News


భారీ ర్యాలీకి కారణాలు..

Monday 23rd September 2019
Markets_main1569236956.png-28500

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో గత సెషన్‌ నుంచి మార్కెట్‌లు దూసుకుపోతున్నాయి. గత సెషన్‌లో ప్రారంభమైన మార్కెట్‌ల ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించి 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు లాభపడి 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం.
మార్కెట్‌లు ఇంతలా పెరగడానికి గల కారణాలు...
కార్పోరేట్‌ పన్నును తగ్గించడం:
ప్రభుత్వం రూ. 1.45 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనాన్ని, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం ద్వారా దేశీయ కంపెనీలకు అందించింది. ఫలితంగా దేశీయ, విదేశీ బ్రోకరేజిలు మార్కెట్‌పై తమ అంచనాలను తిరిగి మార్చుకోవలసి వచ్చింది. ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను (సర్‌చార్జీ, సెస్స్‌లు కలిపి) 34.9 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీనితోపాటు మ్యాట్‌(మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ ట్యాక్స్‌)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. అక్టోబర్‌ 1న లేదా ఈ తేదీ తర్వాత ఏర్పాటయ్యి, 2023లోపు ఉత్పత్తిని ప్రారంభించే కంపెనీలపై ట్యాక్స్‌ను 17 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని తరగతుల ఇన్వెస్టర్ల మూలధన లాభాలపై విధించే అదనపు సర్‌చార్జీని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జులై 5 వ తేదిలోపు బై బ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలపై బై బ్యాక్‌ ట్యాక్స్‌ను తొలగించింది. వీటి ఫలితంగా కేవలం రెండు సెషన్‌లలోనే సెన్సెక్స్‌ 3,000 పాయింట్లను ఆర్జించి, 39,000 మార్కును సునాయాసంగా అధిగమించింది.
లాభాల వృద్ధి అంచనాలను పెంచడం:
ట్యాక్స్‌ కట్‌ను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా వరకు ఇన్వెస్టర్లు, బ్రోకరేజిలు, విశ్లేషకులు తమ లాభాల వృద్ధి అంచనాలను అధిక మార్జిన్‌తో సవరించుకున్నారు. అంతేకాకుండా నిఫ్టీ లేదా సెన్సెక్స్‌ టార్గెట్‌లను కూడా సవరించారు. ఆర్థిక సంవత్సరం 2020లో లాభాల వృద్థిని చాలా వరకు విశ్లేషకులు 8-10 శాతం పెంచారు. దీనితోపాటు వచ్చే సంవత్సర కాలానికి గాను నిఫ్టీ లేదా సెన్సెక్స్‌ అంచానాలను 15-20 శాతం వరకు సవరించడం గమనించదగ్గ విషయం.

   ట్యాక్స్‌ తగ్గింపు వలన లాభాల వృద్ధి పెరిగే అవకాశం ఉందని, సెన్సెక్స్‌ లాభాల వృద్ధి అంచనాలను 2020కి గాను 25 శాతానికి, 2021 కి గాను 23 శాతానికి మోర్గాన్ స్టాన్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిధమ్ దేశాయ్ పెంచారు. అంతేకాకుండా సెన్సెక్స్‌ టార్గెట్‌ను(జూన్‌ 2020 నాటికి) 45,000 కు పెంచారు. ‘10 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో నిఫ్టీ ఈపీఎస్‌ అంచనాలను 8-10 శాతం నవీకరించవలసి వచ్చింది. కానీ అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మార్కెట్‌లో జరిగిన వృద్ధి, పాలసీ ఆదారంగా జరిగిందని గుర్తుంచుకోవాలి. గతంలో సంస్కరణల తర్వాత మార్కెట్‌ ఆదాయాలు నిరాశకు గురిచేసిన విషయం విధితమే’ అని యుబీఎస్‌ సెక్యూరిటీస్ ఇండియా, గౌతమ్ చౌచారియా అన్నారు.
జీఎస్‌టీ రేట్‌ల కోత: 
సెప్టెంబర్‌ 20 వ తేదిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, 37 వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పలు జీఎస్‌టీ(గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) రేట్లకు సవరణలను చేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా అనేక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. రూ. 7,500 లేదా అంత కంటే అధికంగా చార్జీ(ఒక రోజుకు) చేస్తున్న హోటల్‌ రూమ్‌లపై 18 శాతం వరకు సుంకాన్ని విధించారు. అదే విధంగా రూ. 7,500 కంటే తక్కువగా ఉన్న రూమ్‌లపై విధించే సుంకాన్ని 12 శాతానికి తగ్గించారు. వీటితోపాటు రూ .1000 కన్నా తక్కువ చార్జీ(ఒక రోజుకు) కలిగిన రూమ్‌లపై విధించే జీఎస్‌టీ సుంకాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ రద్దు చేయడం గమనార్హం.
   వీటితో పాటు రైల్వే వ్యాగన్లు, బోగీలపై జీఎస్‌టీ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 12 శాతానికి పెంచగా, అదనంగా 12 శాతం జీఎస్‌టీ పరిహార సెస్‌తో కలిపి కెఫిన్ పానీయాలపై 18 శాతం నుంచి 28 శాతానికి జీఎస్‌టీ రేటును పెంచారు.  10-13 సీట్ల సామర్ధ్యం కలిగిన ప్యాసింజర్ వాహనాలపై (పీవీ)విధిస్తున్న జీఎస్‌టీ సెస్‌ను 1-3 శాతానికి తగ్గించగా, నిర్ధిష్ఠ రక్షణ వస్తువుల దిగుమతులపై జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ మినహాయింపులను 2024 వరకు పొడిగించారు. ఇండియాలో జరగనున్న అండర్ -17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు సరఫరా చేసే వస్తువులపై జీఎస్‌టీని తొలగించారు. ఎండిన చింతపండుపై జీఎస్‌టీని జీఎస్‌టీ కౌన్సిల్‌ తొలగించింది.
చైనా-యుఎస్‌ ట్రేడ్‌వార్‌ ఒత్తిళ్లు తగ్గడం: 
చైనా- యుఎస్‌ మధ్య వాణిజ్య చర్చలను అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించాలనే ఇరు దేశాలు నిర్ణయించుకోవడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ఒత్తిళ్లు కొంత మేర తగ్గాయి. ట్రేడ్‌ వార్‌లో భాగంగా యుఎస్‌ వ్యవసాయ ఉత్పత్తుల  కొనుగోళ్లను నిలిపి వేసిన చైనా, తిరిగి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని యుఎస్‌ తెలిపింది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 250 బిలియన్‌ డాలర్లపై తాజాగా విధించిన సుంకాలను అక్టొబర్‌ 15 వరకు యుఎస్‌ ప్రభుత్వం నిలిపివేసింది.  కాగా వచ్చే వారంలో గురువారం, శుక్రవారం జరగనున్న చైనా- యుఎస్ ప్రతినిధుల సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్ఠి సారించనున్నారు. దీనితో పాటు అక్టోబర్‌లో కూడా ఇరు దేశాల మధ్య  వాణిజ్య సమావేశం జరగనుంది. వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు కొత్త రౌండ్ల చర్చలకు సిద్ధమయ్యారు.



You may be interested

బుల్లిష్‌గా మారిన ఎఫ్‌పీఐలు

Monday 23rd September 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ప్రశంసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్‌ తర్వాత నుంచి భారత మార్కెట్‌ విషయంలో వారు బేరిష్‌ ధోరణితో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. సుమారు రూ.30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బడ్జెట్‌లో వృద్ధిని పెంచే చర్యలు లోపించడం, జూన్‌ క్వార్టర్‌ జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోవడం ఎఫ్‌పీఐలను అమ్మకాల వైపు నడిపించిందని చెప్పుకోవాలి.

రెండోరోజూ అదే జోరు..!

Monday 23rd September 2019

39000పైన సెన్సెక్స్‌, 11600 పైన ముగిసిన నిఫ్టీ సూచీల చరిత్రలో రెండురోజుల్లో అతిపెద్ద ర్యాలీ మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు గత వారాంతంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపనల ఉత్సాహంతో మార్కెట్లో రెండోరోజూ బుల్‌రన్‌ కొనసాగింది. సోమవారం సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించిన 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదే

Most from this category