News


మిస్త్రీ చేతికి టాటా పగ్గాలు

Thursday 19th December 2019
Markets_main1576726721.png-30292

(అప్‌డేటేడ్‌)
- చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదు
- కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు
- ప్రైవేట్ సంస్థగా మార్పునకూ తిరస్కరణ
- టాటా గ్రూప్‌ అప్పీలుకు 4 వారాల అవకాశం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) ఆదేశించింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్‌ను స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్ అప్పీలు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ తెలిపింది. 
"2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధం. కాబట్టి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుంది" అని జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ‍ద్విసభ్య బెంచ్‌ తుది ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, డైరెక్టర్ల బోర్డు లేదా వార్షిక సర్వసభ్య సమావేశంలో మెజారిటీ అనుమతులు అవసరమయ్యే ఏ నిర్ణయాలను ముందస్తుగా తీసుకోకూడదంటూ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాను, టాటా ట్రస్ట్స్‌ నామినీని ఆదేశించింది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఆర్టికల్ 75లోని నిబంధనలు ప్రయోగించరాదంటూ డైరెక్టర్ల బోర్డుకు, షేర్‌హోల్డర్లకు సూచించింది. అటు, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కిందకు మార్చాలన్న కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్‌వోసీ) నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. దీన్ని రికార్డుల్లో సత్వరం సరిచేయాలంటూ ఆర్‌వోసీని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. ఇక, మిస్త్రీకి వ్యతిరేకంగా 2018 జూలై 9న ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. ఇవి మిస్త్రీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టరుగా కొనసాగించడం మినహా... ఆయన్ను చైర్మన్‌గా పునర్నియమించాలన్న ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని టాటా సన్స్ తరఫు న్యాయవాది ఎన్‌సీఎల్‌ఏటీని అభ్యర్థించారు.
ఇది గుడ్ గవర్నెన్స్ విజయం: మిస్త్రీ
ట్రిబ్యునల్ తీర్పుతో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు, గుడ్‌ గవర్నెన్స్‌ సూత్రాలకు విజయం లభించిందని మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ వాదనలే నెగ్గాయన్నారు. "ఎలాంటి కారణం లేకుండా, ముందస్తుగా చెప్పకుండా నన్ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఆ తర్వాత డైరెక్టర్‌గాను తొలగించారు. వీటిని వ్యతిరేకిస్తూ మేం చేసిన వాదనలు సరైనవే అనడానికి తాజా తీర్పు నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ మరింత వృద్ధిలోకి రావాలంటే గ్రూప్‌లోని అన్ని వర్గాలు సమిష్టిగా కలిసి పనిచేయడం ముఖ్యమని మిస్త్రీ తెలిపారు. "టాటా గ్రూప్ వృద్ధి చెందాలంటే కంపెనీలు, వాటి బోర్డులు, టాటా సన్స్ యాజమాన్యం .. బోర్డు, టాటా సన్స్ షేర్‌హోల్డర్లు .. అందరూ నిర్దిష్ట గవర్నెన్స్‌ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయడం, అన్ని వర్గాల ప్రయోజనాలూ పరిరక్షించడం అవసరం" అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
చట్టపరంగా చర్యలు: టాటా సన్స్‌
ట్రిబ్యునల్ ఆదేశాలు చూస్తుంటే అడిగిన దానికి మించే మిస్త్రీకి ఊరటనిచ్చినట్లు కనిపిస్తోందని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. టాటా సన్స్, ఇతర లిస్టెడ్ టాటా కంపెనీల షేర్‌హోల్డర్లు .. చట్టబద్ధంగా షేర్‌హోల్డర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్‌సీఎల్‌ఏటీ ఏ విధంగా తిరస్కరిస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. "మా కేసు బలంగా ఉందని గట్టిగా విశ్వసిస్తున్నాం. తాజా ఆదేశాలకు సంబంధించి చట్టపరంగా ముందుకు వెడతాం. సంస్థ ఎప్పుడూ కూడా చట్టవిరుద్ధంగా నడుచుకోలేదని, అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. సహేతుకంగానే వ్యవహరించిందని, ఇకపైనా అదే తీరును కొనసాగిస్తుందని వాటాదారులకు హామీనిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రూప్ కంపెనీల షేర్లు పతనం..
అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో.. టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లు 4 శాతం దాకా క్షీణించాయి. బీఎస్‌ఈలో టాటా గ్లోబల్ బెవరేజెస్‌ 4 శాతం, టాటా కాఫీ 3.88 శాతం, టాటా మోటార్స్ 3.05 శాతం పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ షేరు అత్యధికంగా క్షీణించింది. అటు ఇండియన్ హోటల్స్ కంపెనీ 2.48 శాతం, టాటా కెమికల్స్ 1.65 శాతం, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 1.22 శాతం, టాటా పవర్ కంపెనీ 0.98 శాతం తగ్గాయి. అయితే, ఇందుకు భిన్నంగా టీసీఎస్ స్వల్పంగా 0.07 శాతం, టాటా మెటాలిక్స్ 2.07 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 1.68 శాతం, టాటా ఎలెక్సీ 1.53 శాతం, టాటా స్టీల్ 1.16 శాతం, టైటాన్ 0.09 శాతం లాభపడ్డాయి. 
మూడేళ్లుగా పోరు..
మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలున్నాయి. 2012లో రతన్ టాటా తర్వాత సంస్థ ఆరో చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే.. పెట్టుబడులు, చౌక కారు నానో వంటి లాభసాటి కాని వ్యాపార విభాగాలు మూసివేయడం వంటి నిర్ణయాలపై రతన్ టాటా, మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2016 అక్టోబర్‌లో మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తప్పిస్తూ టాటా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థలు.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. టాటా సన్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, షేర్‌హోల్డర్ల నోరు నొక్కేస్తున్నారని ఆరోపించింది. అయితే, ఈ విషయంతో వాటికి సంబంధం లేదంటూ పిటీషన్‌ను కొట్టేస్తూ 2017 మార్చిలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలిచ్చింది. కానీ, ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాల మేరకు తిరిగి దీనిపై ఎన్‌సీఎల్‌టీ విచారణ జరిపింది. చైర్మన్‌గా తనను పునర్‌నియమించాలన్న మిస్త్రీ పిటీషన్‌ను గతేడాది జూలైలో మళ్లీ తిరస్కరించింది. కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయన్న పసలేదని తోసిపుచ్చింది. ఎన్‌సీఎల్‌టీ (ముంబై) తీర్పును సవాల్ చేస్తూ మిస్త్రీ మళ్లీ అపీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది జూలైలో వాదోపవాదాలు ముగిశాక ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 



You may be interested

సంపద సృష్టికర్తల్లో టాప్‌.. రిలయన్స్‌

Thursday 19th December 2019

టాప్‌-3లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో... అంటే 2014-19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు

టాటా గ్రూపు స్టాక్స్‌ పరిస్థితి ఏంటి..?

Thursday 19th December 2019

సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తొలగించడం చట్ట విరుద్ధమని ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రి‍బ్యునల్‌ ఇచ్చిన తీర్పు ప్రభావం.. బుధవారం ట్రేడింగ్‌ సెషన్‌లో టాటా గ్రూపు స్టాక్స్‌పై చూపించింది. కొన్ని షేర్లు స్వల్పంగాను, కొన్ని చెప్పుకోతగ్గంత నష్టపోయాయి. అత్యధికంగా టాటా కమ్యూనికేషన్స్‌ 7 శాతం క్షీణించింది. ఈ పరిస్థితుల్లో టాటా గ్రూపు షేర్‌ హోల్డర్లు ఆందోళన పడిపోకుండా, తాము దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేశామా? లేక స్వల్ప కాలం కోసమా

Most from this category