News


8,500 దిగువకు నిఫ్టీ- అమ్మకాల వెల్లువ

Wednesday 18th March 2020
Markets_main1584527476.png-32561

సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పతనం
498 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
29,000 దిగువకు చేరిన సెన్సెక్స్‌
8,500 స్థాయినీ కోల్పోయిన నిఫ్టీ
4.5 శాతం నీరసించిన యూరోప్‌ మార్కెట్లు
5 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకిన యూఎస్‌ ఫ్యూచర్స్‌

దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా పలు దేశాలలో సంభవిస్తున్న వైరస్‌ మరణాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను మరోసారి కుంగతీస్తున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో దేశీ మార్కెట్లు బోర్లా పడ్డాయి. సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పడిపోయి 28,869 వద్ద నిలవగా.. నిఫ్టీ 498 పాయింట్లు పతనమై 8,469 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 29,000 పాయింట్ల మైలురాయి దిగువకు చేరగా.. మూడేళ్ల తదుపరి నిఫ్టీ 8,500 పాయింట్ల స్థాయినీ కోల్పోయింది. మంగళవారం అమెరికా మార్కెట్లు 6 శాతం జంప్‌చేయడంతో తొలుత మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా జంప్‌చేసి 31,102 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 28,613 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 9128-8407 పాయింట్ల మధ్య తీవ్రంగా ఊగిసలాడింది.

విదేశీ మార్కెట్లు డౌన్‌
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు 4.5 శాతం నీరసించగా.. యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకాయి. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. మరోపక్క ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి టెలికం కంపెనీలు సొంత లెక్కలు ప్రకటించడంపై సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినట్లు వెలువడిన వార్తలు మొబైల్‌ కౌంటర్లను నిరాశపరచినట్లు తెలియజేశారు.

మీడియా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. మీడియా 0.4 శాతం బలపడింది. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో, మెటల్‌, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 7-3 శాతం మధ్య బోర్లా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 24, 22 శాతం చొప్పున కుప్పకూలగా.. కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం 11-7 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే జీ 26 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో యస్‌ బ్యాంక్‌ 4 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ 1.5-0.3 శాతం మధ్య బలపడ్డాయి.

ఐడియా బేర్‌
డెరివేటివ్స్‌లో ఐడియా 32 శాతం కుప్పకూలగా.. ఈక్విటాస్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ‍మణప్పురం, అరబిందో, మహానగర్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌ 18-13 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు జస్ట్‌డయల్‌ 21 శాతం, ఆయిల్‌ ఇండియా 16 శాతం చొప్పున జంప్‌చేయగా.. పీఎన్‌బీ, అదానీ పవర్‌, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, బీఈఎల్‌, మదర్‌సన్‌ 7-2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 5-7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1992 నష్టపోగా.. కేవలం 389 లాభపడ్డాయి.

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   You may be interested

మిమ్మల్ని స్వీయ మదింపు చేయమన్నారు? టెలికం కంపెనీలపై సుప్రీం కన్నెర్ర

Wednesday 18th March 2020

టెలికం సంస్థలపై అత్యున్నత న్యాస్థానం మరోసారి మండిపడింది. ఏజీఆర్‌ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి పునర్‌సమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై  బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కోర్టు అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరు స్వీయ మదింపు చేసుకోమన్నారు? అంటూ ఘాటుగా స్పందించింది. బకాయిలు వసూలు చేయడంతో ప్రభుత్వ తీరుపై కూడా

వడ్డీరేటు 1.7 శాతం తగ్గొచ్చు: ఫిచ్‌

Wednesday 18th March 2020

వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2021-22) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లను కట్‌ చేయవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును ప్రభావితం చేసే రెపో రేటు 1.7శాతం తగ్గించవచ్చని తెలిపింది. మొదట 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ ఏడాదిలో వడ్డీరేటును 175

Most from this category