News


చమురు పతనంతో మనకు భలే లబ్ది

Saturday 7th March 2020
Markets_main1583566312.png-32347

దేశీయంగా తగ్గనున్న దిగుమతులు బిల్లు
చౌక కానున్న పెట్రోల్‌, డీజీల్‌ ఉత్పత్తులు
విమానయానం, నౌకాయానం, రైల్‌, రోడ్‌ రంగాలకు మేలు

పెయింట్లు, టైర్లు, పాలిమర్‌ పరిశ్రమలకూ ప్లస్సే
రూపాయికీ ప్రయోజనమే

ఉన్నట్టుండి శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు కుప్పకూలాయి. ధరలకు దన్నుగా ఉత్పత్తిలో కోతలను పెంచేందుకు ఒపెక్‌ చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించడంతో చమురు ధరలు ఏకంగా 10 శాతం పతనమయ్యాయి. ఇండియన్‌ బాస్కట్‌లో భాగమైన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ధర దాదాపు 5 డాలర్లు పడిపోయింది. వారాంతాన లండన్‌ మార్కెట్లో 45 డాలర్లకు దిగివచ్చింది. ఇది నాలుగేళ్ల కనిష్టంకాగా.. ఒమన్‌, దుబాయ్‌, బ్రెంట్‌ చమురులతో ఇండియన్‌ బాస్కట్‌ రూపొందే సంగతి తెలిసిందే. 

75 శాతం దిగుమతులే
ఇటీవల విదేశాలలో ముడిచమురు ధరలు నీరసిస్తూ వస్తున్నాయి. తాజాగా 10 శాతం పతనంకావడం ద్వారా నాలుగేళ్ల కనిష్టాలకు చేరాయి. ఇది దేశీయంగా ప్రయోజనం చేకూర్చనుంది. నిజానికి దేశీయంగా వినియోగించే చమురు కోసం 75 శాతం వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తయ్యే చమురు వాటా 25 శాతం మాత్రమే. ఇందువల్ల ప్రభుత్వం డాలర్లలో చమురు బిల్లును చెల్లించవలసి ఉంటుంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌))లో ఇండియన్‌ బాస్కట్‌గా పిలిచే దేశీయంగా దిగుమతైన చమురు సగటున బ్యారల్‌ 65.52 డాలర్లుగా నమోదైంది. తాజా పరిణామంతో ఇది మరింత దిగివచ్చే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో డాలరుతో మారకంలో రూపాయి పతనమవుతుండటంతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరకపోవచ్చని అభిప్రాయపడ్డాయి.

సగటు ధరల తీరిలా
2018లో ఇండియన్‌ బాస్కట్‌ చమురు బ్యారల్‌ సగటు ధర 56.43 డాలర్లుకాగా.. 2019లో 69.88 డాలర్లకు చేరింది. డిసెంబర్‌ త్రైమాసికంలో 65.52 డాలర్లకు నీరసించింది. ఫిబ్రవరి చివరికల్లా ఈ ధర 51.16 డాలర్లను తాకినట్లు పెట్రోలియం ప్లానింగ్‌ విశ్లేషణ సంస్థ పేర్కొంది. ప్రపంచంలోనే చమురు దిగుమతులకు ఇండియా మూడో పెద్ద దేశంకాగా.. ఎల్‌ఎన్‌జీ కొనుగోలులోనూ నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. నిజానికి చమురు బ్యారల్‌ ధర ఒక్క డాలర్‌ తగ్గితే వార్షికంగా దిగుమతుల బిల్లులో రూ. 10,700 తగ్గవచ్చని ఒక అంచనా. గతేడాది(2018-19) చమురు దిగుమతుల కోసం దేశీయంగా 112 బిలియన్‌ డాలర్లను వెచ్చించడం గమనార్హం! దేశీయంగా ఏర్పాటైన 23 రిఫైనరీల ద్వారా 249 మిలియన్‌ టన్నుల చమురు వార్షికంగా శుద్ది అవుతుంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 

ద్రవ్యోల్బణానికి చెక్‌
చమురు బిల్లు తగ్గడంతో కరెంట్‌ ఖాతా లోటు కట్టడికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా పెట్రోల్‌, డీజిల్‌ తదితరాల ధరలు దిగివస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. విమానయానం, నౌకా రవాణా, రోడ్‌, రైల్‌ రవాణా తదితర రంగాలు లబ్ది పొందేందుకు అవకాశముంటుంది. అంతేకాకుండా క్రూడ్‌ డెరివేటివ్స్‌ అంటే ముడిచమురును శుద్ధి చేసేటప్పుడు వెలువడే ఉప ఉత్పత్తులు పెయింట్లు, టైర్లు, పాలిమర్స్‌ తదితర పలు రంగాలలో ముడిసరుకులుగా వినియోగమవుతుంటాయి. దీంతో ఆయా రంగాల వ్యయాలు తగ్గేందుకు వీలవుతుంది. పరోక్షంగా రూపాయి బలపడేందుకూ చమురు ధరలు దోహదపడతాయని ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి.You may be interested

ఎస్‌బీఐ చేతిలో యస్‌బ్యాంక్‌ సురక్షితం: రాణా కపూర్‌

Saturday 7th March 2020

యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వ్యూహాత్మక వాటా కొనుగోలును యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్వాగతించారు. యస్‌ బ్యాంకు ఎస్‌బీఐ చేతుల్లోకి వెళ్లడంతో సరైన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, వాటా కొనుగోలుకు ప్రక్రియ విధానం, అందుకు తీసుకున్న కాలవ్యవధి సరైన పద్ధతిలోనే ఉన్నట్లు రాణాకపూర్‌ చెపుతున్నారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. వివరాలు.... యస్‌బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన భారీ నిధుల సమీకరణ ఇష్యూ (లేదా) క్యూఐపీ కంటే

కరోనా కాటుకు కుంటుపడ్డ రంగాలు!

Saturday 7th March 2020

      గత నెలరోజులుగా ఎవరినోటా విన్నా ఒకటే మాట వినిపిస్తోంది అదే కరోనా(కోవిడ్‌-19). చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతూ పోతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో కరోనా భయంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన పౌరులు, పర్యాటకుల వల్ల ఇండియాలో కూడా

Most from this category