News


యస్‌ బ్యాంకును మీరూ యావరేజ్‌ చేశారా..?

Tuesday 27th August 2019
Markets_main1566845561.png-28028

పడిపోతున్న కత్తిని చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయొద్దంటారు... ఎందుకంటే చేతికి గాయం అవుతుందని. అలాగే, బయటకు తెలియని వాస్తవిక కారణాలతో కుదేలైపోతున్న ఓ స్టాక్‌ను తక్కువకు దొరుకుతుంది కదా అని, కొని డీమ్యాట్‌ ఖాతాలో వేసేసుకుందామని భావిస్తే... పడిపోతున్న కత్తి మీ చేతికి గాయం చేసినట్టుగానే, ఆ షేరు కూడా మీ పెట్టుబడికి చిల్లు పెట్టేస్తుంది. ఈ సుత్తి ఏంటనుకోకండి... ఇదంతా యస్‌ బ్యాంకు గురించి చెప్పేందుకే. గత ఏడాది కాలంలో యస్‌ బ్యాంకు భారీగా పతనమవడాన్ని ఇన్వెస్టర్లు కళ్లారా చూశారు. ఈ షేరులో ఇన్వెస్టర్లు ఏ విధంగా ఇరుక్కుపోయినదీ... జెరోదా సీఈవో నితిన్‌ కామత్‌ తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెట్టారు. 

 

జెరోదా వద్ద 7 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు ఉంటే, అందులో 2 లక్షల మంది ఇన్వెస్టర్లు యస్‌ బ్యాంకు షేర్లను కలిగి ఉన్నారని కామత్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో యస్‌ బ్యాంకు షేరు 85 శాతం వరకు పడిపోయింది. రూ.404 ఆల్‌టైమ్‌ గరిష్ట ధర నుంచి ప్రస్తుత ధర రూ.65 వరకు చూస్తే ఏ స్థాయిలో ఇన్వెస్టర్లను నిండా ముంచిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, జెరోదా క్లయింట్లు 7 లక్షల మందిలో 30 శాతం మంది వద్ద యస్‌ బ్యాంకు షేర్లు ఉండగా, వీరంతా ఏడాది క్రితం కొనుగోలు చేసిన వారు అనుకునేరు. కొందరు ఏడాది క్రితం కొంటే, కొందరు పడిపోతున్న కొద్దీ కొనుగోలు చేస్తూ వచ్చిన వారే. జెరోదా క్లయింట్లు యస్‌ బ్యాంకు షేరు విషయంలో నికరంగా 59 శాతం మేర ప్రస్తుతం ఆన్‌రియలైజ్డ్‌ లాస్‌తో ఉన్నారని కామత్‌ వెల్లడించారు. అంటే వారంతా నష్టాలను బుక్‌ చేసుకోకుండా ఆ స్టాక్‌లో వేచి చూస్తున్న వారే. జెరోదా క్లయింట్లలో 1.25 లక్షల మంది అశోక్‌లేలాండ్‌ విషయంలో 40 శాతం, టాటా మోటార్స్‌ విషయంలో 51 శాతం నష్టాలతో ఉన్నారట. 

 

చాలా మంది క్లయింట్లు యస్‌ బ్యాంకు విషయంలో యావరేజ్‌ చేయడం, పడిపోయినప్పుడల్లా మరిన్ని కొనుగోలు చేయడం చేసిన వారే. 1.96 లక్షల మంది జెరోదా క్లయింట్ల వద్ద యస్‌ బ్యాంకు షేర్లు ఉంటే, వీరు సగటున ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ఈ షేర్లను కొనుగోలు చేసినట్టు కామత్‌ తన పోస్ట్‌లో వివరించారు. ‘‘చాలా సందర్భాల్లో యావరేజ్‌ చేయడం అన్నది ఫలితమిచ్చి ఉండొచ్చు కానీ, ఒక పనికిమాలిన ట్రేడ్‌ విషయంలో ఇలా యావరేజ్‌ (పడిపోయిన సమయంలో మరికొన్ని కొనుగోలు చేయడం ద్వారా సగటు కొనుగోలు ధరను తగ్గించుకోవడం) చేయడం గతంలో ఆర్జించిన మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది’’ అని నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు. 

 

యస్‌ బ్యాంకు విషయంలో ఇన్వెస్టర్లు ఎలా బోల్తా పడిందీ ఆయన గ్రాఫ్‌ ద్వారా వివరించారు. 2018 ఆగస్ట్‌ చివరికి యస్‌ బ్యాంకు షేరును జెరోదా క్లయింట్లలో కేవలం 23,681 మందే కలిగి ఉండగా, సెప్టెంబర్‌ మధ్య నాటికి ఈ సంఖ్య 58,908కి పెరిగింది. రాణా కపూర్‌ పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఆర్‌బీఐ నిరాకరించింది అప్పుడే. ఇక 2019 ఆగస్ట్‌ చివరి నాటికి యస్‌ బ్యాంకు షేరు 1,96,417 మంది జెరోదా క్లయింట్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి చేరిపోయింది. వీరంతా తక్కువ ధరలో కొని, తర్వాత ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నా వారేనా? ఇదో భ్రమ అంటూ కామత్‌ అభివర్ణించారు. దీనికంటే మంచిగా రాణించే కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, అవి వృద్ధి చెందుతున్న సమయంలో విక్రయించడం మంచిదని సూచించారు. దురదృష్టవశాత్తూ రిటైల్‌ ఇన్వెస్టర్లు దీన్ని పాటించడం లేదన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరును కూడా ఆయన ఉదహరించారు. 2018 జూన్‌ నాటికి యస్‌బ్యాంకు షేరును 6.27 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు కలిగి ఉంటే, అదే సమయంలో 11.56 శాతం మేర వాటాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ కలిగి ఉన్నాయి. కానీ 2019 జూన్‌కు వచ్చే సరికి రిటైల్‌ ఇన్వెస్టర్ల వద్దనున్న యస్‌ వాటాలు 18.72 శాతానికి పెరగ్గా, మ్యూచువల్‌ ఫండ్స్‌ వద్దనున్న వాటాలు 6.59 శాతానికి తగ్గిపోయాయి. అంటే ఫండ్స్‌ వదిలించుకుంటే రిటైలర్లు అంటించుకున్నారు.You may be interested

కేంద్రానికి ఆర్‌బీఐ నిధుల బొనాంజా!

Tuesday 27th August 2019

- 2019-20లో రూ.1.76 లక్షల కోట్లు - జలాన్‌ కమిటీ సిఫారసులకు  ఆర్‌బీఐ బోర్డ్‌ ఆమోదముద్ర - డివిడెండ్‌, మిగులు నిల్వల  బదలాయింపులతో కేంద్రానికి భారీ నిధులు ముంబై: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) రూ.1,76,051 కోట్ల నిధుల బదలాయింపు జరగనుంది.  ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోకి కమిటీ సిఫారసులకు సోమవారం సెంట్రల్‌ బ్యాంక్‌ బోర్డ్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తాజా నిధుల బదలాయింపు జరుగుతోంది.

మార్కెట్ల ర్యాలీ... అయినా అప్రమత్తంగా ఉండాలి..?

Tuesday 27th August 2019

మార్కెట్ల ర్యాలీలో పరుగులు తీయకుండా కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌. సోమవారం ఆటుపోట్లతో కొనసాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా లాభపడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు వరుస చర్యల వల్ల నిఫ్టీ 228 పాయింట్లు (2.11 శాతం) పెరిగి 11,057.85 వద్ద ముగిసింది. అయితే, మార్కెట్లు ఇకముందూ ఎక్కువ అస్థిరతలతో ఉండొచ్చని,

Most from this category