News


ఎన్నికల ఫలితాలే దిక్సూచి

Monday 20th May 2019
Markets_main1558341545.png-25839

  • ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్‌ ప్రభావం
  • మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు
  • ఆర్థిక ఫలితాలు కూడా కీలకం

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌, ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపనున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే దాకా అనిశ్చితి నెలకొనవచ్చని పేర్కొన్నారు. "మార్కెట్‌కు దీర్ఘకాలికంగా దిశా నిర్దేశం చేయగల పరిణామం ఈ వారం చోటు చేసుకోనుంది. సంపద సృష్టిలో కూడా ఇదే కీలకాంశం కాగలదు. సాధారణంగా ఎన్నికల ఫలితాల్లాంటి పరిణామాలు కొన్ని సంవత్సరాల దాకా ట్రెండ్స్‌ను నిర్దేశిస్తుంటాయి. కాబట్టి ఎకానమీకి, ఇన్వెస్టర్లకు ఇలాంటివి చాలా కీలకం" అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. సాధారణంగానైతే మార్కెట్లు ఏదో ఒక వైపు భారీగా కదిలే అవకాశం ఉన్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ కారణంగా కొంత అనిశ్చితి కూడా నెలకొందని ఆయన పేర్కొన్నారు. "ఈ వారంలో అందరి దృష్టి స్టాక్‌ కోట్స్ కాకుండా వోట్ కోట్స్‌పై ఉంటుంది" అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌ నోట్‌ వ్యవస్థాపక సీఈవో జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. "మార్కెట్లు ఇప్పటికీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో ట్రేడవుతోంది. దానికి భిన్నంగా జరిగితే తీవ్ర నిరుత్సాహం ఉంటుంది. అదే సానుకూల ఫలితాలు వస్తే మార్కెట్లు ఓ మోస్తరుగా ర్యాలీ చేయొచ్చు" అని ఎడెల్‍వీజ్ సెక్యూరిటీస్‌ ఫారెక్‌ అండ్ రేట్స్ విభాగం హెడ్ సజల్ గుప్తా తెలిపారు. 

కంపెనీలపై ఆర్థిక ఫలితాల ప్రభావం...
టాటా మోటార్స్‌, కెనరా బ్యాంక్‌, సిప్లా వంటి దిగ్గజ సంస్థలు ఈ వారంలోనే తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. భారత్‌ ఫోర్జ్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా, హిందుస్తాన్ పెట్రోలియం, డీఎల్‌ఎఫ్‌, జిందాల్ స్టీల్ అండ్ పవర్‌, బీఈఎంఎల్‌, ఇండియా సిమెంట్స్, ఎన్‌టీపీసీ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల షేర్లపై వాటి ప్రభావం ఉండనుంది. ఇవి కాకుండా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ముడి చమురు రేట్లు, రూపాయి కదలికలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణి మొదలైనవి ట్రేడింగ్ సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెప్పారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అస్పష్టత కొనసాగుతున్నప్పటికీ దేశీ మార్కెట్లు పటిష్టతని కనపర్చాయని సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వీపీ జగన్నాధం తునుగుంట్ల చెప్పారు. 
    క్రితం వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,931 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,407 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సాంకేతికంగా నిఫ్టీకి 11-227-11,180 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్‌ దీపక్ జాసాని పేర్కొన్నారు. పుల్‌బ్యాక్ ర్యాలీ గానీ జరిగితే 11,457 వద్ద నిరోధం ఉండొచ్చని తెలిపారు. రూపాయి మారకం విలువ గత వారం 31 పైసలు క్షీణించి 70.23 వద్ద క్లోజయ్యింది. ఈ వారం రూపాయి 69.20-70.80 మధ్య ట్రేడ్ కావొచ్చని ఎడెల్‌వీజ్ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 

రూ. 6వేల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వెనక్కి...
గత మూడు నెలలుగా భారత క్యాపిటల్ మార్కెట్స్‌లో (ఈక్విటీ, డెట్‌) ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ. 6,399 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించారు. ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే, మే లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ నమోదైంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం  మే 2-17 మధ్య కాలంలో ఈక్విటీల నుంచి రూ. 4,786 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ. 1,613 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు. ఇది పూర్తిగా ఊహించని పరిణామమేమీ కాదని .. దేశ, విదేశాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. You may be interested

మా మనసంతా మైండ్‌ట్రీ మీదే

Monday 20th May 2019

మరోసారి స్పష్టం చేసిన ఎల్‌అండ్‌టీ నాయక్‌  పెద్ద ఐటీ సంస్థగా మారుస్తామని ప్రకటన న్యూఢిల్లీ: మైండ్‌ట్రీ కొనుగోలు అన్నది తమకు అత్యంత ముఖ్యమైనదిగా ఎల్‌అండ్‌టీ గ్రూపు చైర్మన్‌ ఏఎం నాయక్‌ పేర్కొన్నారు. మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీ వాటా 26 శాతానికి చేరిందని, అదనపు వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ మరో పది రోజుల్లో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘‘అవకాశాల కోసం ఎప్పుడూ చూస్తుంటాం. అయితే, ప్రస్తుతానికి మా మనసంతా మైండ్‌ట్రీపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ

తగ్గిన బంగారం

Monday 20th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం భారీగా తగ్గింది. డాలర్‌ మారకంలో రూపాయి బాగా బలపడటం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర మధ్యాహ్నం గం.12:45ని.లకు రూ.355లు నష్టపోయి రూ.31436.00ల ట్రేడ్‌ అవుతోంది. కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ పార్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంచనాలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 86పైసలు బలపడి 2వారాల గరిష్టస్థాయి రూ. 69.40 స్థాయికి పెరిగింది. ఈ

Most from this category