బడ్జెట్ నిర్మలం...మార్కెట్లో కల్లోలం!
By Sakshi

ప్రతికూలంగా స్పందించిన స్టాక్ సూచీలు.. లక్ష్యాలు నెరవేరేనా?... వడ్డింపులు వెంటనే అమల్లోకి... అంతర్జాతీయ పరిణామాలు కూడా....
బడ్జెట్ రోజున మార్కెట్ పడిపోవడమనేది ఇదే మొదటిసారికాదు. ఎందుకంటే బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు పెట్టుకున్న అంచనాల్ని ఒకటి, రెండు సందర్భాల్లో మినహా సహజంగానే ఆర్థిక మంత్రులెవరూ తీర్చలేదు. తీర్చలేరు కూడా!!. ఈ సారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ టాక్స్ వంటి అంశాల్లో మార్కెట్‌ను నిరుత్సాహ పరిచారనే చెప్పాలి. ఇందుకు అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడవటంతో స్టాక్ సూచీలు 1 శాతంపైనే పడిపోయాయి. పైగా ఆర్థిక మంత్రి ప్రకటించిన పలు ప్రతిపాదనల్లో ఆర్థిక వ్యవస్థకు లబ్ది చేకూర్చేవన్నీ దీర్ఘకాలంలో ప్రభావం చూపించేవి కాగా... వడ్డింపులు మాత్రం ధనికులు, సామాన్యులకు తక్షణమే భారంగా మారనున్నాయి. దీంతో మార్కెట్ తక్షణ స్పందన ప్రతికూలంగానే ఉంది.
ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల ద్రవ్య సంక్షోభ పరిష్కారానికి కొన్ని చర్యలు ప్రకటించారు. ఇక లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనం కల్పించటం, రూ.1.05 లక్ష కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం పెట్టుకోవటం వంటివి మార్కెట్‌కు అనుకూలమైన అంశాలే అయినప్పటికీ, తొలి రెండు అంశాలు దీర్ఘకాలంలో లబ్దిచేకూర్చేవికాగా, మిగిలిన రెండు అంశాలూ మార్కెట్‌కు ప్లస్కావొచ్చు లేదా మైనస్ కావొచ్చు. ఎందుకంటే పీఎస్‌యూ బ్యాంకులకు గత కొద్ది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయిల మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తున్నా, ఆ నిధులు కాస్తా, ఎన్పీఏల రూపంలో హరించుకుపోతున్నాయి. ఈ బ్యాంకుల మొండి బకాయిలకు అడ్డుకట్టపడితేనే అదనపు మూలధనంతో అవి వ్యాపారాన్ని పెంచుకుని, ఆరోగ్యకరంగా మారతాయి. మొండి బకాయిలకు అడ్డుకట్ట పడాలంటే ఈ నిధులు సరిపోవు కూడా. ఇక భారీ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల పట్ల ఇన్వెస్టర్లకు ఆకర్షణ పెరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలుకాదు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో అధికభాగం ఎయిర్ ఇండియాలో వాటా విక్రయం ద్వారా సంపాదించలన్నది ప్రభుత్వ ఆలోచన కావొచ్చు. కానీ ఈ ఎయిర్‌లైన్ వాటాకు మంచి ధర ఇచ్చే వ్యూహాత్మక ఇన్వెస్టరు ఎవరూ ముందుకురాకపోవొచ్చు. జెట్ ఎయిర్వేస్ అమ్మకానికి... దాని రుణదాతలు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును మార్కెట్ మెచ్చుకునేలా 3.3 శాతమే ఆర్థిక మంత్రి నిర్దేశించినప్పటికీ, ఈ ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోవాలంటే రూ.1.05 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఈ రెండూ కష్టసాధ్యమన్న అంచనాలకు మార్కెట్ రావడం కూడా శుక్రవారం నాటి స్టాక్ సూచీల పతనానికి ఒక కారణం. పైగా డిజిన్వెస్మెంట్ లక్ష్య సాధన, పబ్లిక్ వాటా తగ్గింపు వంటి ప్రతిపాదనలు అమలైతే ఆయా కంపెనీల షేర్లు మార్కెట్లో పెరిగిపోయి, వాటి ధరలు తగ్గుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా వంటి పీఎస్‌యూ షేర్లు పడిపోవటానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు. ఈ కారణాలన్నీ స్టాక్ సూచీలను క్షీణింపచేశాయి. పబ్లిక్ వాటా తక్కువగా ఉన్న బహళజాతి కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అవెన్యూ సూపర్‌మార్ట్ (డీమార్ట్) వంటి కన్జూమర్ షేర్లు సైతం పతనమయ్యాయి.
ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన పరోక్ష, ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల్లో రూ.400 కోట్లలోపు టర్నోవర్ ఉన్న కంపెనీల కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం మినహా మిగిలినవన్నీ వడ్డింపులే. వాటిలో రెండైతే బడ్జెట్ పార్లమెంటు ఆమోదం పొందేవరకూ కాకుండా తక్షణమే అమల్లోకి వచ్చేస్తాయి. వీటిలో పెట్రోల్, డీజిల్ లీటరుపై పెంచిన ఒక రూపాయి ఎక్సయిజు సుంకం శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేసింది. ఈ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా అన్ని ఉత్పత్తుల రేట్లూ పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకుతుంది. ఈ కారణంతో పెట్రో మార్కెటింగ్ షేర్లు పతనమయ్యాయి. మరొకటి బంగారంపై దిగుమతి సుంకం 12.5 శాతానికి పెంచటం. తొలి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్... పుత్తడిపై ఇప్పటివరకూ వున్న 10 శాతం సుంకాన్ని తగ్గిస్తారన్న అంచనాలుండగా, బంగారం వినియోగాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సుంకాన్ని ఏకంగా 2.5 శాతం పెంచడంతో వెంటనే స్పాట్ మార్కెట్లో 10 గ్రామల బంగారం ధర భగ్గుమని రూ.700కుపైగా పెరిగింది. అలాగే వెండి, ప్లాటినం ధరలు కూడా రివ్వున ఎగశాయి. దాంతో జ్యువలరీ షేర్లు పతనమయ్యాయి. పెట్రో ఉత్పత్తులు, పుత్తడి సుంకాల ప్రభావం తక్షణమే కన్పించగా, ధనికులపై వ్యక్తిగత ఆదాయపు పన్నును 42.7 శాతానికి పెంచడం మార్కెట్‌ను బాధించింది. షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లకంటే ధనికులు చేసే పెట్టుబడులే ఎక్కువ. పైగా ముఖేష్ అంబానీ, రాహుల్ బజాజ్, అజీం ప్రేమ్‌జీ వంటి పెద్ద ప్రమోటర్లు చేసే పెట్టుబడులపై కూడా ఈ అధిక పన్ను ప్రభావం పడుతుంది. దిగుమతయ్యే కార్లపై సుంకాల పెంపు, కార్ల విడిభాగాలపై సుంకాలు పెంచడం వంటి ప్రతిపాదనలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలుకానున్న నేపథ్యంలో ఆటో షేర్లన్నీ కుదేలయ్యాయి. ఇప్పటికే అమ్మకాలు క్షీణించి వెలవెలపోతున్న ఈ రంగానికి రాయితీలు ప్రకటిస్తారన్న అంచనాలపై ఆర్థిక మంత్రి నీళ్లుచల్లడం కూడా ఈ షేర్ల భారీ పతనానికి ఒక కారణం. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై పన్ను రాయితీలు ప్రతిపాదించినా, ఈ రంగంలోని ఏకైక లిస్టెడ్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా సైతం కుప్పకూలింది.
ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగం నెమ్మదిస్తుందన్న వార్తలతో ఈ షేర్లు, మెటల్ షేర్లు వారం రోజుల నుంచి క్షీణిస్తుండగా, బడ్జెట్లో రాయితీలు వుంటాయన్న అంచనాలతో మన మార్కెట్లో స్థిరంగా ట్రేడవుతూ వచ్చాయి. కానీ ఈ రోజు అంచనాలు వాస్తవరూపం దాల్చక, ఈ రంగాల షేర్లు నిలువునా పడిపోయాయి. మరోవైపు డాలరు బలహీనత ఫలితంగా రూపాయి క్రమేపీ బలపడుతున్నా, స్థిరంగా ట్రేడయిన ఐటీ షేర్లు కూడా పడిపోయి, ఈ పతనాన్ని ఆర్థిక మంత్రి ఖాతాలో పడేలా చేశాయి.
You may be interested
‘సీత’మ్మ నష్టాలు!
Saturday 6th July 2019ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్బీఎఫ్సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట ..
Saturday 6th July 2019అసెట్స్ కొనుగోలు చేసే పీఎస్బీలకు పాక్షిక రుణ హామీ ఆర్బీఐకి మరిన్ని నియంత్రణాధికారాల ప్రతిపాదనలు న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్–టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు