News


ర్యాలీ కొనసాగేనా..?

Monday 2nd September 2019
Markets_main1567399601.png-28138

  • స్థూల ఆర్థికాంశాలే ఈవారంలో కీలకం
  • అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం
  • కేవలం 5 శాతంగా నమోదైన దేశ క్యూ1 జీడీపీ
  • ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం
  • వినాయక చవితి సందర్భంగా సోమవారం మార్కెట్‌కు సెలవు

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనానికి గడిచిన వారంలో అడ్డుకట్ట పడింది. అంతక్రితం రెండు వారాల వరుస నష్టాల నుంచి కోలుకుని, లాభాల బాట పట్టిన ప్రధాన సూచీలు.. దాదాపు 1.79 శాతం లాభపడి ఏకంగా మూడు నెలల గరిష్టస్థాయిని నమోదుచేశాయి. ఇక ఈవారంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉందనుందనే అంశానికి.. స్థూల ఆర్థిక అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా వెల్లడైన విషయం తెలిసిందే కాగా, దేశ ఆర్థికరంగ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందనే అంశానికి తాజా డేటా అద్ధం పట్టింది. జీడీపీ క్షీణతను మార్కెట్‌ వర్గాలు అంచనావేసినప్పటికీ.. మరీ ఈ స్థాయిలో తగ్గుదల ఉంటుందని మాత్రం అంచనావేయలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్‌ అన్నారు. అయితే, లోబేస్‌ ప్రయోజనం ఉన్నందున ద్వితీయార్థంలోని రెండు త్రైమాసికాల్లోని వృద్ధిరేటు ఊపందుకుంటుందని విశ్లేషించారు. ‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో కోత విధించేందుకు అవకాశం ఉంది. వచ్చే 2-3 త్రైమాసికాల్లో ఆర్‌బీఐ నిర్ణయాలు పటిష్టంగా ఉండనున్నాయని భావిస్తున్నాం. వృద్ధి రేటు గాడిన పడాలంటే.. కార్మిక, భూ సంస్కరణల మాదిరిగానే ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంది’ అని విశ్లేషించారయన. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈవారం ట్రేడింగ్‌ అంతంత మాత్రంగానే ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు. 

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే...
వినాయక చవితి సందర్భంగా సోమవారం (2న) దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. మంగళవారం (3న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది. ఇక లేబర్‌ హాలిడే కారణంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్‌కు సెలవు.

బ్యాంకింగ్‌ షేర్లు ఆదుకునేనా..?
మొండి బకాయిల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న బ్యాంకింగ్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ఏకంగా 10 బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా పరంగా చేపట్టిన తాజా సంస్కరణలు.. మార్కెట్‌కు సానుకూలంగా మారనున్నాయని జియోజిత్ ఆర్థిక నిపుణులు దీప్తి మాథ్యూస్ విశ్లేషించారు. ‘పీఎస్‌యూ బ్యాంకుల విలీన నిర్ణయం స్వాగతించదగినది. సంస్కరణల ద్వారా ఆర్థిక రంగంలో ప్రభుత్వం ఊపు తీసుకుని రానుందనే అంశానికి ఇది స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని అన్నారు. 

ఆగస్టులో రూ.5,920 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1-30 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.17,592 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్‌ మార్కెట్‌లో రూ.11,672 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ గతనెల్లో రూ.5,920 కోట్లకు పరిమితమైంది. ఇక జూలైలో రూ.2,986 కోట్లను భారత మార్కెట్‌ నుంచి వెనక్కుతీసుకున్నారు. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశం తెరపైకి రాకముందు.. వీరు జూన్‌లో రూ.10,384 కోట్లు, మేలో రూ.9,031 కోట్లు, ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు పెట్టుబడి పెట్టి.. వరుసగా ఐదు నెలలపాటు పెట్టి నికర కొనుగోలుదారులుగా నిలిచారు.



You may be interested

సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 36,830

Monday 2nd September 2019

ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ పెంపును ఉపసంహరించడం, ప్రభుత్వ బ్యాంకులకు తక్షణ మూలధనాన్ని అందించడం, వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, రుణాల్ని చౌకగా లభింపచేయడం, ఆటోమొబైల్‌ రంగానికి రాయితీలు వంటి కేంద్రం చర్యలపై గతవారం ఆరంభంలో ఈక్విటీలు సానుకూలంగా స్పందించినప్పటికీ, పెద్దగా ముందడుగు వేయలేకపోయాయి. బ్యాంకింగ్‌ ఎన్‌పీఏలపై వెన్నాడుతున్న భయాలు, ఆర్థికాభివృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలు ఇందుకు కారణం కావొచ్చు. మరోవైపు  ట్రేడ్‌వార్‌ పట్ల అమెరికా-చైనాలు కాస్త మెత్తబడినట్లు కన్పించడంతో ప్రపంచ మార్కెట్లు

నేడు మార్కెట్లకు సెలవు

Monday 2nd September 2019

వినాయక చవితి సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్ర సమయంలో ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (3న) ప్రారంభమవుతుంది.  బ్యాంక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మధ్యాహ్న నష్టాలు రికవరీ కావడంతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. ప్రస్తుత మందగమనం చక్రీయ

Most from this category