News


ఇకపై ఇన్ఫోసిస్‌ వృద్ధి మరింత స్పీడ్‌?

Saturday 11th January 2020
Markets_main1578727726.png-30862

రానున్న నాలుగైదేళ్లలో పటిష్ట పనితీరు
ఇన్వెస్టర్లు కొత్త ధృక్పథంతో చూడాలి
సెక్యులర్‌ వృద్ధిలో దేశీ ఐటీ కంపెనీలు
గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ అంచనా

దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రానున్న నాలుగు, ఐదేళ్ల కాలంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ సహవ్యవస్థాపకులు ట్రిప్‌ చౌదరీ తాజాగా అంచనా వేశారు. ఇన్వెస్టర్లు సరికొత్త ధృక్పథంతో ఈ కంపెనీని చూడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ ఫలితాలతోపాటు.. దేశ ఐటీ రంగ కంపెనీలు తదితర అంశాలపై ట్రిప్‌ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

14 డాలర్లకు
ఏడాది కాలంగా ఇన్ఫోసిస్‌ కొత్త మలుపు తిరగనున్నట్లు అంచనా వేస్తూనే ఉన్నాం. బిజినెస్‌ ఫండమెంటల్స్‌ మెరుగవుతున్నాయి. కంపెనీ నిర్వహణ పటిష్టంగా ఉంది. ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ఆకట్టుకుంటున్నాయి. అంచనాలను మించుతున్న కంపెనీ రానున్న నాలుగు, ఐదేళ్లలో మరింత పటిష్టతను సంతరించుకునే అవకాశముంది. దేశీయంగా ప్రతీ ఐటీ కంపెనీ సెక్యులర్‌ వృద్ధిలో సాగనున్నట్లు భావిస్తు‍న్నాం. ఇన్ఫోసిస్‌ కౌంటర్‌లో త్రైమాసిక ప్రాతిపదికన ట్రేడ్‌ చేయబోము. దీర్ఘకాలంలో షేరు పుంజుకోనుంది. కంపెనీకి ప్రస్తుతం శిక్షణ పొందిన మానవ వనరుల బలముంది. క్లౌడ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ తదితర కొత్త నైపుణ్యాలు కలిగిన మానవ వనరులతో కంపెనీ అత్యంత సమర్థవంతంగా రూపొందింది. వెరసి ఇన్వెస్టర్లు కొత్త ధృక్పథంతో ఇన్ఫోసిస్‌ను చూడవలసి ఉంది. పటిష్ట నిర్వహణతోపాటు.. భవిష్యత్‌ ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీల విషయంలో పోటీపడగల సామర్థ్యం, కొత్త టెక్నాలజీల నైపుణ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే సంగతి తెలిసిందే. ఈ కోణంలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ షేరుకి 14 డాలర్ల టార్గెట్‌ను ప్రకటిస్తున్నాం. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ శుక్రవారం(10న) 1.6 శాతం లాభపడి 10.6 డాలర్ల వద్ద ముగిసింది. 

మార్జిన్లపై ఆందోళన లేదు
ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలలో నమోదైన మార్జిన్లపట్ల ఆందోళనలేదు. వృద్ధికి వీలుగా కంపెనీ పెట్టుబడుల బాటలో సాగుతోంది. ఇకపైన కూడా మార్జిన్లు నీరసించినా.. ఇన్వెస్టర్లు ఈ అంశంలో ఆందోళన చెందనక్కర్లేదు. బిజినెస్‌, మానవ వనరులు, శిక్షణ వంటి అంశాలపై పెట్టుబడులు వెచ్చించే కంపెనీలే భవిష్యత్‌లో నిలదొక్కుకోగలుగుతాయి. దీర్ఘకాలానికి చూస్తే.. మార్జిన్లు తగ్గడం సానుకూల అంశమే. దీనివల్ల ఆదాయంలో వృద్ధి నమోదవుతుంది. కాగా.. ప్రజావేగు ఆరోపణలు లేదా ఎస్‌ఈసీ దర్యాప్తు వంటి అంశాలపై ఆందోళన లేదు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే పబ్లిక్‌ కంపెనీలు ఇలాంటి పరిస్థితులపై వేగంగా స్పందిం‍చవలసి ఉంటుంది. ఆటో రంగ దిగ్గజం టెస్లాపైనా విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులు నమోదయ్యాయి. బిజినెస్‌పై దృష్టిపెట్టి సాగే కంపెనీలకు ఇలాంటి అంశాలు పెద్దగా సమస్యలు సృష్టించలేవు. 

డిజిటల్‌ అండ
ఇన్ఫోసిస్‌ డిజిటల్‌ విభాగంలో వేగంగా విస్తరిస్తోంది. యూఎస్‌ఏలో స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇక్కడ పలు ప్రాంతాలలో కార్యలయాలను ఏర్పాటు చేసింది. లోకల్‌ టాలెంట్‌తోపాటు.. అంతర్జాతీయ నిపుణులతో కూడిన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. చౌకలో అత్యున్నత ఐటీ సర్వీసులను అందించగలగడమే ఇన్ఫోసిస్‌ బలం. దీంతో ఈ షేరు మా అంచనాను మించుతూ 14 డాలర్లను మించి పరుగు తీయవచ్చు కూడా.You may be interested

2020కి యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు

Saturday 11th January 2020

కొత్త ఏడాదిలో ఆరు అధిక రాబడినిచ్చే స్టాకులతో యస్‌ సెక్యూరిటీస్‌ మోడల్‌ పోర్టుఫోలియోను అప్‌డేట్‌ చేసింది. 1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 100. వాణిజ్యవాహన విభాగంలో సైక్లిక్‌ రికవరీకి అవకాశాలున్నాయి. దీంతో కంపెనీ ముందుగా లాభపడనుంది. కంపెనీ వచ్చే రెండేళ్ల పాటు ఎబిటా, ఈపీఎస్‌లో వరుసగా 26, 38 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయవచ్చు. ప్రస్తుతం వాల్యూషన్లు గరిష్ఠాల వద్ద ఉన్నాయి. ఇలా వాల్యూషన్లు సైక్లిక్‌

బడ్జెట్‌ రోజున స్టాక్‌ ట్రేడింగ్‌ జరుగుతుందా..!?

Saturday 11th January 2020

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈసారి యాధృచ్చికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం అయింది. సాదారణంగా ప్రతి శనివారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు దినం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ పనిచేస్తుందా లేదా అనే సందేహం మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది. ఈ అంశంపై మీడియా వర్గాలు ఎక్స్‌ఛేంజీలను వివరణ కోరాయి. బడ్జెట్‌ రోజున పని చేసేందుకు

Most from this category