News


నిఫ్టీలో తదుపరి చోటు వీటికే..!

Friday 13th September 2019
Markets_main1568397842.png-28360

బీమా రంగ స్టాక్స్‌కు ఇప్పటి వరకు నిఫ్టీలో చోటు లేదు. కానీ రానున్న సంవత్సరాల్లో బీమా రంగ కంపెనీలు తప్పకుండా నిఫ్టీలోకి వచ్చి చేరతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణమైన సంకేతాలను, విశ్లేషణను కూడా వారు వినిపిస్తున్నారు. విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇప్పటికే బీమా రంగ కంపెనీల భవిష్యత్తు వృద్ధి అవకాశాలను గుర్తించారు. దీనికి నిదర్శనమా అన్నట్టు.. ఈ ఏడాది ఇప్పటికే లిస్టెడ్‌ బీమా కంపెనీల్లో ఎఫ్‌పీఐలు తమ వాటాను గణనీయంగా పెంచుకున్నారు. ఈ ఏడాది బీఎస్‌ఈ 200లో బాగా పెరిగిన స్టాక్స్‌లో ఇవి కూడా ఉన్నాయి. 

 

బీమా రంగం వచ్చే మూడు నాలుగేళ్ల పాటు ఏటా 20-30 శాతం వృద్ధి చెందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఇవి లిస్టెడ్‌ బీమా కంపెనీలు. ఇవి ఈ ఏడాది ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇప్పటి వరకు పంచాయి. ఎస్‌బీఐ లైఫ్‌ 32 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 30 శాతం, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ 30 శాతం వరకు పెరిగాయి. ‘‘ఎన్నో రెట్లు వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న బీమా రంగంలో వృద్ధి ఇప్పుడే ఆరంభమైంది. గత ఐదేళ్ల కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు బీమాలోనూ ఇది ఆరంభమైంది. రానున్న సంవత్సరాల్లో అదే స్థాయి వృద్ధి చూస్తాం. ఆదాయ స్థాయి పెరుగుతున్న కొద్దీ బీమాపై వెచ్చించడమూ పెరుగుతుంది’’ అని మార్కెట్‌ నిపుణులు సమీర్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. 

 

‘‘బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఇన్సూరెన్స్‌ గణనీయమైన వెయిటేజీని వచ్చే ఐదేళ్లలో సంపాదించుకుంటుంది. ఈ స్టాక్స్‌ నేడు కొంత ఖరీదుగా అనిపించొచ్చు. కానీ బీమాలో అవకాశాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మీ పోర్ట్‌ఫోలియోలో వీటికి చోటివ్వడం తెలివైన పని’’ అని బీన్‌స్టాక్‌ అడ్వైజరీకి చెందిన కుష్‌ కటాకియా అన్నారు. ఏటా 20-30 శాతం కాంపౌండర్‌ కోరుకుంటే, వచ్చే మూడు నాలుగేళ్లకు బీమా రంగం అనుకూలంగా ఉందని.. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అయినప్పటికీ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉందని సెంట్రల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన దేవాంగ్‌ మెహతా పేర్కొన్నారు.

 

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో గతేడాది డిసెంబర్‌ నాటికి ఎఫ్‌పీఐలు 4.9 శాతం వాటాలు కలిగి ఉ‍న్నారు. మార్చి క్వార్టర్‌కు 14.1 శాతానికి పెంచుకున్నారు. జూన్‌ క్వార్టర్‌కు ఇది 19.4 శాతానికి పెరిగింది. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌లో ఎఫ్‌ఫీఐల వాటా గత డిసెంబర్‌కు 8.6 శాతంగా ఉండగా, మార్చి క్వార్టర్‌లో 10.1 శాతానికి, జూన్‌ క్వార్టర్‌లో 11.5 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌లో ఎఫ్‌పీఐల వాటా ఈ ఏడాది ఇప్పటి వరకు 6.3 శాతం మేర పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 3.5 శాతం మేర ఎఫ్‌పీఐల వాటా పెరిగింది. దేశ విదేశీ బ్రోకరేజీ సంస్థలు బీమా రంగ స్టాక్స్‌కు బై రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

 



You may be interested

అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ చార్జీల్లో మార్పులు

Friday 13th September 2019

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ అక్టోబర్‌ 1 నుంచి పలు సేవల చార్జీల్లో సవరణలు తీసుకురానుంది. నగదు ఉపసంహరణలు, సగటు నెలవారీ బ్యాలన్స్‌ తదితర వాటిల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కనుక ఎస్‌బీఐ ఖాతాదారులు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే...   ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉపశమనం కల్పించే నిర్ణయంగా నెలవారీ కనీస బ్యాలన్స్‌ (ఏఎంబీ)ను తగ్గించడాన్ని చెప్పుకోవాలి. అక్టోబర్‌ 1 నుంచి పట్టణాల్లో సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌

11050 పైన ముగిసిన నిప్టీ

Friday 13th September 2019

280 లాభపడ్డ సెన్సెక్స్‌ కలిసొచ్చిన మిడ్‌సెషన్‌ అనంతర కొనుగోళ్లు రాణించిన అటో, బ్యాంకింగ్‌, ఆయిల్‌ షేర్లు మార్కెట్‌లో మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 280.71 పాయింట్ల లాభంతో 37,385 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 11,076 వద్ద ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో నేటి ఉదయం మార్కెట్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే నిన్న కేంద్రం ప్రకటించిన ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో

Most from this category