News


క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే దిక్సూచీ

Monday 13th January 2020
Markets_main1578885141.png-30869

- ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, విప్రో ఫలితాలు ఈవారంలోనే..
- సోమవారం సీపీఐ, మంగళవారం డబ్ల్యూపీఐ డేటా వెల్లడి
- అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి
- తొలి దశ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేసే అవకాశం!

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటనలు, ద్రవ్యోల్బణ గణాంకాల వంటి స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ ఏకంగా 24 శాతం వృద్ధితో అంచనాలకు మించి నికర లాభాన్ని శుక్రవారం ప్రకటించి, బంపర్‌ ఫలితాలతో క్యూ3 బోణీ కొట్టింది. దీంతో ఈ వారంలో వెల్లడికానున్న మిగిలిన దిగ్గజ ఐటీ కంపెనీల ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఇదే రంగానికి చెందిన విప్రో సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (అక్టోబర్‌ – డిసెంబర్‌) ఫలితాలను ప్రకటించనుండగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్‌ ఈ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఇన్ఫీ ఫలితాలకు మార్కెట్‌ స్పందించనుందని, ఆ తరువాత వెల్లడికానున్న ఫలితాల ఆధారంగా ఈ వారం ట్రేడింగ్‌ కొనసాగనుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్ మిశ్రా అన్నారు. స్టాక్‌ స్పెసిఫిక్‌గా భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 

ఫలితాలు నడిపిస్తాయ్‌...
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అతిపెద్ద కంపెనీ, ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) క్యూ3 ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఆయిల్‌ విభాగం నుంచి స్థూల రిఫైనరీ మార్జిన్‌  ప్రతి బ్యారల్‌ 10.5 డాలర్లుగా ఉండవచ్చని అంచనా. టెలికం సంస్థ జియో, రిటైల్‌ వ్యాపార విభాగాలు కంపెనీ ఫలితాలను మెరుగుపరిచే ఆస్కారం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో.. మైండ్‌ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డెల్టా కార్ప్, బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఐసీఐసీఐ లోంబార్డ్ వంటి 75 దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్‌ కదలికలపై ప్రభావం చూపనున్నాయని ట్రేడింగ్‌బెల్స్‌ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఫలితాలతో పాటు.. వచ్చే నెల తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020-21 బడ్జెట్‌, ఆర్‌బీఐ పాలసీ ప్రభావం కూడా ఈ వారం ట్రేడింగ్‌పై ఉండనుందని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని కురియన్ విశ్లేషించారు. బడ్జెట్‌ సమీపిస్తున్నందున ఒడిదుడుకులు పెరగనున్నాయని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

స్థూల ఆర్థికాంశాలు...
గతేడాది డిసెంబర్‌ సీపీఐ ద్రవ్యోల్బణం ఈ నెల 13న (సోమవారం) వెల్లడికానుండగా.. ఆ తరువాత రోజున డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత శుక్రవారం పారిశ్రామికోత్పత్తి వెల్లడికాగా, నవంబర్‌లో ఈ సూచీ 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. మూడు నెలల తర్వాత క్షీణత నుంచి బయట పడింది. ఈ సానుకూల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌ తొలి సెషన్లో కనిపించవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. 

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు నెమ్మదిగా కరిగిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి అమెరికా–చైనా వాణిజ్య చర్చల వైపునకు మళ్లనుందని వినోద్‌ నాయర్‌ అన్నారు. చైనా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఈ నెల 13 నుంచి 15 వరకు అమెరికా ప్రభుత్వ పరిపాలన అధికారులతో సమావేశం కానుంది. తాజాగా కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల సభ్యులు సంతకం చేయనున్నారని అంచనా. ఇదే జరిగితే మార్కెట్‌ నూతన శిఖరాలను దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ఇక చైనా దేశ జీడీపీ డేటా, పారిశ్రామికోత్పత్తి శుక్రవారం వెల్లడికానున్నాయి.

రూ.2,415 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) జనవరి 1–10 కాలానికి దేశీ మార్కెట్‌ నుంచి రూ.2,415 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. డెట్‌ మార్కెట్‌ నుంచి వీరు రూ. 3,193 కోట్లను వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈక్విటీ మార్కెట్‌లో రూ. 777 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ నెల్లో ఎఫ్‌ఐఐ నికర ఉపసంహరణ రూ. 2,415 కోట్లుగా నిలిచింది. You may be interested

సెన్సెక్స్‌కు 41,700–41,810 శ్రేణే అవరోధం

Monday 13th January 2020

అమెరికా–ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం ప్రధమార్థంలో పెరిగిన బంగారం, క్రూడ్‌ ధరలు మన ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం  సృష్టించాయి. ఇంతలోనే మధ్యప్రాచ్య ఆందోళనలు చల్లారడంతో ఇటు బంగారం, క్రూడ్‌ ధరలు దిగివచ్చాయి. రూపాయి విలువ కూడా గణనీయంగా పుంజుకోవడంతో  తిరిగి స్టాక్‌ సూచీలు ర్యాలీ చేయగలిగాయి. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, మన మార్కెట్లో ఇక బడ్జెట్‌ అంచనాలు, కార్పొరేట్‌  ఫలితాలకు అనుగుణంగా ఆయా

టాప్‌-10 కంపెనీలకు లాభాల పండగే.!!

Monday 13th January 2020

మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని మొదటి పది పెద్ద కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి లాభాల్లో 23 శాతానికి పైగా సగటు వృద్ధిని చూపించొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గడం, ఆర్థిక సేవల రంగం కాస్త తెరిపిన పడడం వంటి వాటిని ఇందుకు ఆధారంగా పేర్కొంటున్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో (2018 డిసెంబర్‌ త్రైమాసికం) ఈ కంపెనీల లాభాల్లో వృద్ధి సగటున 14 శాతంగానే ఉండడం

Most from this category