News


ఆ పెట్టుబడి విషయంలో పొరపాటు జరిగింది: పొరింజు 

Monday 14th January 2019
Markets_main1547404453.png-23560

స్మాల్‌క్యాప్‌ సిగార్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌ ఇలా పలు పేర్లతో సుపరిచితుడు... పొరింజు వెలియాత్‌ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న పొరింజు... గతేడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పతనంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన నిర్వహణలోని ఆస్తుల విలువకు గట్టిగానే చిల్లుపడింది. తాజాగా తన పెట్టబడుల వ్యవహారంలో ఓ పెద్ద తప్పిదాన్ని ఆయన అంగీకరించారు. లయడ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ గుర్తుండే ఉంటుంది. లయడ్‌ బ్రాండ్‌ కింద ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు తదితర గృహోపకరణాలను విక్రయించే ఈ సంస్థ... కొంత కాలం క్రితం తన లయడ్‌ బ్రాండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను హావెల్స్‌కు విక్రయించింది. ఆ తర్వాత నుంచి ఈ షేరు ధర గణనీయంగా పతనం అయింది. కంపెనీ పేరు సంక్షిప్త రూపంలోకి ఎల్‌ఈఈఎల్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌గా మారిపోయింది. ఈ కంపెనీలో పెట్టుబడులతో ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా ఇన్వెస్టర్లకు పెద్ద నష్టమే ఎదురైంది.  

 

ఈ కంపెనీలో పొరింజు సంస్థకు చెందిన ఈక్యూ ఇండియా ఫండ్‌, పీఎంఎస్‌ క్లయింట్స్‌ తరఫున 8.38 శాతం వాటా ఉంది. ఈ షేరు ధర 2017 డిసెంబర్‌ 29న రూ.287.60. ఈ నెల 11న ధర రూ.47.65. ఏడాదిలో 80 శాతం షేరు విలువ కరిగిపోయింది. గతేడాది జూన్‌ త్రైమాసికం నాటికి ఈ కంపెనీలో పొరింజు సంస్థలకు 7.9 శాతం ఉంటే, సెప్టెంబర్‌ ఆఖరుకు 8.38 శాతానికి పెంచుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై పొరింజు తన తప్పిదాన్ని అంగీకరిస్తూ ఇన్వెస్టర్లకు లేఖ రాశారు. ‘‘ఎల్‌ఈఈఎల్‌లో మన పెట్టుబడి గణనీయంగా కరిగిపోయింది. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పొరపాటు చోటు చేసుకుంది. మారుతున్న నియంత్రణ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడంతో, అది పొరపాటుగా మారింది. కొనుగోలు ధర నుంచి 80 శాతం తక్కువకు పడిపోయింది. షేరు ధర రికవరీ అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేం. అయితే, ఇప్పటికే నష్టం జరిగిపోయింది. అరుదుగా, సరైన నిర్ణయం చేయకపోతే లీల్‌ మాదిరిగా శాశ్వత పెట్టుబడి నష్టం జరుగుతుంది. దీర్ఘకాలంలో వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ ద్వారా మా పెట్టుబడి దారులకు సంపద సృష్టించే ప్రయత్నాలలో మమ్మల్ని ఇది ఆలోచింపజేస్తుంది. అయితే, ఇక ముందు సంపద సృష్టించే విషయంలో ఇది మాకు అడ్డంకి కాబోదు’’ అని పొరింజు పొలియాత్‌ వివరణ ఇచ్చారు. 

 

కారణాలు...
‘‘ఏసీ, వైట్‌గూడ్స్‌ బ్రాండ్‌ లయడ్‌ను హావెల్స్‌కు విక్రయించగా, కంపెనీకి రూ.1,550 కోట్లు వచ్చాయి. కేవలం బ్రాండ్‌ను మాత్రమే విక్రయించి, తయారీ ప్లాంట్లను సంస్థ తన వద్దే ఉంచుకుంది. బ్రాండ్‌ విక్రయంతో వచ్చిన నిధులతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు సంపద సృష్టిస్తుందని పొరింజు అంచనా వేశారు. కానీ, అది జరగలేదు. కఠినమైన చట్టాలు, జీఎస్టీ రాక, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాల బలోపేతంతో ప్రమోటర్లు నిధులను పక్కదారి పట్టించే అవకాశాలు తగ్గిపోవడంతో, లయడ్‌ ప్రమోటర్లు వ్యాపార విస్తరణపై వెచ్చిస్తారని అంచనా వేశారు. లయడ్‌ బ్రాండ్‌ అమ్మకం తర్వాత 2017 నవంబర్‌ క్వార్టర్‌ ఖాతాల్లో, కంపెనీ రూ.946 కోట్ల లాభాన్ని చూపించింది. అయితే, కంపెనీ ప్రమోటర్‌ బ్రిజ్‌రాజ్‌ పుంజ్‌ 2017 డిసెంబర్‌లో మరణించడం, ఆయన కుమారుడు భరత్‌పుంజ్‌ కంపెనీ బాధ్యతలు చేపట్టడం జరిగాయి. కంపెనీ వ్యాపారం, భవిష్యత్తు గురించి ఎన్నో సందర్భాల్లో కొత్త యాజమాన్యం అనలిస్టులకు విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. కానీ, ఆచరణలో మాత్రం రూ.340 కోట్లను ప్రమోటర్లు... తమ కంపెనీలైన ఫెడర్స్‌ ఎలక్ట్రిక్‌ లిమిటెడ్‌ తదితర సంస్థలకు మళ్లించారు. సెబీకి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం ఫిర్యాదు చేయగా, ప్రమోటర్లు తమ వ్యక్తిగత సంపద వృద్ధికి నిధులు మళ్లించారన్న ఆరోపణలు నిరూపణ కాలేదు. ఆ తర్వాత కంపెనీ సీఎఫ్‌వో, సెక్రటరీ, వీపీ ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఒక్కొక్కరుగా రాజీనామా చేసి వెళ్లిపోయారు’’ అని పొరింజు తన లేఖలో కారణాలు తెలియజేశారు. You may be interested

మూడో రోజూ నష్టాల ప్రారంభమే..!

Monday 14th January 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజు నష్టాల ప్రాంరంభం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరగుదలతో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాలు సైతం సూచీలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 35,842 వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త పెట్టుబడుల హవా

Sunday 13th January 2019

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల ప్రవేశం, నూతన పెట్టుబడులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయి. డిసెంబర్‌లో కొత్తగా 5.7 లక్షల పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభమవడం ఇదే సూచిస్తోంది. సెబీ గణాంకాల ప్రకారం... 2018 డిసెంబర్‌ ఆఖరుకు మొత్తం ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య 8.03 కోట్లుగా ఉంది.    గతేడాది నవంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) కొత్తగా 7.05 లక్షల ఫోలియోలను యాడ్‌ చేసుకున్నాయి. అక్టోబర్‌లో 11.5 లక్షల మేర

Most from this category