News


సంపద సృష్టికర్తల్లో టాప్‌.. రిలయన్స్‌

Thursday 19th December 2019
Markets_main1576726985.png-30293

టాప్‌-3లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు
మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో... అంటే 2014-19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014-19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2014-19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్‌ 3 కంపెనీలుగా ఆర్‌ఐఎల్‌, ఇండియా బుల్స్‌ వెంచర్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్‌ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్‌-10 సంపద సృష్టికర్తల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 2009-19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014-19 కాలంలో సెన్సెక్స్‌ కాంపౌండెడ్‌ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది.
ఫైనాన్షియల్‌ రంగం ముందంజ...  
ఫైనాన్షియల్‌ రంగం 2014-19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్‌ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌బీసీసీ. 2014-19 మధ్య కాలంలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ రూపొందించింది.



You may be interested

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Thursday 19th December 2019

ప్రపంచ ప్రతికూల సంకేతాల ఫలితంగా గురువారం స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 41,535 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,210 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

మిస్త్రీ చేతికి టాటా పగ్గాలు

Thursday 19th December 2019

(అప్‌డేటేడ్‌) - చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదు - కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు - ప్రైవేట్ సంస్థగా మార్పునకూ తిరస్కరణ - టాటా గ్రూప్‌ అప్పీలుకు 4 వారాల అవకాశం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)

Most from this category