News


మైక్రోఫైనాన్స్‌ రంగంలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయకూడదు?

Sunday 8th September 2019
Markets_main1567963470.png-28255

పెద్ద కార్పొరేట్‌ సంస్థలు తమకున్న పేరు, ప్రఖ్యాతులు, బ్రాండ్‌ వ్యాల్యూతో రుణాలను సులభంగా పొందగల స్థితిలో ఉంటాయి. వారితో చేతులు కలిపేందుకు రుణాలిచ్చే సంస్థలు కూడా సంతోషంగానే ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలను వెనక్కి పొందగలమన్న నమ్మకం వాటిది. దీనికి భిన్నంగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్‌) తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇచ్చేవి. పైగా ఇవి సులభంగా లభించేవి కావు. కానీ, వరుసగా కార్పొరేట్‌ సంస్థలు రుణాల చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తుండడం, సూక్ష్మ రుణాలను తీసుకున్న వారు తూచ తప్పకుండా చెల్లిస్తుండడంతో... ఇన్వెస్టర్లు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల్లో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయకూడదన్న ప్రశ్నను రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సంధించింది. ఎన్‌పీఏలు చాలా తక్కువగా ఉంటున్న మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చన్నది ఈ సంస్థ సూచన.

 

‘‘పెద్ద కార్పొరేట్‌ సంస్థలు అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, మన్‌పసంద్‌ బెవరేజెస్‌, గీతాంజలి జెమ్స్‌, పీసీ జ్యుయలర్‌, తాల్‌వాల్కర్స్‌ తదితర కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యాయి. చాలా కంపెనీలు వాటి పుస్తకాలను ఎన్నో ఏళ్లుగా వండి వారుస్తూ వచ్చినవే. మరి ఈ పరిస్థితుల్లో పెద్ద కార్పొరేట్‌ సంస్థల పట్ల ఎందుకు నమ్మకం ప్రదర్శించడం? అన్న దానిపై ఆలోచించాల్సిందే. టాప్‌ రేటింగ్‌ కంపెనీలు అయినా కానీ బ్యాంకులకు రుణాలను చెల్లించడంలో అవి విఫలం అయ్యాయి. నమ్మకం కొద్దీ కార్పొరేట్లకు భారీ రుణాలు ఇచ్చినందుకు అవిప్పుడు విచారిస్తు‍న్నాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అయినా కానీ బడా ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తితో ఉన్నాయి. అధిక వ్యాల్యూషన్లలో, 40-50 పీఈ రేషియోలో ఉన్నప్పటికీ అవి వెనుకాడడం లేదు. ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల విషయంలో గుడ్డి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. 

 

కానీ, దీనికి వ్యతిరేకంగా మైక్రోఫైనాన్స్‌ పరిశ్రమ నడుస్తోంది. సమాజంలో బ్యాంకు సేవలు అందుబాటులో లేని వర్గాలకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు అందిస్తున్నాయి. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే అవకాశాలు అధిక శాతం ఉన్నప్పటికీ, ఈ రంగానికి అధిక విలువ ఇవ్వడంలో వైఫల్యం చెందాం. డీమోనిటైజేషన్‌ సమయంలో 95 శాతం మంది రుణాలు తీసుకున్న వారు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు తిరిగి చెల్లించినట్టు డేటా చూస్తే తెలుస్తోంది. ఎటువంటి హామీలు లేకుండా, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో వారి ఉద్దేశం నిజంగా మంచిది. కనుక మనం ఈ రంగంపై ఎందుకు నమ్మకం ఉంచకూడదు. పైగా చాలా తక్కువ వ్యాల్యూషన్లలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆర్థిక మందగమనంలోనూ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మైక్రో ఫైనాన్స్‌ పరిశ్రమ 42.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2018-19లో బ్యాంకింగ్‌ రంగంలో రూ.71,543 కోట్ల విలువైన మోసాలు నమోదు అవగా, ఇందులో రూ.లక్ష కంటే తక్కువ మోసాలు కేవలం 0.1 శాతమే. సూక్ష్మ రుణాలు తీసుకున్న వారు వెంటనే తిరిగి చెల్లించడంలో వారి ఉద్దేశ్యాన్ని ఇది తెలియజేస్తోంది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌, బంధన్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఈ విభాగంలో మంచిగా రాణిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ విలీనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చాలా చౌక వ్యాల్యూషన్‌ వద్ద ట్రేడవుతున్నాయి’’ అని రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ తన నివేదికలో తెలియజేసింది.
 



You may be interested

వెండిలో ఇన్వెస్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు ఆకర్షణీయం

Sunday 8th September 2019

బంగారం ర్యాలీని వెండి కూడా అందుకుని పరుగులు తీస్తోంది. లండన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ స్పాట్‌ ధరలు ఔన్స్‌కు 19.64 డాలర్లకు చేరి మూడేళ్ల గరిష్ట స్థాయికి వెళ్లాయి. 2013 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి ధరకు చేరడం మళ్లీ ఇదే. నిజానికి చారిత్రకంగా చూస్తే బంగారం ర్యాలీ చేసినప్పుడల్లా వెండి కూడా మంచి ప్రదర్శనే చూపుతోంది. ఈ నేపథ్యంలో వెండిలో ఇన్వె‍స్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు పెట్టుబడులకు ఆకర్షణీయమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 7th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 10,964.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10973.65పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాహనరంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్చలు తీసుకోవచ్చనే అంచనాలు, అమెరికా-చైనాల మధ్య

Most from this category