News


వొడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్‌...భారీ నష్టాల్లో రికార్డు

Friday 15th November 2019
Markets_main1573787594.png-29597

- ఐడియాకు రూ.50,921 కోట్ల నష్టాలు 
- ఒక భారత కంపెనీకి ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు 
- ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.23,045 కోట్లు 
- కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు

న్యూఢిల్లీ: 
ఏజీఆర్‌పై (సర్దుబాటు చేసిన వార్షిక స్థూల రాబడి) సుప్రీం కోర్ట్‌ తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని  ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం కంపెనీల వార్షిక స్థూల రాబడిని మదింపు చేయడానికి లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ విధానాన్ని సుప్రీం కోర్ట్‌ తన తాజా తీర్పులో సమర్థించింది. 
మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు...
టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం..., ఏజీఆర్‌కు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్‌ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్‌టెల్‌ మీదనే పడింది) వొడాఫోన్‌ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్‌ తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీం కోర్ట్‌ నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 
ఐడియా రివ్యూ పిటీషన్‌...! 
ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌ విషయమై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్‌టెల్‌ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్‌ విషయమై ఒక రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్‌ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది. 

ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.23,045 కోట్లు....
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్‌(వార్షిక స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్‌ ఇటీవల వచ్చిన తీర్పు కారణంగా కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది. కొత్త అకౌంటింగ్‌ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 
సుప్రీం కోర్ట్‌ ఏజీఆర్‌ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్‌ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడింది.  ఈ భారం కారణంగా కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్‌ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. కాగా నిర్వహణ లాభం రూ.6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3 శాతం పెరిగి రూ.15,361 కోట్లకు పెరిగింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13 శాతం ఎగసింది. 


వొడాఫోన్‌ ఐడియా నష్టాలు రూ.50,921 కోట్లు
ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్‌ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయనే అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్‌టెల్‌ షేర్‌ బీఎస్‌ఈలో 1.5 శాతం నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 20 శాతం నష్టంతో రూ.2.95 వద్దకు చేరింది. 


టాప్‌ త్రి త్రైమాసిక నష్టాలు 
కంపెనీ                నష్టాలు (కోట్లలో)
1 వొడాఫోన్‌ ఐడియా    రూ.50,921
2. టాటా మోటార్స్‌    రూ.26,961
3. భారతీ ఎయిర్‌టెల్‌        రూ.23,045



You may be interested

వేదాంత లాభం రూ.2,158 కోట్లు

Friday 15th November 2019

61 శాతం వృద్ధి  కలసివచ్చిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు  49 శాతం పెరిగిన ఇతర ఆదాయం న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం

సెన్సెక్స్‌ లాభం 170 పాయింట్లు

Thursday 14th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం స్టాక్‌ సూచీలు లాభంతో  ముగిశాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లు లాభంతో 40,286.48 వద్ద, నిఫ్టీ 30.00 పెరిగి 11,870.45 వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపు కారణమయ్యాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 223

Most from this category