందాలు, నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు ఆర్‌ఐఎల్‌ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించడం గమనార్హం. 

 

ఆర్‌ఐఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ప్రస్తుత ధరలోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని, 2019లో ఈ స్టాక్‌ నూతన గరిష్టాలను చేరుతుందని, రానున్న రెండేళ్లలో ఈ స్టాక్‌ రెట్టింపు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన మూలాల కారణంగా రెండేళ్ల దృష్టితో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని, ప్రస్తుత స్థాయి నుంచి పెట్టుబడులను రెట్టింపు చేయగలదని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. ‘‘ఈ స్టాక్‌ 2019లో నూతన గరిష్టాలకు వెళ్లే అవకాశాలు ఉ‍న్నాయి. ఆరామ్‌కోతో ఒప్పందం, బీపీతో జాయింట్‌ వెంచర్‌ కీలకమైన సానుకూలతలు. 2021 ఆర్థిక సంవత్సరం చివరికి రుణ రహితంగా మారాలన్నది కంపెనీ ప్రణాళిక. దీన్ని మార్కెట్‌ సానుకూలంగా తీసుకుంటుంది. ఈ నెల 13న గ్యాప్‌ అప్‌తో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని క్యాపిటల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ జైన్‌ పేర్కొన్నారు. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 13th August 2019

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ప్రపంచ మార్కెట్లు క్షీణించినా, భారత్‌ సూచీలు మాత్రం మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 37.775 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11.3340 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఇన్వెస్టర్లకు కేంద్రం పలు పన్ను రాయితీలు ప్రకటించవచ్చన్న అంచనాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...సౌదీ అరామ్‌కోతో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు ఇక్కడి మార్కెట్లు లాభాలతో

మాంద్యానికి చేరువగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ

Monday 12th August 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. మాంద్యానికి చేరువ అవుతోందని అభిప్రాయపడింది. భారత్‌ మాత్రం మాంద్యానికి దగ్గర్లో లేదని, మందగమనంలోనే ఉందని స్పష్టం చేసింది.    ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా బలహీనత చూపిస్తున్నాయని, తదుపరి దశ ప్రపంచ వ్యాప్తంగా మాంద్యమేనని భావిస్తున్నట్టు మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ఇప్పటి నుంచి వచ్చే తొమ్మిది నెలల కాలంలో

Most from this category