News


బడ్జెట్‌ అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం

Monday 20th January 2020
Markets_main1579487478.png-31027

  • ఈ వారంలో కీలక కంపెనీల ఫలితాలు
  • పెరుగుతున్న బడ్జెట్‌ అంచనాలు 
  • టెల్కోల ‘ఏజీఆర్‌’ చెల్లింపులకు గడువు  ఈ వారమే 
  • ఆల్‌టైమ్‌ హైల వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీలు 
  • ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్ట్‌ల సూచన

కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వీటితో పాటు కేంద్ర బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. అంతర్జాతీయ అంశాల కన్నా కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బడ్జెట్‌పైననే మార్కెట్‌ దృష్టి ప్రధానంగా ఉంటుందని నిపుణుల ఉవాచ. 

ఫలితాల ప్రభావం...
17 నెలల వాణిజ్య పోరుకు తెరదించుతూ అమెరికా-చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదరడం, అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, ముడి చమురు ధరలు చల్లబడటం, కంపెనీల క్యూ3 ఫలితాలు బాగానే ఉండటం తదితర కారణాల వల్ల గత వారంలో స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది.  శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలు, శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు తమ తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డ్‌ స్థాయి లాభాన్ని సాధించగా, టీసీఎస్‌ ఫలితాలు అంచనాలను తప్పాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం పెరిగినా, రుణ నాణ్యత తగ్గింది. సోమవారం మార్కెట్‌పై ఈ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం ఉంటుంది. ఇక ఈ వారంలో ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బయోకాన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలతో సహా దాదాపు వందకు పైగా కంపెనీలు తమ ఫలితాలను వెల్లడిస్తాయి. 

ఏజీఆర్‌ ఎఫెక్ట్‌...
టెలికం కంపెనీలు ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) బకాయిల చెల్లింపునకు గడువు ఈ నెల 23 (గురువారం) ‍కావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు రూ.1.47 లక్షల కోట్ల మేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంక్‌లపైనా కూడా ప్రభావం పడనున్నది. ఏజీఆర్‌ బకాయిల విషయమై కొంత ఊరటనివ్వాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, మార్కెట్‌పై సానకూల ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
అప్రమత్తత తప్పనిసరి...
సెన్సెక్స్‌, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. క్యూ3 ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ కదలికలు కీలకమని పేర్కొన్నారు. బడ్జెట్‌ అంచనాల కారణంగా వ్యవసాయ, గ్రామీణ, ఎరువుల, ప్రభుత్వ రంగ, మౌలిక, నిర్మాణ రంగ షేర్లపై ప్రభావం ఉంటుందని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, జపాన్‌, యూరప్‌ కేంద్ర బ్యాంక్‌ల పాలసీ సమావేశాలు ఈ వారమే జరుగుతాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు @ రూ.1,288 కోట్లు...
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 17 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో రూ.10,200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.8,912 కోట్లు వెనక్కి తీసుకున్నారు. నికరంగా మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.1,288 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం, అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. కాగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, రానున్న బడ్జెట్‌.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడను నిర్దేశిస్తాయని వారంటున్నారు. You may be interested

సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 41,700

Monday 20th January 2020

అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, ఇకనుంచి మన మార్కెట్లో బడ్జెట్‌ అంచనాలు, కార్పొరేట్‌  ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం వుంది. ముఖ్యంగా స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసే టాప్‌ హెవీవెయిట్‌ షేర్లు, మార్కెట్‌క్యాప్‌లో తొలి రెండు స్థానాల్లో వున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌లు గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన వెల్లడించిన ఫలితాలకు స్పందనగా ఈ వారం ప్రధమార్థంలో సూచీల కదలిక వుంటుంది. అలాగే టెలికాం

ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా.. తదుపరి ర్యాలీయే..

Monday 20th January 2020

నిఫ్టీ గత ఐదు సెషన్లుగా స్థిరీకరణలో ఉందని, 12,278-12,389 స్థాయిల మధ్యలో ట్రేడ్‌ అయిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా పేర్కొన్నారు. నూతన లైఫ్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,389ని నమోదు చేసిందని, ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చని, ఇప్పటికీ ఇండెక్స్‌ భారీ ట్రెండ్‌ సానుకూలంగానే ఉందన్నారు.    ‘‘వీక్లీ స్కేల్‌పై చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. రోజువారీ చార్ట్‌లో మాత్రం నిర్ణయలేమిని

Most from this category