News


పతనంలో షేర్లు కొంటున్న ప్రమోటర్లు

Wednesday 18th March 2020
Markets_main1584510636.png-32555

కంపెనీలలో వాటా పెంపుపై దృష్టి
గ్రూప్‌ కంపెనీలలో టాటా సన్స్‌ వాటా అప్‌
జాబితాలో మారుతీ, గోద్రెజ్‌, బజాజ్‌

కోవిడ్‌-19 విలయానికి అమెరికా బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కరెక్షన్‌ బాటలో సాగుతున్నాయి. చైనాలో కరోనా వైరస్‌ బయటపడ్డాక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ మంగళవారానికల్లా 28 శాతం దిద్దుబాటుకు లోనైంది. ఇదే విధంగా గత నెల రోజుల్లో సెన్సెక్స్‌తోపాటు, బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 26 శాతం క్షీణించాయి. కోవిడ్‌-19 చైనాతోపాటు ఇటలీ, ఫ్రాన్స్‌, ఇరాన్‌, దక్షిణ కొరియాలో మరణాలకు కారణమవుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 100కుపైగా దేశాలకు పాకడంతోపాటు అమెరికాలోనూ నష్టాల టెంపరేచర్‌కు కారణమవుతోంది. ఇటీవల దేశీయంగానూ కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మాంద్య భయాలు
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ లిక్విడిటీ సృష్టించడం ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 2008 తదుపరి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయికి దించగా.. భారత్‌లోనూ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అయితే రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఏకంగా మాంద్యంలోకి జారుకోవచ్చంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదవుతున్నాయి. వెరసి అమెరికా మార్కెట్లు 28 శాతం పతనంతో బేర్‌ దశలోకి జారుకోగా.. దేశీయంగానూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఈ సమయంలో కొన్ని కంపెనీల ప్రమోటర్లు వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. 

జాబితా ఇలా
గత నెల రోజుల్లో దేశీయంగా 197 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను పెంచుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. మార్కెట్లు కరెక్షన్లను చవిచూస్తుండటంతో పలు కంపెనీల షేర్లు దిగివస్తున్నాయి. దీంతో కొంతమంది ప్రమోటర్లు తమ వాటాలను మరింత పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. జాబితాలో టాటా సన్స్‌తోపాటు.. మారుతీ, బజాజ్‌, గోద్రెజ్‌ గ్రూప్‌లున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల కొన్ని కంపెనీలు భారీ మధ్యంతర డివిడెండ్లను ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇది ప్రమోటర్లకూ మేలు చేయగలదని తెలియజేశారు.

ఇదీ తీరు
కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ కంపెనీల హోల్డింగ్‌ సంస్థ టాటా సన్స్‌ ఇటీవల పలు కంపెనీలలో వాటాల కొనుగోలుపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా టాటా కెమికల్స్‌లో 77 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 569 కోట్లను వెచ్చించగా.. టాటా స్టీల్‌కు చెందిన 1.55 కోట్ల షేర్లనూ కొనుగోలు చేసింది. వీటి విలువ రూ. 457 కోట్లు. ఇదేవిధంగా ఇండియన్‌ హోటల్స్‌లో రూ. 178 కోట్ల విలువైన 1.66 కోట్ల షేర్లతోపాటు.. రూ. 118 కోట్లతో 2.67 కోట్ల టాటా మోటార్స్‌ డీవీఆర్‌లనూ జమ చేసుకుంది. ఈ బాటలో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ సైతం మారుతీ సుజుకీలో 2.11 లక్షల షేర్లను రూ. 135 కోట్లతో కొనుగోలు చేసింది. ఇక బజాజ్‌ కుటుంబం రూ. 91 కోట్ల విలువైన బజాజ్‌ ఆటో షేర్లతోపాటు.. రూ. 50 కోట్ల విలువైన బజాజ్‌ హోల్డింగ్స్‌లో వాటా, మరో రూ. 36 కోట్ల బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వాటానూ సొంతం చేసుకుంది. గోద్రెజ్‌ కుటుంబం కూడా గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌లో రూ. 132 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడంతోపాటు.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌లలో వాటాలు జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జస్ట్‌డయల్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పీవీఆర్‌ తదితర ప్రమోటర్లు సైతం వాటాల కొనుగోలుపై దృష్టిపెట్టినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 18th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఒబేరాయ్‌ రియాల్టి: ఈ కంపెనీకి చెందిన రూ.220 కోట్ల విలువైన  50,24,217 ఈక్విటీ షేర్లను ఇనెవెస్కో గ్లోబల్‌ స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ గ్రోత్‌ ఫండ్‌ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసింది. వొడాఫోన్‌ ఐడియా: ప్రభుత్వం వొడాఫోన్‌ ఐడియా వ్యక్తిగత అంచనాల సంఖ్యను ఒప్పుకున్నట్లయితే వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్యా బిర్లా గ్రూపు ప్రమోటర్లు 1.5 బిలియన్‌ డాలర్లను వొడాఫోన్‌ఐడియాలో పెట్టుబడిగా పెట్టెందుకు సిద్దంగా

రూ.40,000పైకి బంగారం

Wednesday 18th March 2020

గత కొన్నిరోజులుగా భారీగా రూ.5000 వరకు పెరిగిన బంగారం గతవారం అమాంతం తగ్గి రూ.40,000 దిగువకు చేరినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టిపెట్టడంతో బుధవారం బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.1470 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,260.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినప్పటికి  నిన్నటితో పోలిస్తే  4డాలర్లు

Most from this category