News


మూడిస్‌ ‘రేటింగ్‌’ షాక్‌

Saturday 9th November 2019
news_main1573271420.png-29470

  • భారత క్రెడిట్‌ రేటింగ్‌ ‘నెగెటివ్‌’కు తగ్గింపు
  • ఇప్పటి వరకు స్థిర రేటింగ్‌
  • సమీప కాలంలో వృద్ధి కోలుకోకపోవచ్చని అంచనాలు
  • భారత్‌ మూలాలు పటిష్టమన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్‌) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టెబుల్‌)గా ఉంది. ఆర్థిక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్‌ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్‌’గానే కొనసాగించింది. పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్‌ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 3.7 శాతంగా ఉంటుందని మూడిస్‌ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడిస్‌ పెంచింది. జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడిస్‌ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్‌ రేటింగ్స్‌, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టెబుల్‌)గానే కొనసాగిస్తున్నాయి. 
మూడిస్‌ అభిప్రాయాలు
- అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్క్‌లను తెలియజేస్తుంది. ఆర్థిక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది. 
- ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది.
- ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు.
- గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆర్థిక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండడం, బ్యాంకింగేత ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి.
- ఎక్కువ కాలం పాటు తక్కువ స్థాయిలో ఆర్థిక వృద్ధి కొనసాగితే అది ఆదాయ వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మధ్యస్థం నుంచి దీర్ఘకాలానికి అధిక పెట్టుబడుల వృద్ధిని సాధించడానికి అవసరమైన విధానపరమైన చర్యలకు అవరోధంగా మారొచ్చు. 
- ఎన్‌బీఎఫ్‌ఐల్లో నెలకొన్న రుణ సంక్షోభం వేగంగా పరిష్కారమవుతుందని భావించడం లేదు. 
- ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆర్థిక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు.
- నెగెటివ్‌ అవుట్‌లుక్‌ సమీప కాలంలో రేటింగ్‌ అప్‌గ్రేడ్‌కు అవకాశం లేదని తెలియజేస్తుంది. కొంత కాలానికి ద్రవ్య పరిస్థితులు స్థిరపడితే అప్పుడు రేటింగ్‌ అవుట్‌లుక్‌ను స్థిరత్వానికి మార్చే అవకాశం ఉంటుంది. 

ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్ర ప్రభుత్వం
రేటింగ్‌ అవుట్‌లుక్‌ను నెగెటివ్‌గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆర్థిక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2019 భాతర వృద్ది రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్‌, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి. సమీప కాలం నుంచి మధ్య కాలానికి భారత్‌ బలమైన వృద్ధిని నమోదు చేస్తుంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.737 కోట్లు

Saturday 9th November 2019

73 శాతం అప్‌ రూ.22,098 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.737 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.425 కోట్ల నికర లాభం ఆర్జించామని, 73 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,430 కోట్ల నుంచి రూ.22,098 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ వెల్లడించిన

అశోక్‌ లేలాండ్‌ లాభం 93 శాతం డౌన్‌

Saturday 9th November 2019

గత క్యూ2లో రూ.528 కోట్ల నికర లాభం  ఈ క్యూ2లో రూ.39 కోట్లే  న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు

Most from this category