News


2019: ఎఫ్‌పీఐల పెట్టుబడుల రికార్డ్‌

Friday 27th December 2019
Markets_main1577436123.png-30478

2019లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల దూకుడు
దేశీ కేపిటల్‌ మార్కెట్లో రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌
ఎఫ్‌పీఐల బాటలో నడిచిన దేశీ ఫండ్స్‌
పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ కేపిటల్‌ మార్కెట్లపట్ల అత్యంత ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఫలితంగా ఈ నెల మూడో వారం వరకూ పరిగణిస్తే.. అటు  స్టాక్స్‌, ఇటు రుణ సెక్యూరిటీలలో కలిపి రూ. ఒక ట్రిలియన్‌కుపైగా పెట్టుబడులను కుమ్మరించారు. ఈ ట్రెండ్‌ ఆధారంగా వచ్చే ఏడాది(2020)లో సైతం ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు కొనసాగవచ్చని  కొంతమంది మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు తిరిగి తలెత్తడం, దేశీయంగా రుణ మార్కెట్లలో పరిస్థితులు క్షీణించడం వంటి ప్రతికూల అంశాలు  ఎదురైతే ఎఫ్‌పీఐలు అమ్మకాల యూటర్న్‌ తీసుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. 

ఈక్విటీలదే హవా
ఈ ఏడాది దేశీ కేపిటల్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 1.3 లక్షల కోట్లను(దాదాపు 19 బిలియన్‌ డాలర్లు) ఇన్వెస్ట్‌ చేశారు. వీటిలో రూ. 97,250 కోట్లను ఈక్విటీల కొనుగోలుకి వెచ్చించడం విశేషం..  ఇవి గత ఆరేళ్ల కాలంలోనే అత్యధిక పెట్టుబడులుకాగా.. ఇంతక్రితం 2013లో ఈక్విటీలలో రూ. 1.13 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. కాగా.. 2019లో ఇప్పటివరకూ రుణ సెక్యూరిటీల(డెట్‌  మార్కెట్‌)లో ఎఫ్‌పీఐలు రూ. 27,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. హైబ్రిడ్‌ ఫండ్స్‌లో సైతం రూ. 9,000 కోట్లను కుమ్మరించారు. జీడీపీ మందగమనం, ద్రవ్యలోటు వంటి ప్రతికూల పరిస్థితు‍ల్లోనూ ఎఫ్‌పీఐలు  దేశీ కేపిటల్‌ మార్కెట్ల ఆసక్తిని చూపడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

కారణాలేవిటంటే?
దేశీ కేపిటల్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరుకు పలు అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు, పలు దేశాల కేంద్ర బ్యాంకుల నిధుల విడుదల, దేశీయంగా కార్పొరేట్‌ ఆర్జనలు పుంజుకోగలవన్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపువైపు మొగ్గు చూపిన విషయాన్నిఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఫెడ్‌ ఈ ఏడాది మూడు సమీక్షలలో భాగంగా ఫండ్స్‌ రేట్లలో 0.75 శాతం కోత పెట్టింది. అయితే అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు తిరిగి తలెత్తడం,  ముడిచమురు ధరలు పెరగడం, దేశీయంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నెలకొన్న రుణ సంక్షోభం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాంకులు, బీమా కంపెనీలు
ఈ ఏడాది ఎఫ్‌పీఐలను అధికంగా ఆకర్షించిన రంగాలలో బ్యాంకులు, చమురు -గ్యాస్‌, బీమా రంగాలను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. ఎఫ్‌పీఐల పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది కొన్ని ప్రయివేట్‌ రంగ బ్యాంకు కౌంటర్లు ర్యాలీ చేయగా.. పలు బీమా రంగ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన విషయాన్ని మార్కెట్‌ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

ఫేవరెట్‌ స్టాక్స్‌
ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో సుమారు 80 కంపెనీలలో ఎఫ్‌పీఐలు వాటాలను పెంచుకుంటూ వచ్చారు. మరోవైపు ఐపీవోలలోనూ ఇన్వెస్ట్‌ చేశారు. ఎఫ్‌పీఐలకు ఫేవరెట్లుగా నిలిచిన స్టాక్స్‌లో మిశ్రధాతు నిగమ్‌,  ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ, యాస్టర్‌ డీఎం, గ్రీవ్స్‌ కాటన్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, బాటా ఇండియా, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌, ట్రైడెంట్‌, కోల్‌ ఇండియా, గ్రాన్యూల్స్‌, వైభవ్‌ గ్లోబల్‌ తదితరాలున్నట్లు ఏస్‌  ఈక్విటీ డేటా పేర్కొంది. ఇక బీమా రంగంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్‌ చేసినట్లు ఏస్‌ ఈక్విటీ డేటా తెలియజేసింది.

ఎఫ్‌పీఐల స్టాక్స్‌ షాపింగ్‌
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఐసీఐసీఐ లంబార్డ్‌
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌
మిశ్రధాతు నిగమ్‌
ఆస్ట్రాజెనెకా ఫార్మా
ఎల్‌అండ్‌టీ టెక్‌
యాస్టర్‌ డీఎం

ఎంఎఫ్‌ల సంగతేంటి?
2019లో దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాయి. అత్యధిక శాతం ఫండ్‌ మేనేజర్లు లార్జ్‌ క్యాప్‌ కౌంటర్లలో పెట్టుబడులకే కట్టుబడినట్లు మార్నింగ్‌ స్టార్‌  డేటా పేర్కొంది. ఈ వివరాల ప్రకారం ఎంఎఫ్‌ పెట్టుబడులలో అత్యధిక శాతం ప్రయివేట్‌ రంగ బ్యాంకుల విభాగంలోకే మళ్లింది. ఫండ్స్‌ షాపింగ్‌ జాబితాలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,  ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితరాలున్నాయి. నవంబర్‌కల్లా మొత్తం ఫండ్స్‌ ఆస్తుల విలువ రికార్డుస్థాయిలో రూ. 27 లక్షల కోట్లను అధిగమించినట్లు డేటా తెలియజేసింది. ఫండ్స్‌ 2019లో ఇప్పటివరకూ ఈక్విటీలలో రూ. 54,390 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మరోపక్క డెట్‌ మార్కెట్లో రూ. 516598  కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. 

ఫండ్స్‌ పెట్టుబడి జాబితా
యాక్సిస్‌ బ్యాంక్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ఎన్‌టీపీసీ
ఆర్‌ఐఎల్‌
ఎల్‌అండ్‌టీ
ఐసీఐసీఐ బ్యాంక్‌
కొటక్‌ మహీంద్రా



You may be interested

స్వల్ప కాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 27th December 2019

నాలుగు రోజుల నష్టాల ముగింపు అనంతరం శుక్రవారం సూచీలు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కారణమైంది. మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 350 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ 12200 పైన ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన షేర్ల ర్యాలీ సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ నిపుణులు స్వల్పకాలికానికి కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు. కునాల్‌ బోత్రా నుంచి 

ప్రపంచ మార్కెట్ల తీరు... టాప్‌లో బ్రెజిల్‌...దిగువన ఇండియా

Friday 27th December 2019

ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. వర్ధమాన మార్కెట్‌ బ్రెజిల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే దేశీ మార్కెట్లు రిటర్నుల జాబితాలో టాప్‌-10లో దాదాపు అట్టడుగున నిలిచాయి. ఇందుకు పలు అంశాలు కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాది ప్రారంభం‍లో 2018 ఒడిదొడుకులు కొనసాగగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, బ్రెక్సిట్‌పై కొనసాగిన అనిశ్చితి, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి అంశాలు తొలుత మార్కెట్లకు సవాళ్లు

Most from this category