News


వయసైపోతోంది.. రిస్కు తగ్గుతోంది..

Thursday 7th February 2019
Markets_main1549521239.png-24062

- ఇక కొంతైనా పొదుపు పథకాల్లో పెట్టాలి
- స్టార్టప్‌ కంపెనీలతో లాభం లేదు
- రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ‍వ్యాఖ్యలు

ముంబై: రిస్కులుండే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులతో కోటీశ్వరుడిగా ఎదిగిన దేశీ ఇన్వెస్ట్‌మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా... క్రమంగా ఈక్విటీల విషయంలో జోరు కాస్త తగ్గించుకోవాలనుకుంటున్నారు. కొంతైనా సురక్షితమైన పొదుపు పథకాల్లో దాచుకోవాలని భావిస్తున్నారు. వయస్సు మీద పడుతుండటంతో రిస్కులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు స్టార్టప్స్ సదస్సు టైకాన్‌లో పాల్గొన్న సందర్భంగా రాకేష్‌ వెల్లడించారు. "నాకూ వయస్సు మీద పడుతోంది. రిస్క్‌లను కొంత స్థాయికి పరిమితం చేసుకోవాలి. నా సంపదలో కనీసం 5- 10 శాతం మొత్తాన్ని పొదుపు పథకాల్లోకి మళ్లించాలి అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాకేష్ సంపద రూ.19,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇందులో కేవలం రూ.50,000 మాత్రమే ఫిక్సిడ్ డిపాజిట్‌గా ఉండగా, రూ.1 కోటి మాత్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఉందని ఆయన చెప్పారు. తన సంపదలో 5 శాతాన్ని ఇద్దరు సంతానం కోసం ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తానన్నారు. ఒకవేళ వాళ్లు తన సంపదంతా జూదమాడి తగలెట్టేసినా.. ఎలాగోలా బతికేందుకు ఆ డబ్బు అప్పుడు ఉపయోగపడుతుందని చెప్పారు.
స్టార్టప్‌ సంసం‍్థల్లో మూసధోరణులు..
చాలా మటుకు స్టార్టప్ సంస్థలు ఎలాంటి ప్రత్యేకత లేకుండా మూస ధోరణుల్లోనే ఉంటున్నాయని రాకేష్ అభిప్రాయపడ్డారు. వాటిల్లో పెట్టుబడులపరంగా గానీ వ్యాపారపరంగా గానీ లాభం ఉంటుందని తనకైతే అనిపించడం లేదన్నారు. 2000, 2007లో స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసిన రెండు సార్లూ నష్టాలే చవిచూసిన నేపథ్యంలో రాకేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "చాలా మటుకు స్టార్టప్స్‌.. ఏదో కొత్తగా చేస్తున్నామంటాయి. కానీ చూస్తే ఒకేరకమైన మూస ధోరణుల్లోనే కనిపిస్తున్నాయి. పెద్దగా ప్రత్యేకతేమీ ఉండటం లేదు. స్టార్టప్స్ వ్యాపారాలను అర్థం చేసుకోవడం కష్టం. అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను" అని రాకేష్ చెప్పారు.
గ్యాంబ్లింగ్ అంటే ఇష్టం..
గ్యాంబ్లింగ్ అంటే తనకు చాలా ఇష్టమని రాకేష్ ఝున్‌ఝన్‌వాలా వెల్లడించారు. దేశీయంగా గోవా తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని చట్టబద్ధంగా అనుమతించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఇక మార్కెట్స్ విషయానికొస్తే.. ట్రేడింగ్ అనేది ప్రియురాలు లాంటిదని, దీర్ఘకాలిక పెట్టుబడి భార్యలాంటిదని ఆయన అభివర్ణించారు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటేనే సంపద పోగు చేసుకోవడం సాధ్యపడుతుందన్నారు. పెట్టుబడులను ఆషామాషీగా తీసుకోకూడదన్న రాకేష్... వేతన జీవుల్లాంటి నాన్‌- ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవచ్చని చెప్పారు. మరోవైపు, భారీ వేల్యుయేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్లే ఇటీవలి మార్కెట్స్ పతనంలో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. నియంత్రణ సంస్థల నిర్లిప్తత సహా పలు అంశాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభానికి కారణమని రాకేష్ అభిప్రాయపడ్డారు. ‍అయితే, గతంతో పోలిస్తే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు 5,000 రెట్లు మెరుగుపడ్డాయన్నారు.
ఇప్పుడు వారానికి రెండు సార్లే..
మార్కెట్స్‌తో నిత్యం బిజీగా ఉండే తాను రిలాక్స్ అయ్యేందుకు గతంలో ప్రతి రోజూ విస్కీ సేవించే వాడినని, ప్రస్తుతం దీన్ని వారానికి రెండు సార్లకు పరిమితం చేసుకున్నానని రాకేష్ చెప్పారు. అప్పుడప్పుడు యోగా కూడా చేస్తుంటానన్నారు. అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ఆలోచనా సరళిని మార్చేసిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు రాకేష్ తెలిపారు.You may be interested

‘‘పన్నుల’’ అంబుడ్స్‌మన్‌ రద్దు

Thursday 7th February 2019

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నులు (ఆదాయపన్ను), పరోక్ష పన్నులకు సంబంధించి అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, పరిష్కార యంత్రాంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  ఆదాయపన్నుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార లక్ష్యంతో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అంబుడ్స్‌మన్‌ను 2003లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వద్దకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కు తగ్గిపోయింది. ఆన్‌లైన్‌ ఫిర్యాదుల

వారం కనిష్టానికి పసిడి ధర

Thursday 7th February 2019

డాలర్‌ ఇండెక్స్‌ రెండు వారాల గరిష్టానికి ర్యాలీ చేయడంతో పసిడి ధర వారం కనిష్టానికి చేరుకుంది. ఆసియాలో గురువారం ఔన్స్‌ పసిడి 7డాలర్లు నష్టపోయి 1308 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులకు తాము సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ భారీగా పుంజుకుంది. నిన్న రాత్రి అమెరికాలో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం ర్యాలీ

Most from this category