News


డివిడెండ్‌ ఇవ్వని కంపెనీలూ మంచివే!?

Monday 20th May 2019
Markets_main1558290642.png-25827

ఇన్వెస్టర్లలో కొందరు డివిడెండ్‌ను చాలా కీలకమైన అంశంగా చూస్తుంటారు. మంచి డివిడెండ్‌ ఇచ్చే చరిత్ర ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గు చూపుతారు. అంతేకాదు డివిడెండ్‌ ఇవ్వని కంపెనీలు, అవి ఎంత మెరుగైన కంపెనీలైనా కానీ, వాటికి దూరంగా ఉండేవారూ ఉన్నారు. అయితే, అధిక డివిడెండ్‌ చెల్లింపు నిష్పత్తి ఉన్న కంపెనీలు ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలిగిస్తాయని భావించడం సరికాదన్నది నిపుణుల సూచన. 

 

ఆరోగ్యకరమైన సహేతుక డివిడెండ్‌ చెల్లింపు అన్నది మార్కెట్లకు నచ్చే అంశం. అన్ని వర్గాల నుంచి ఆయా స్టాక్స్‌కు మద్దతు లభిస్తుంటుంది. అయితే, డివిడెండ్‌ను అధికంగా పంచేయడం ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మంచి చేసే అంశంగా చూడరాదని నిపుణుల అభిప్రాయం. అలా డివిడెండ్‌ రూపంలో పంచేయడం కంటే ఆ నిధులను వృద్ధి అవకాశాలపై ఇన్వెస్ట్‌ చేసి, పోటీలో మరింత మెరుగైన స్థితికి చేరుకుంటే, అది డివిడెండ్‌ కంటే వాటాదారులకు ఎక్కువ మేలు చేసే అంశం అవుతుందన్నది విశ్లేషణ. విఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సూత్రీకరణ ప్రకారం... ఓ కంపెనీ నాలుగు రకాలుగా తన నిధులను వినియోగించుకుంటుంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను తిరిగి వ్యాపార వృద్ధిపై ఇన్వెస్ట్‌ చేయడం ఒకటి. లాభాలతో మరో కంపెనీని కొనుగోలు చేయడం రెండోది. లాభాల మిగులు నుంచి కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేయడం మూడోది. డివిడెండ్‌ పంపిణీ అన్నది ఆఖరు అంశం. 

 

డివిడెండ్‌ చెల్లించడం అన్నది అన్ని వేళలా మెరుగైన ఆప్షన్‌ కాదు. అసలు డివిడెండ్‌ చెల్లించకపోవడం కూడా మంచిదేనన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఒకవేళ కోకకోలా డివిడెండ్‌ పంపిణీ చేయకుండా, షేర్లను తిరిగి కొనుగోలు చేసి, బాట్లింగ్‌ వ్యవస్థను పటిష్టం చేసి ఉంటే, వాటాదారులకు మరింత మేలు జరిగేది. జిల్లెట్‌, డిస్నీ విషయంలో అదే జరిగింది’’ అని వారెన్‌ బఫెట్‌ 1997 సంవత్సరం బెర్క్‌షైర్‌ వార్షిక సమావేశంలో చేసిన ప్రకటన ఈ సందర్భంగా గుర్తుచేసుకోతగ్గదే. అలా అని వారెన్‌ బఫెట్‌ డివిడెండ్‌ పట్ల వ్యతిరేకత కలిగిన వ్యక్తిగా పొరపడొద్దు. ఎందుకంటే ఆయన నాలుగు అతిపెద్ద పెట్టుబడులు... కోకకోలా, వెల్స్‌ఫార్గో, ఐబీఎం, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కలసి ఆయనకు 1.1 బిలియన్‌ డాలర్ల డివిడెండ్‌ ఆదాయాన్ని ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. అంటే డివిడెండ్‌ పంపిణీ చేయడం కంటే ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం వస్తుందని భావిస్తే కంపెనీ వాటాదారులకు డివిడెండ్‌ చెల్లించకపోవడమే సరైనదన్నది వారెన్‌ బఫెట్‌ అభిప్రాయం. 

 

ఒక డాలర్‌ను పంచేయడం కంటే ఆ డాలర్‌ను పెట్టుబడిగా పెట్టి ఒక డాలర్‌కు మించి విలువ సృష్టించే అవకాశం ఉంటే అదే చేయాలన్నది బఫెట్‌ అభిప్రాయం. అయితే, నిధులను సమర్థంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేయడమే సరైనదంటారు కూడా. నిజానికి బఫెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వే డివిడెండ్‌లను చెల్లించదు. ఎప్పుడూ చెల్లించబోమని హామీ ఇస్తున్నానని కూడా ఆయన గతంలో ప్రకటించారు. కారణం ఆయన ఆ నిధులతో మరిన్ని లాభాలను వృద్ది చేయగలమన్న నమ్మకంతో ఉండడమే. 



You may be interested

ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ షాపింగ్‌ వీటిల్లోనే...

Monday 20th May 2019

ఐసీఐసీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థ) దేశంలో రెండో అతిపెద్ద ఏఎంసీ. ఏప్రిల్‌ నెలలో ఈ సంస్థ పెట్టుబడులను  ఓ సారి గమనించినట్టయితే...    వొడాఫోన్‌ ఐడియా, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, అవంతి ఫీడ్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌బీసీసీ తదితర షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాలు పెంచుకుంది. ‘‘మార్కెట్లు ప్రస్తుతం మంచి సహేతుక స్థాయిల్లో ఉన్నాయి. ఈ తరహా మార్కెట్‌ పరిస్థితుల్లో స్టాక్‌ వారీ విధానాన్ని అనుసరించాల్సి

బ్లూచిప్‌ స్టాక్స్‌ను నమ్ముకున్న ఫండ్స్‌

Sunday 19th May 2019

లార్జ్‌క్యాప్స్‌... మార్కెట్‌ను ఎటువైపైనా నడిపించేవి ఇవే. కీలకమైన సాధారణ ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్దేశించే ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, బ్లూచిప్‌ స్టాక్స్‌నే ఎక్కువగా నమ్ముకున్నాయి. బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల స్టాక్స్‌లో టాప్‌ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. తదుపరి బుల్‌ ర్యాలీని ముందుకు తీసుకెళ్లేవి ఈ రంగాల స్టాక్స్‌

Most from this category