News


మార్కెట్‌ ట్రెండ్‌ మారింది: దీపన్‌ మెహతా

Wednesday 30th October 2019
Markets_main1572422531.png-29234

‘స్టాక్‌మార్కెట్లు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సూచీలు. స్టాకుల ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గర్లో ఉందని అర్ధం’ అని ఎలిక్షిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు, డెరక్టర్‌ దీపన్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
షేర్ల పెరుగుదల-ఆర్థిక వ్యవస్థ..

ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు పనిచేస్తాయి. ఒకవేళ స్టాక్‌ ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సిద్ధంగా ఉందనే అర్థం. వ్యవస్థలో అనేక సైకిల్స్‌ ఉన్నాయి. ప్రస్తుత సైకిల్‌ ముగింపు దశకు చేరుకుంది. ముందుకెళ్లే కొద్ది మార్కెట్‌కు సంబంధించి ఎటువంటి చెడు వార్తలు లేకపోతే, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎటువంటి పెద్ద ప్రతికూల మార్పులు జరగకపోతే,  ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఈ ప్రభావం షేర్ల ధరలలో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం గేమ్‌ చేంజర్‌లా పనిచేసింది. ​ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన కంపెనీల వృద్ధి రేటు ప్రతికూలంగా ఉన్నప్పటికి, ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన ఈ కంపెనీల షేరుపై లాభం గణనీయంగా మెరుగుపడింది. ట్యాక్స్‌ తగ్గించడం వలన కంపెనీల మార్జిన్లు మెరుగుపడ్డాయి. అంతేకాకుండా వీటి అంతర్గత నిధుల లభ్యత పెరగడంతో కంపెనీ వ్యయం మెరుగుపడుతోంది. ఈ అంశాలన్ని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతున్నాయి. విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వేచి ఉన్న సమయంలో, సెప్టెంబర్‌ 20న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గించింది. ఇది మార్కెట్‌ ట్రెండ్‌ను మొత్తంగా మార్చేసింది. 
విస్తృత మార్కెట్‌ పాజిటివ్‌గా..
గత ఏడాది కాలంలో నిఫ్టీ 10-11 శాతం వరకు పెరిగినప్పటికి కేవలం 5-6 స్టాకులే నిఫ్టీని పైకి తీసుకెళ్లిన మాట వాస్తవం. కానీ ఇది అ‍ంతర్జాతీయంగా ఫండ్‌ మేనేజర్లు నిఫ్టీని గమనిస్తున్నారు. నిఫ్టీ పైకి వెళినట్టయితే, కేవలం 5-6 స్టాకులు మాత్రమే దీనిని పైకి తీసుకెళ్లినట్టయితే, దాని గురించి ఆలోచించవలసిన పనిలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రంగాలు మంచి ప్రదర్శనను చేయడం ప్రారంభించాయి. అంతేకాకుండా ఆటో, ఆటో అనుబంధం రంగాలలోని స్టాకులు కూడా మంచి ప్రదర్శన చేయడం మొదలుపెట్టాయి. మొత్తంగా మార్కెట్‌లో సెంటిమెంట్‌ తిరిగొచ్చింది. అయినప్పటికి ఇప్పటికి కూడా నాణ్యమైన 10-15 స్టాకులపై ఇన్వెస్టర్లు దృష్ఠి పెడుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇతర స్టాకులకు కూడా విస్తరిస్తోంది. ఈ 15 స్టాకులు ఖరీదుగా ఉన్నప్పటికి, టైర్‌ 1, టైర్‌ 2 స్టాకులను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు అంతగా సిద్ధ పడడం లేదు. కంపెనీల బ్యాలెన్స్‌ షీట్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వంటి అంశాలలో అనిశ్చితి నెలకొనడంతో వీటికి దూరంగా ఉంటున్నారు. కానీ మార్కెట్‌లోకి వస్తున్న నిధుల ప్రవాహాం, టైర్‌2, టైర్‌ 3 స్టాకుల వరకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ పక్రియ మొదలైంది. టైర్‌ 1, టైర్‌ 2, టైర్‌ 3 స్టాకుల మధ్య ఉన్న అంతరం నెమ్మదిగా తగ్గుతోంది. ఈ ట్రెండ్‌ మరింత వేగం పుంజుకుంది.
పీఎస్‌యూలు ఆకర్షణీయంగా..
పీఎస్‌యూ డిజెన్వెస్ట్‌మెంట్‌ పక్రియ ఆర్థిక సంస్కరణలకు కొనసాగింపుగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పీఎస్‌యూలలో ప్రభుత్వం అధిక నియంత్రణను కలిగివుంది. ఏ కారణాలయినప్పటికి, ఈ కంపెనీల సామర్ధ్యం పోటీ ప్రైవేట్‌ కంపెనీల కంటే తక్కువగా ఉంది. ఒక వేళ బీపీసీఎల్‌కు సంబంధించి, డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియ విజయవంతంగా జరిగితే, ప్రభుత్వం మరికొన్ని డిజిన్వెస్ట్‌మెంట్లను విజయవంతంగా పూర్తి చేయగలుగుతుంది. ఇలా చేయాలంటే మొదట పీఎస్‌యూలకు సంబంధించి, కార్పోరేట్‌ గవర్నెన్స్‌, నియంత్రణ, సామర్ధ్యం వంటి అంశాలలో సమూల మార్పులను తీసుకురావాలి. అలా జరిగితే ఈ సంస్థలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతాయి. 
   డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియ చాలా ప్రభావవంతమైంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీని కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ వాల్యుషన్‌, వ్యాపారాలలో ఏకచక్రాధిపత్యం, బ్యాలెన్స్‌ షీట్ల పరంగా బలంగా ఉండడం, లిస్టయిన కంపెనీల వరకు అధిక రిటర్న్‌ రేషియో కలిగివుండడం వంటి అంశాల వలన పీఎస్‌యూలు ఆకర్షిణీయంగా ఉన్నాయి. కానీ ఈ సంస్థలు సరైన చేతుల్లో లేవు. ఒకసారి చేతులు మారినా లేదా పీఎస్‌యూల నిర్వహణలో మార్పు వచ్చినా, ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరగడానికి మంచి అవకాశం ఉంది. పీఎస్‌యూల లాభాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా పీఈ విస్తరిస్తోంది. 
ఆటో సెక్టార్‌ ఓకే కానీ..
ఆటో సెక్టార్‌లో చూస్తున్న దీర్ఘకాల ప్రతికూల సెంటిమెంట్‌ మారినట్టనిపిస్తోంది. ముఖ్యంగా పండుగ సీజన్‌ సమయానికి ఆటో సెక్టార్‌ పుంజుకుంది. వచ్చే రెండు మూడు నెలలలో ఏం జరుగుతుందో వేచి చూడాలని చాల మంది విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు సలహాయిస్తున్నాయి. ఆటో సెక్టార్లో  ఉన్న సౌలభ్యం ఏంటంటే, ఈ రంగాన్ని స్పష్టంగా అంచనా వేయడానికి వీలుంటుంది. ప్రతి నెల వచ్చే వాహన అమ్మకాల డేటాతో పాటు, రిజిస్ట్రేషన్‌ డేటా కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒక ఇన్వెస్టర్‌గా నా ఆటో ఎక్స్‌పోజర్‌ను పెంచుకునే ముందు,  ఆటో సెక్టార్‌లో రెండెంకల వృద్ధి మొదలయ్యే వరకు వేచి చూడడానికి అధిక ప్రాధాన్నాన్ని ఇస్తాను. కానీ ఆటోరంగంలోని సమస్యల వలన, రెండు మూడేళ్లకు గాను ఈ స్టాకులు మార్కెట్‌ వర్గాలను ఆకర్షించడం లేదు. ఆటో స్టాకులు భారీగా ఓవర్‌సోల్డ్‌ అవ్వడంతో ఈ స్టాకులలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించవచ్చు. ఆటో రంగానికి సంబంధించి సానుకూల వార్తలు వస్తుండడంతో ఇవి తొందరగానే పెరుగుతున్నాయి. కానీ వాటి గత గరిష్ఠాలను దాటగలవా లేదా అనేది అనుమానం. 
ఈ బ్యాంకుల పరిస్థితి..
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ మంచి ఫలితాలను ప్రకటించాయి. కానీ మూడేళ్ల కిందట ఈ రెండు స్టాకులు వాటి గరిష్ఠాల నుంచి 45 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రస్తుతం ఆర్‌బీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులున్న పరిస్థితులలో అప్పుడు ఈ రెండు బ్యాంకులుండేవి. యస్‌ బ్యాంక్‌ ప్రస్తుతం ఈ రెండు బ్యాంకుల కంటే మరింత నష్టంలో ఉంది. కానీ ఈ బ్యాంకులు వాటి ఎన్‌పీఏలను తగ్గించుకోవడం, బ్యాలెన్స్‌ షీట్‌ను శుభ్రం చేసుకోవడం, క్యాపిటల్‌ను సమీకరించడం చేసినట్టయితే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌తో పాటు, యస్‌ బ్యాంక్‌ కూడా రాణించగలదు. ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా చూస్తే..మంచి బ్యాంకుల కంటే వాల్యుషన్లు తక్కువగా ఉన్న, తక్కువ ఒత్తిడి ఉన్న , స్లిప్పెజ్‌లకు సంబంధించి అనిశ్చితి ఉన్న బ్యాంకులలో పెట్టుబడులు పెట్టడానికి అధిక అవకాశాలుంటాయి. ఈ స్టాకులు ప్రస్తుత అధ్వాన్న పరిస్థితులను తట్టుకోని నిలబడగలిగితే, ఈ స్టాకులు వచ్చే రెండు మూడేళ్లలో 35 నుంచి 40 శాతం రిటర్న్‌లను ఇవ్వగలవు. ఇండియాలో బ్యాంకింగ్‌ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది.



You may be interested

16శాతం పెరిగిన సెంట్రల్‌ బ్యాంక్‌

Wednesday 30th October 2019

నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలపడంతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 16శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.18.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రూ.3,353 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల బృందం ఆమోదం తెలిపినట్లు బ్యాంక్‌ ఎక్చ్సేంజీలు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 16శాతం లాభపడి రూ.20.80

రూపాయి క్షీణత: రాణిస్తున్న ఐటీ షేర్లు

Wednesday 30th October 2019

రూపాయి బలహీన ట్రేడింగ్‌తో బుధవారం ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం వరకు లాభపడింది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు(70.84)తో పోలిస్తే 13 పైసలు నష్టపోయింది. రూపీ బలహీనపడటం డాలర్ల​రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగంలో ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్‌ 2.50శాతం లాభపడగా, టీసీఎస్ 2శాతం

Most from this category