News


ఐపీఓ.. అంతంత మాత్రమే !

Monday 16th September 2019
Markets_main1568606525.png-28389

  • ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్‌
  • తగ్గిన ఐపీఓల జోరు 
  • 11 కంపెనీలు.. 10,300 కోట్ల సమీకరణ 
  • రానున్న మూడు నెలల్లో అరకొరగానే ఐపీఓలు

ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ అంతంతమాత్రంగానే ఉండటం  ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. గత ఏడాది మొత్తం 24 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్ల నిధులు సమీకరిస్తే, ఈ ఏడాది ఇప్పటివరకూ 11 కంపెనీలు రూ.10,300 కోట్ల మేర మాత్రమే నిధులను సమీకరించగలిగాయి. ఇక 2017లో మాత్రం ఐపీఓల జోరు బాగా ఉంది. ఆ ఏడాది మొత్తం 36 కంపెనీలు ఐపీఓల ద్వారా రికార్డ్‌ స్థాయిలో రూ.68,000 కోట్లు సమీకరించగలిగాయి. 

ఐపీఓ సమస్యలు కొనసాగుతాయ్‌...
కాగా మరో మూడు నెలల్లో ఈ ఏడాది పూర్తికావస్తున్నా, ఐపీఓలు అంతంతమాత్రంగానే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ కారణాల వల్ల స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవడంతో రానున్న నెలల్లో ఐపీఓ మార్కెట్‌కు సమస్యలు కొనసాగుతాయని వారంటున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఓ కోసం దాదాపు 23 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఐపీఓలకు రావడానికి ఇప్పటికే 20కు పైగా కంపెనీలకు సెబీ గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చింది. కానీ ఐపీఓకు రావడానికి ఈ కంపెనీలు సంశయిస్తున్నాయి. మరో రెండు నెలల్లో కొన్ని కంపెనీలకు  సెబీ ఇచ్చిన గ్రీన్‌ సిగ్నల్‌ మురిగిపోనున్నది. సెబీ ఆమోదం పొందిన ఏడాదిలోపు కంపెనీ ఐపీఓకు రావాలి. లేని పక్షంలో ఆ ఆమోదం రద్దువుతుంది. అప్పుడు సదరు కంపెనీ మళ్లీ సెబీ ఆమోదం కోసం తాజాగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

ఐపీఓల నీరసానికి కారణాలివే....
2017, 2018 సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది ఐపీఓలు నీరసించడానికి ఎన్నో కారణాలున్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం దీనికి కొన్ని కారణాలని నిపుణులంటున్నారు.  ఇలాంటి కారణాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని, దీంతో ఐపీఓ మార్కెట్‌ నీరసపడిందని వారంటున్నారు. స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా ట్రేడవడం, ఐపీఓల పట్ల ఇన్వెస్టర్ల అనాసక్తత కారణంగా కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేసుకుంటున్నాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో భారీగా కరెక్షన్‌ జరిగిందని, ఇది ఐపీఓలపై తీవ్రంగానే ప్రభావం చూపించిందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ నవీన్‌ కుల్‌కర్ణి పేర్కొన్నారు. 
ఇతర మార్గాల వైపు చూపు...
గత ఏడాది  90 కంపెనీలకు పైగా ఐపీఓ సంబంధిత పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ-డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌) సెబీకి సమర్పించాయని మోతిలాల్‌ ఓస్వాల్‌ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ఈడీ ముకుంద్‌ రంగనాధన్‌ పేర్కొన్నారు.  వీటిల్లో కొన్ని మాత్రమే విజయవంతంగా ఐపీఓకు వచ్చాయని తెలిపారు. మార్కెట్‌ పరిస్థితి బాగా లేకపోవడంతో నిధుల సమీకరణ ‍కోసం కంపెనీలు ఐపీఓల మార్గం కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ అంతంతమాత్రంగానే ఉండటంతో ఇప్పుడు డీఆర్‌హెచ్‌పీల సంఖ్య కూడా తగ్గుతోందని వివరించారు. 

సమంజస ధరే కీలకం...
ఈ ఏడాది రాశి పరంగా ఐపీఓలు తగ్గినా, ఇన్వెస్టర్లకు మంచి రాబడులే ఇచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన 11 కంపెనీల్లో దాదాపు సగానికి పైగా కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే ఇచ్చాయి. ఇష్యూ ధరతో పోల్చితే ఇవి ప్రస్తుతం ఎక్కువ ధరకే ట్రేడవుతున్నాయి. ఆ యా కంపెనీలు సమంజసమైన ధరలను నిర్ణయించడమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. 

ఎస్‌బీఐ సాధారణ బీమా ఐపీఓ వాయిదా !
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన సాధారణ బీమా విభాగం ఐపీఓను వాయిదా వేసింది. అదనపు మూలధనం ప్రస్తుతానికి అవసరం లేకపోవడంతో ఎస్‌బీఐ సాధారణ బీమా ఐపీఓ ఆలోచనను అటకెక్కించామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. కార్డ్‌ బిజినెస్‌కు సంబంధించి ఇన్వెస్టర్ల ఆసక్తి అధిక స్థాయిలో ఉందని,  ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓకు వస్తుందని పేర్కొన్నారు. ఎస్‌బీఐ కార్డ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఉన్నారని, ఐపీఓ ఎప్పుడా, ఎప్పుడా అని వారు ఎదురు చూస్తున్నారని వివరించారు.You may be interested

తగ్గిన మారుతీ సుజుకీ మార్కెట్‌ వాటా

Monday 16th September 2019

ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో 2 శాతం పతనం న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో గణనీయంగా తగ్గాయి. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ కాలంలో 11,09,930 యూనిట్లు అమ్ముడు కాగా, గతేడాది ఇదే కాలంలో 14,51,647 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  ద్రవ్యలభ్యత కొరత, అధిక బీమా, భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 16th September 2019

ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర భారీగా పెరగడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 180 పాయింట్ల నష్టంతో 37,205 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,995 పాయింట్ల వద్ద మొదలయ్యాయి.  సౌదీ అరేబియలో రెండు చమురు ఉత్పాదక కేంద్రాలపై గత శనివారం టెర్రరిస్టులు...ద్రోణులతో జరిపిన దాడుల ప్రభావంతో సౌదీ చమురు ఉత్పాదక సామర్థ్యం 50 శాతం తగ్గుతుందని, తద్వారా చమురు ఎగుమతులు 5-6

Most from this category